2560 కోట్ల బడ్జెట్ సిరీస్‌కి నష్టం 2135 కోట్లు
దాదాపు 2560 కోట్ల బడ్జెట్ (300 మిలియన్ డాలర్లు)తో నిర్మించగా, ఇది ఏకంగా 2135 కోట్ల (250 మిలియన్ డాలర్లు) మేర నష్టపోవాల్సి వచ్చింది.
By: Tupaki Desk | 3 April 2025 2:45 AMనెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలు వెబ్ సిరీస్ ల నిర్మాణం కోసం వందల వేల కోట్ల పెట్టుబడుల్ని వెదజల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ అంతే గొప్పగా ఉంది. చాలా వెబ్ సిరీస్ లు ప్రపంచ దేశాల్లో కోట్లాదిగా ఉన్న ప్రజలను అలరించడంలో విఫలం కాలేదు. కానీ పరాజయం పాలైతే ఎలా ఉంటుందో `సిటాడెల్- సీజన్ 1` నిరూపించింది. భారతీయ కథానాయిక ప్రియాంక చోప్రా ఈ ప్రతిష్ఠాత్మక వెబ్ సిరీస్ లో నటించింది. కానీ దురదృష్టవశాత్తూ ఇది ఆశించిన విధంగా రాణించలేదు.
దాదాపు 2560 కోట్ల బడ్జెట్ (300 మిలియన్ డాలర్లు)తో నిర్మించగా, ఇది ఏకంగా 2135 కోట్ల (250 మిలియన్ డాలర్లు) మేర నష్టపోవాల్సి వచ్చింది. అసాధారణ స్టార్లతో రూపొందించినా కానీ ప్రజలు ఎందుకనో ఆదరించకపోవడంతో వెబ్ సిరీస్ నిర్మాతలను అది కంగారు పెట్టింది.
ఆ తర్వాత సీజన్ 2 సెట్స్ కెళుతుందా? అంటూ చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాగే ప్రైమ్ వీడియోస్ ప్రతినిధులు సీజన్ 2 బడ్జెట్ ని బాగా కుదించారని, పరిమిత బడ్జెట్ తో రెండో సీజన్ రన్ చేయాల్సి రావడం దురదృష్టకరం అని కూడా కథనాలొచ్చాయి. ఈ సీజన్ ఈపాటికే పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ సహా ప్రతిదీ పూర్తి చేసుకుని విడుదల కావాల్సి ఉన్నా, ఆర్థిక కారణాలతో ఇది ఇప్పుడు 2026 కి వాయిదా పడింది.
నవంబర్ 2024 చివరిలో సీజన్ 2 చిత్రీకరణ పూర్తయింది. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి తేవడానికి చాలా సమయం పట్టనుంది. ఈ ఫ్రాంఛైజీతో ముడిపడి ఉన్న స్పిన్ ఆఫ్ లు కూడా ఆలస్యం కావడంతో ఇది చాలా పెద్ద చర్చకు తెర తీసింది. ఆసక్తికరంగా , సిటాడెల్ భారతీయ వెర్షన్ ని రూపొందించిన రాజ్ అండ్ డీకే మాత్రం ఇక్కడ పెద్ద సక్సెస్ చేసి చూపించారు. ఇక్కడ ప్రియాంక చోప్రా పాత్రలో సమంత నటించిన సంగతి తెలిసిందే. సిటాడెల్ - హనీ బన్నీ పేరుతో ఇండియా వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతోంది.