రవితేజను పక్కన పెట్టిన 'ఇస్మార్ట్'.. మిస్టర్ బచ్చన్ ఏం చేస్తాడో?
ఇదిలా ఉంటే ఆగస్టు 7వ తేదీన 'మిస్టర్ బచ్చన్' మాస్ మహా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
By: Tupaki Desk | 5 Aug 2024 2:15 PM GMTస్వాతంత్య్ర దినోత్సవం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీన టాలీవుడ్ నుంచి రెండు క్రేజీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్'.. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రాబోతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాల మధ్య క్లాష్ అనివార్యమైంది.
నిజానికి 'డబుల్ ఇస్మార్ట్' సినిమానే ముందు డేట్ అనౌన్స్ చేసారు. కానీ ఆ తర్వాత అదే డేట్ కు రాబోతున్నట్లు 'మిస్టర్ బచ్చన్' టీమ్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే పూరీతో రవితేజకు మంచి అనుబంధం ఉంది.. పూరీ, హరీష్ ల మధ్య గురు శిష్యుల బంధం ఉంది. అలాంటిది ఇప్పుడు బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవ్వడం ఏంటని అందరూ ఆలోచించారు. అదే సమయంలో పూరీ కనెక్ట్స్ నిర్మాత ఛార్మీ కౌర్ సోషల్ మీడియాలో రవితేజ, హరీష్ శంకర్ లని అన్‌ఫాలో చేయడంతో వీరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.
గురు శిష్యుల మధ్య పోటీ గురించి హరీష్ శంకర్ ఇటీవల మాట్లాడుతూ.. పూరీతో కంపేర్ చేసుకునే స్థాయి తనది కాదని అన్నారు. కొన్ని ఫైనాన్సియల్ వ్యవహారాలు, ఓటీటీ ఒప్పందాల కారణంగా అనుకోకుండా అదే డేట్ కు రావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అలానే సోషల్ మీడియాలో ఎవరినైనా ఫాలో అవ్వొచ్చు, అన్ ఫాలో చెయ్యొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఛార్మి అన్ ఫాలో చేసినట్లు ఇంకా కంఫర్మ్ చేసుకోలేదని హరీష్ అన్నారు. రెండు సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. అయితే ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నిజమేనేమో అనిపిస్తోంది.
ఆదివారం విశాఖపట్నంలో జరిగిన 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ లాంచ్‌లో నిర్వాహకులు ఎప్పటిలాగే సినిమా హీరో, దర్శకుడికి సంబంధించిన ఏవీలు (AV) ప్లే చేసారు. పూరీ జగన్నాధ్ కి ట్రిబ్యూట్ గా 4 నిమిషాల నిడివితో కట్ చేసిన ఏవీలో.. పోకిరి, బిజినెస్ మ్యాన్, టెంపర్, దేశముదురు, ఇద్దరమ్మాయిలతో, పైసా వసూల్, బద్రి, బుజ్జిగాడు, హార్ట్ ఎటాక్ వంటి సినిమాల్లోని సీన్స్, డైలాగ్స్ చూపించారు. కానీ ఎక్కడా రవితేజ ప్రస్తావనలేదు. కానీ మాస్ మహారాజాతో దర్శకుడు తీసిన సినిమాల క్లిప్పింగ్స్, డైలాగ్స్ జత చేయకపోవడం చర్చనీయంశంగా మారింది.
రవితేజ, పూరీ జగన్నాధ్ మధ్య చాలా ఏళ్లుగా మంచి రిలేషన్ ఉంది. వీరిద్దరూ కలిసి ఐదు సినిమాలు చేసారు. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' సినిమా రవితేజకు హీరోగా మంచి పేరు తెచ్చిపెడితే.. 'ఇడియట్', 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రాలు స్టార్ గా మార్చేశాయి. 'నేనింతే', 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా సినీ అభిమానులను అలరించాయి. ఈ సినిమాలన్నీ రవితేజతో పాటుగా పూరీ కెరీర్ కు కూడా ప్లస్ అయ్యాయి. కానీ ఇవేవీ 'డబుల్ ఇస్మార్ట్' ఏవీలో కనిపించలేదు. 'నేనింతే'లోని పూరీ సోదరుడు సాయి రామ్ శంకర్ ఉన్న ఒక షాట్ మాత్రమే పెట్టారు. ఒక చోట 'ఇడియట్' పోస్టర్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది.
పూరీ జగన్నాథ్ వీడియోలో రవితేజను విస్మరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇది మాస్ రాజా ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. తన కెరీర్ కు ఎంతో కీలకమైన 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు పోటీగా 'మిస్టర్ బచ్చన్' ను రిలీజ్ చేయడంతో దర్శక నిర్మాతలు హర్ట్ అయ్యారేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. దీని గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడనప్పటికీ, రెండు టీమ్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఆగస్టు 7వ తేదీన 'మిస్టర్ బచ్చన్' మాస్ మహా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ ఈవెంట్ లో ఒకవేళ రవితేజ సినీ కెరీర్ కు సంబంధించిన ఏవీ ప్లే చేస్తే.. అందులో పూరీ జగన్నాథ్ తో ఆయన చేసిన సినిమాలను ప్రస్తావిస్తారా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఇండిపెండెన్స్ డేకి వచ్చే రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని టాలీవుడ్ సినీ అభిమానులు కోరుకుంటున్నారు.