నాని vs సూర్య: ఈ క్లాష్ లో క్లిక్కయ్యేదెవరో..?
ఏడాది కంటే మునుపే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నా కూడా పోటీగా ఎవరో ఒకరు వచ్చేస్తు ఉంటారు.
By: Tupaki Desk | 9 Jan 2025 8:30 AM GMTఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ క్లాష్ అనేది చాలా కామన్. ఏడాది కంటే మునుపే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నా కూడా పోటీగా ఎవరో ఒకరు వచ్చేస్తు ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్లాష్ కాకుండా చర్చలతో సాల్వ్ చేసుకుంటారు. కానీ మరికొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. ఇతర ఇండస్ట్రీలోని సమానమైన బజ్ ఉన్న సినిమాలు దిగితే ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు నాని vs సూర్య క్లాష్ కూడా అదే తరహాలో ఉండే అవకాశం ఉంది.
టాలీవుడ్‌లో తన సినిమాలను ప్లాన్ చేయడంలో నాని ఎంత అలెర్ట్ గా ఉంటాడో అందరికీ తెలుసు. ఎంత పెద్ద నిర్మాతతో వర్క్ చేస్తున్నా కూడా తన ప్రాజెక్టులకు సంబంధించి ప్రొడక్షన్ షెడ్యూల్స్ నుంచీ రిలీజ్ డేట్స్ వరకు అన్ని చాలా ముందు నుంచే ఖరారు చేస్తుంటాడు. తాజాగా, హిట్ 3 విడుదల తేదీని కూడా మొదటి షెడ్యూల్ మొదలవ్వకముందే ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ క్రైమ్ డ్రామా సినిమాలో నాని పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మే 1 విడుదల కాబోతోంది.
అయితే ఇదే రోజు తమిళ స్టార్ సూర్య తన కొత్త చిత్రం రెట్రోను కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇటీవల ఆయన నటించిన కంగువా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో, ఈసారి సూర్య సీరియస్‌గా తన బిగ్ కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తున్నాడు. సమ్మర్ లో బెస్ట్ హాలిడేస్ ఉన్న మే 1 వంటి ప్రాముఖ్యత గల తేదీని ఎంచుకోవడం ద్వారా తన సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇక హిట్ 3 పై భారీ అంచనాలు ఉన్నాయి. నాని వరుస విజయాల నేపథ్యంలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాడు. ప్రత్యేకించి, క్రైమ్ డ్రామా నేపథ్యంతో యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ కావాలని భావిస్తున్నారు. సూర్య నటించిన రెట్రో కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇది యాక్షన్ జనర్‌కి చెందిన మరో మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో రెండు చిత్రాల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో నానికి గట్టి అభిమాన వర్గం ఉండటంతో, హిట్ 3 బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసే అవకాశం ఉంది. సూర్యకు తమిళనాడులో భారీ ఫ్యాన్ బేస్ ఉండడంతో, అక్కడ రెట్రో ఆధిపత్యం చూపించే అవకాశం ఉంది. అయితే, రెండు చిత్రాలు సరికొత్త తరహాలో తెరకెక్కించబడటంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించగలవు. తెలుగులో సూర్యకు మంచి క్రేజ్ ఉండడం, నానికి తమిళనాడులో జెర్సీ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు రావడం ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.
మే 1 నాటికి ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. చిత్రయూనిట్లు తమ తమ సినిమాలను ప్రమోట్ చేయడంలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీజర్లు, ట్రైలర్స్, సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడమే విజయానికి కీలకం అవుతుంది. ఇక ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.