Begin typing your search above and press return to search.

రివ్యూ: సమంత 'సిటాడెల్‌: హనీ బన్నీ' ఎలా ఉందంటే?

ఓవరాల్ గా 'సిటాడెల్‌: హనీ బన్నీ' సిరీస్ లో 'ఫ్యామిలీ మ్యాన్‌' రేంజ్ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి నిరాశ కలిగిస్తుంది.

By:  Tupaki Desk   |   7 Nov 2024 2:18 PM GMT
రివ్యూ: సమంత సిటాడెల్‌: హనీ బన్నీ ఎలా ఉందంటే?
X

సమంత రూత్ ప్రభు, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ''సిటాడెల్‌: హనీ బన్నీ''. రూసో బ్రదర్స్ తీసిన సిటాడెల్ అనే అమెరికన్ సిరీస్ కు ఇండియన్‌ అడాప్షన్ ఇది. 'ఫ్యామిలీ మ్యాన్‌', 'ఫర్జీ' 'గన్స్ అండ్ గులాబ్స్' వంటి సక్సెస్ ఫుల్ సిరీస్‌లతో అలరించిన దర్శక ద్వయం రాజ్‌ & డీకే ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ను రూపొందించారు. ఇందులో కేకే మేనన్‌, సిమ్రాన్, తలైవాసల్ విజయ్‌, సికందర్‌ ఖేర్‌, షకీబ్‌ సలీమ్‌ కీలక పాత్రలు పోషించారు. 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' తర్వాత సామ్ నటించిన సిరీస్ కావడంతో తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.

'సిటాడెల్‌: హనీ బన్నీ' కథంతా 1992 - 2000 మధ్య కాలంలో ముంబై, నైనిటాల్‌ నగరాలలో ప్రధానంగా జరుగుతుంది. నటి అవ్వాలని కలలు కనే హనీ (సమంత) ముంబైకి పారిపోయి వస్తుంది. ఇండస్ట్రీకి రావడానికి కష్టపడుతున్న ఆమెకు స్టంట్ మాస్టర్ బన్నీ (వరుణ్ ధావన్) తో పరిచయం ఏర్పడుతుంది. వారి మధ్య స్నేహం చివరికి ప్రేమగా మారుతుంది. అయితే బన్నీ తనని పెంచి పెద్ద చేసిన బాబా (కే కే మీనన్) నేతృత్వంలోని ప్రైవేట్ సీక్రెట్ ఏజెన్సీకి గూఢచారిగా రహస్య జీవితాన్ని గడుపుతుంటాడు. తనకు కూడా ఏజెంట్ గా ట్రైనింగ్ ఇవ్వమని హనీ కోరడంతో, అయిష్టంగానే బాబా ఆమెను తన టీంలో చేరడానికి అనుమతిస్తాడు. కఠినమైన ట్రైనింగ్ తర్వాత ఆమె వారితో కలిసి మిషన్లలో పాల్గొంటుంది.

డాక్టర్ రఘు (తలైవాసల్ విజయ్) రూపొందించిన వెపన్స్ ప్రోగ్రామ్ ను అడ్డుకోడానికి ప్రత్యర్థి గూఢచారి సంస్థ అయిన సిటాడెల్ చేపట్టిన ఆపరేషన్ తల్వార్‌ను విధ్వంసం చేయడం బాబా సీక్రెట్ ఏజెన్సీ మెయిన్ మిషన్. ఒక పెద్ద యాక్సిడెంట్ తర్వాత హానీ చనిపోయిందని బన్నీతో సహా అందరూ నమ్ముతారు. కానీ ఆమె బ్రతికే ఉంటుంది. నదియా అనే తన బిడ్డతో కలిసి జీవిస్తూ ఉంటుంది. అయితే హనీ, ఆమె కూతురిని చంపడానికి బాబా తన మనుషులను పంపిస్తాడు. మరోవైపు చాలా ఏళ్ళ తర్వాత హనీ బతికే ఉందని తెలుసుకున్న బన్నీ.. ఆమెను వెతుక్కుంటూ విదేశాల నుంచి బయలుదేరుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? హనీ తన కుమార్తెను కాపాడుకోడానికి ఎలాంటి ఫైట్ చేసింది? చివరకు హనీని బన్నీ కలిశాడా? ఒకవైపు బాబా ఏజెన్సీ, మరోవైపు సిటాడెల్ ఏజెన్సీ వెతుకుతున్న అర్మార్డ్‌ అనే వస్తువు ఏంటి? అనేది తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.

'సిటాడెల్‌: హనీ బన్నీ' సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా తీసుకొచ్చారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు 50 నిముషాలు ఉంది. పైన చెప్పుకున్న కథను నాన్‌-లీనియర్‌ స్క్రీన్‌ప్లేతో నడిపించారు రాజ్‌ అండ్‌ డీకే. ప్రతి ఎపిసోడ్‌ ను రెండు భాగాలుగా.. ఒకటి 1992లో, మరొకటి 2000 సంవత్సరంలో జరుగుతున్నట్లు చూపించారు. ప్రెజెంట్ స్టోరీని, ఫ్లాష్‌ బ్యాక్‌ తో కనెక్ట్‌ చేస్తూ ఎలాంటి గందరగోళం లేకుండా చూపించే ప్రయత్నం చేసారు. అయితే రొటీన్ స్టోరీ కావడం, ఎమోషన్స్ పెద్దగావర్కౌట్ అవ్వకపోవడం ఈ సిరీస్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడానికి కారణమయ్యాయి.

అన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్స్ మాదిరిగానే ఈ సిరీస్ లోనూ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కాకపోతే పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం.. ఛేజింగ్‌ సీన్స్ రొటీన్‌గా ఉండటం ప్రతికూలంగా మారింది. ప్రపంచాన్ని శాసించే శక్తిగల అర్మార్డ్‌ ను దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు.. వాటిని సిటాడెల్ టీం అడ్డుకోవడం.. అలానే ప్రధాన పాత్రల్లో నెగెటివ్ షేడ్స్ బయట పడటం.. అర్మార్డ్‌ ను దక్కించుకోవడానికి హనీ, బన్నీలు ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం వంటివి ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. సమంత ఏజెంట్ గా శిక్షణ తీసుకోవడం.. మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు థ్రిల్ కు గురి చేస్తాయి. చివరి అర గంటలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌ గా నిలిచింది.

బన్నీ పాత్రలో వరుణ్‌ ధావన్‌ ఆకట్టుకున్నాడు. హనీ పాత్రకు సమంత న్యాయం చేసింది. యాక్టింగ్ తోనే కాదు.. యాక్షన్‌ సీన్స్ లోనూ అదరగొట్టింది. 90స్ ప్రారంభంలో సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉండేదని ఆమె పాత్ర ద్వారా చూపించారు. వరుణ్‌ - సామ్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య వచ్చే లిప్ లాక్ సీన్స్, పాపతో ఉండే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. టెక్నికల్ గా ఈ సిరీస్ రిచ్ గా ఉంది. కెమెరామెన్ పనితనాన్ని మెచ్చుకొని తీరాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

ఓవరాల్ గా 'సిటాడెల్‌: హనీ బన్నీ' సిరీస్ లో 'ఫ్యామిలీ మ్యాన్‌' రేంజ్ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి నిరాశ కలిగిస్తుంది. ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. నిడివి కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. సెకండ్ సీజన్‌ కోసం ఎదురు చూసేలా స్ట్రాంగ్ పాయింట్‌ తో ఈ సిరీస్ ను ఎండ్ చెయ్యలేదు. అందుకే ఒక యావరేజ్ థ్రిల్లర్ సిరీస్ చూసిన ఫీలింగ్ ఇస్తుంది. యాక్షన్ సీన్స్ ఇష్టపడేవారు.. సమంతను స్పై ఏజెంట్ గా చూడాలనుకునేవారు ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.