నోలన్ అసలు స్మార్ట్ ఫోన్ ఈమెయిల్ వాడడట
ది హాలీవుడ్ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోలన్ పలు ఆసక్తికర విషయాలను ముచ్చటించారు.
By: Tupaki Desk | 16 July 2023 11:01 AM GMTఅధునాతన ప్రపంచంలో స్మార్ట్ ఫోన్.. ఈమెయిల్స్ లేనిదే ఏదీ లేదు. సాంకేతిక సాధనాలను ఉపయోగించని ప్రజలు లేనేలేరు. కానీ సదరు స్టార్ డైరెక్టర్ ఆలోచనలు అందుకు పూర్తి భిన్నం. కనీసం స్మార్ట్ ఫోన్ ని కానీ ఈమెయిల్ ని కానీ ఉపయోగించడట. తన ల్యాప్ టాప్ కి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదని వెల్లడించాడు. 52 ఏళ్ల దర్శకుడు చాలా సులభంగా పరధ్యానంగా ఉంటాడని ఒప్పుకున్నాడు. రోజంతా స్మార్ట్ ఫోన్ లో దూరి ఉండటం నాకు ఉపయోగకరం కాదు! అని అన్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ డైరెక్టర్ అంటే 'ఓప్పెన్ హైమర్' తో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు నోలన్ గురించే ఇదంతా.
క్రిస్టోఫర్ నోలన్ తాజా ఇంటర్వ్యూలో స్మార్ట్ ఫోన్ ను తనతో ఎందుకు ఉంచుకోడు? ఇమెయిల్ ను ఎందుకు ఉపయోగించడు? అనేదాని గురించి వివరించాడు. నిజానికి క్రిస్టోఫర్ నోలన్ తన అద్భుతమైన చిత్రాలలో సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. సాంకేతికత నేపథ్యంలోనే అద్భుతమైన స్క్రీన్ ప్లేలతో సినిమాలు తీయడం తన అలవాటు. అయితే నోలన్ నిజ జీవితంలో వాటికి దూరంగా ఉండటానికే ఇష్టపడతాడు. అతడు స్మార్ట్ ఫోన్ ని ఉంచుకోడు.. ఇమెయిల్ ను ఉపయోగించడు. నిజానికి అతని ల్యాప్ టాప్ కు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు. నోలన్ ఇటీవలి ఇంటర్వ్యూలో డిజిటల్ యుగంలో కూడా వీటన్నింటికీ ఎందుకు దూరంగా ఉంటాడో వివరించారు.
ది హాలీవుడ్ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోలన్ పలు ఆసక్తికర విషయాలను ముచ్చటించారు. ''నా పిల్లలు నేను పూర్తిగా లుడిట్ అని చెప్పవచ్చు. సాంకేతికత దాని పనితీరు అందించే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నేను నమ్ముతాను. కానీ నా వ్యక్తిగత ఎంపిక వేరు.. నా ఆలోచనల్లో పరధ్యాన స్థాయికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. నేను నా మెటీరియల్ (సబ్జెక్ట్) ని రూపొందిస్తున్నట్లయితే నా వోన్ స్క్రిప్ట్ లను రాస్తుంటే రోజంతా స్మార్ట్ ఫోన్ లో ఉండటం నాకు ఉపయోగకరం కాదు'' అని తెలిపారు.
క్రిస్టోఫర్ నోలన్ ఇంటర్వ్యూపై నెటిజనుల స్పందనలు ఆసక్తికరం. ఒక ట్విట్టర్ వినియోగదారు నోలన్ ని సమర్థిస్తూ ప్రజల వైపు వేలెత్తి చూపారు. ''అతడు తెరకెక్కించిన అత్యంత పాపులర్ చిత్రంలో స్మార్ట్ ఫోన్ లు ఎంత ప్రమాదకరమైనవో చూపించారు'' అని వ్యాఖ్యానించగా..''మనమంతా మన జీవితాల్లో కొంత వరకు ఆయన అడుగుజాడలను అనుసరించాలి. అటువంటి హైపర్ ఇంటర్ కనెక్ట్డ్ వాతావరణంలో కూడా ఆరోగ్యకరమైన స్థాయి టెక్నాలజీ డిటాక్స్ చాలా ఉపయోగకరం'' అని రాసారు. ''నోలన్ నిజంగా ఈ తరానికి చెందిన తెలివైన దర్శకుడు'' అని మరొకరు ప్రశంసించారు.
ఓప్పెన్ హైమర్ సంగతులు ప్రస్తుతం నోలన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓపెన్ హైమర్' ఈనెల 21న విడుదలవుతోంది. అణు భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అణుబాంబ్ తయారీ విధ్వంశం నేపథ్యంలో రక్తి కట్టించే చిత్రమిది. ఇందులో సిలియన్ మర్ఫీ టైటిల్ పాత్రలో నటించారు. రాబర్ట్ డౌనీ జూనియర్ - ఎమిలీ బ్లంట్ తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రం జూలై 21న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది.