ఆ హీరో నిర్మాతల మధ్య అసలు సమస్య ఏంటి?
అయితే అతను ఫస్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లిన సినిమాని పూర్తి చేయకుండా, తర్వాత కమిటైన చిత్రాలను ముందుగా కంప్లీట్ చేస్తుండటం ఇప్పుడు అనేక పుకార్లు రావడానికి కారణమైంది.
By: Tupaki Desk | 5 Nov 2024 3:56 AM GMTసరైన సక్సెస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు.. ఇటీవల కాలంలో వరుస పరాజయాలు అందుకుంటున్నాడు. ఫ్లాపుల్లో ఉన్నా సరే, మన హీరోకి ఆఫర్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ డోకా లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే అతను ఫస్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లిన సినిమాని పూర్తి చేయకుండా, తర్వాత కమిటైన చిత్రాలను ముందుగా కంప్లీట్ చేస్తుండటం ఇప్పుడు అనేక పుకార్లు రావడానికి కారణమైంది.
ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో సదరు హీరో అప్పుడెప్పుడో ఓ సినిమాని అనౌన్స్ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే బాధ్యత తీసుకుంది. అనుకున్నట్లుగానే షూటింగ్ చేశారు. టైటిల్ ను అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే వరకూ, సినిమా షూటింగ్ అంతా సవ్యంగానే జరిగింది. ఏమైందో ఏమో కానీ, ఈ ప్రాజెక్ట్ అక్కడి నుంచి ముందుకు కదిలినట్లు లేదు. సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అదే సమయంలో ఆ హీరో మరో మూడు కొత్త ప్రాజెక్ట్స్ ను ప్రకటించడమే కాదు, చకాచకా షూటింగ్స్ చేసేస్తున్నాడు.
అయితే హీరో సహకరించకపోవడం వల్లనే ముందుగా చెయ్యాల్సిన సినిమా లేట్ అవుతూ వస్తోందని, అతని కారణంగానే హోల్డ్ లో పడిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అతని తీరుతో నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ముందస్తు సమాచారం లేకుండానే ఇతర నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకొని, కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తూ వాటికి డేట్స్ కేటాయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇక్కడ మరో రూమర్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇందులో ఆ హీరో తప్పేమీ లేదని, నిర్మాతలే ఈ సినిమాను కావాలని హోల్డ్ లో పెట్టారనే టాక్ నడుస్తోంది. అనుకున్న విధంగానే మెల్లగా అప్పుడప్పుడు చిత్రీకరణ చేస్తున్నారని అంటున్నారు. దీనికి కారణం ఆ ప్రొడ్యూసర్ మరో పెద్ద ప్రాజెక్ట్ ను నెత్తికి ఎత్తుకోవడమే అని, ఆ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టడం వెనుక ఇంకో బలమైన రీజన్ కూడా ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
ఇటీవల ఓ క్రేజీ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో సదరు నిర్మాత భారీ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఆ ప్రాజెక్ట్ కు ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే, నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో కుర్ర హీరోతో చేస్తున్న సినిమాని కూడా దానికి లింక్ చేస్తే బిజినెస్ వర్కవుట్ అవుతుందని ప్రొడ్యూసర్ ఆలోచిస్తున్నారట. అలా చేస్తే పెట్టుబడులు, బడ్జెట్ సమస్యలు లేకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారట.
ఇప్పుడు యంగ్ హీరో సినిమాని ఫాస్ట్ గా పూర్తి చేసినా, రిలీజ్ చేసుకోడానికి ఇప్పట్లో సరైన డేట్లు దొరకడం కష్టం. ఓటీటీ స్లాట్స్ కూడా లేవు. కాబట్టి తొందరగా సినిమా కంప్లీట్ చేసినా, థియేటర్లలో విడుదలయ్యే వరకూ ఫైనాన్స్ కి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి. ఎలా చూసుకున్నా ఇది నిర్మాతలకు భారమే. అదే పెద్ద హీరో సినిమా షూటింగ్ షురూ చేసిన తర్వాత, దాంతో పాటుగా ముందుకు తీసుకెళ్తే రెండిటి బిజినెస్ ఒకేసారి చేసుకోవచ్చు.
నిర్మాతలు ఈ ప్లాన్ తోనే చిత్రీకరణ ఆలస్యం చేస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, సినిమా నత్త నడకన సాగడం వల్ల ఇక్కడ అనవసరంగా డైరెక్టర్ విలువైన టైమ్ వేస్ట్ అయిపోతోంది. ఇప్పటికే ఓ స్టార్ హీరో సినిమా కోసం చాలా సమయం పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా లేట్ అవడం ఆయన కెరీర్ కు ఇబ్బందిగా మారుతుంది. మరి త్వరలోనే హీరో, నిర్మాతలు ఆ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.