Begin typing your search above and press return to search.

CBFC చైర్‌పర్సన్‌ల మ‌ధ్య‌ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే..!

అయితే ఇది ఇరువురు సీబీఎఫ్‌సి చైర్ ప‌ర్స‌న్ ల మ‌ధ్య ర‌గ‌డ‌గా మారంద‌ని కూడా తాజా ప‌రిణామం చెబుతోంది.

By:  Tupaki Desk   |   11 March 2024 3:15 AM GMT
CBFC చైర్‌పర్సన్‌ల మ‌ధ్య‌ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే..!
X

లంక‌కు వెళ్లి నిప్పంటించి వ‌చ్చాడు రామ భ‌క్తుడు ఆంజ‌నేయుడు. ఆ మంట ఆరే లోపే జ‌ర‌గాల్సింది జ‌రిగిపోయింది. రావ‌ణుడు తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. ఇంచుమించు ఇలానే దిల్లీకి వెళ్లి మ‌రీ సీబీఎఫ్‌సీలో ఉన్న అవినీతిని ఛాలెంజ్ చేసాడు ద‌క్షిణాది హీరో విశాల్. త‌న సినిమాకి లంచం ఇవ్వ‌నిదే సెన్సార్ స‌ర్టిఫికేష‌న్ ఇవ్వ‌లేద‌ని ఆరోపించి సంచ‌ల‌నం సృష్టించాడు. ఆ త‌ర్వాత సీబీఎఫ్‌సీపై కేంద్ర అధికారుల‌ విచార‌ణ జ‌ర‌గ‌డం అధికారుల మార్పు వ‌గైరా చాలా జ‌రిగాయి. అయితే ఇది ఇరువురు సీబీఎఫ్‌సి చైర్ ప‌ర్స‌న్ ల మ‌ధ్య ర‌గ‌డ‌గా మారంద‌ని కూడా తాజా ప‌రిణామం చెబుతోంది. సీబీఎఫ్‌సీ పెద్ద‌ల న‌డుమ అంత‌ర్గ‌త రాజ‌కీయాలు శ‌త్రుత్వాల్ని పెంచి పోషిస్తున్నాయ‌ని కూడా తాజా ఇన్సిడెంట్ తో బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్పుడు సీబీఎఫ్‌సి చైర్ ప‌ర్స‌న్ గా ఉన్న ప్రసూన్ జోషికి మాజీ చైర్ ప‌ర్స‌న్ ప్ర‌హ్లాజ్ నిహ‌లానీకి మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదని తాజా ప‌రిణామం చెబుతోంది. మ‌రింత వివ‌రాల్లోకి వెళితే...

గత ఏడాది దక్షిణాది నటుడు విశాల్ సీబీఎఫ్‌సి అధికారులపై లంచం అవినీతి ఆరోపణలను మోపడంతో పెద్ద వివాదం త‌లెత్తింది. 6 నెలల లోపే CBFC తప్పుడు కారణాలతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. భారీ బడ్జెట్ భోజ్‌పురి చిత్రం `రంగ్ దే బసంతి` నిర్మాతలు సెన్సార్ సర్టిఫికేట్ పొందడం కోసం సీబీఎఫ్‌సిని ఆశ్ర‌యించారు. CBFC చైర్‌పర్సన్ ప్రసూన్ జోషి ఉద్దేశపూర్వకంగా సెన్సార్ చేయ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు. తమ చిత్రానికి అమీర్ ఖాన్ నటించిన 2006 హిందీ సినిమా పేరు ఉన్నందున ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ప్రసూన్ బహుశా హిందీ సినిమా- రంగ్ దే బ‌సంతికి పాటల రచయితగా అనుబంధం క‌లిగి ఉన్నందున అలా చేసి ఉంటాడని వారు వాదిస్తున్నారు.

మార్చి 5న భోజ్‌పురి చిత్రం `రంగ్ దే బసంతి` నిర్మాత రోషన్ సింగ్ ఫిబ్రవరి 3న సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు CBFCకి లేఖ రాశారు. ఫిబ్రవరి 19న స్క్రీనింగ్ జరిగినప్పటికీ, స్క్రీనింగ్ నివేదికను ఫిబ్ర‌వ‌రి 21న సమర్పించారు. చైర్‌పర్సన్ నుండి క్లియరెన్స్ ప్రక్రియ ఆలస్యమైంది. ఆ తర్వాత మార్చి 6న, ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) అధ్యక్షుడు అభయ్ సిన్హా కూడా రంగ్ దే బసంతి మార్చి 22న విడుదల కానున్నందున అత్యవసర క్లియరెన్స్‌ను అభ్యర్థిస్తూ CBFCకి లేఖ రాశారు.

అటుపై మేకర్స్ మార్చి 9న CBFCకి మరో లేఖ రాశారు. అయితే మార్చి 8న CBFC అధికారి ఫోన్ కాల్‌లో సినిమా పేరుని మార్చమని అడిగారని పేర్కొన్నారు. ఆ మేర‌కు బాలీవుడ్ మీడియా క‌థ‌నం వైర‌ల్ అవుతోంది. కొన్ని వారాల పాటు ప్ర‌య‌త్నించినా త‌మ‌కు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం లేద‌ని భోజ్ పురి నిర్మాత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు టైటిల్ మార్చాలంటే ఎలా? మేం పబ్లిసిటీ ప్రారంభించాము .. మెటీరియల్ బయటకు వెళ్లిపోయింది కాబట్టి అది సాధ్యం కాదని స్పష్టం చేసామ‌ని.. అలాగే సబ్సిడీ కోసం కొన్ని రాష్ట్రాల్లో దరఖాస్తు చేసామని.. పేపర్‌వర్క్‌లో చిత్రం పేరు -రంగ్ దే బసంతి అని ఉంద‌ని కూడా వారు నివేదిస్తున్నారు. అక్కడ చైర్‌పర్సన్ ప్ర‌సూన్ జోషి ఉద్దేశపూర్వకంగా సినిమాకు అడ్డంకి సృష్టిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. సినిమా మార్చి 22న విడుదలవుతున్నందున ఇప్పుడు చాలా టెన్షన్‌గా ఉన్నామ‌ని కూడా భోజ్ పురి నిర్మాత‌లు చెబుతున్నారు.

అయితే ఇంత‌లోనే మాజీ CBFC చైర్‌పర్సన్ , విమర్శకుడు పహ్లాజ్ నిహ్లానీ ఈ ఉదంతంపై ఘాటుగా స్పందించారు. ``CBFC కార్పొరేట్ల కోసం మాత్రమే పనిచేస్తుంది. చిన్న హిందీ లేదా ప్రాంతీయ చిత్రాలను పెద్దగా పట్టించుకోదు. రంగ్ దే బసంతి ఒక పెద్ద స్టార్‌ని కలిగి ఉంటే CBFC మూడు నాలుగు రోజుల్లోనే స‌ర్టిఫికెట్ ఇచ్చేసేది`` అని వ్యాఖ్యానించారు. మార్చి 8 నాటికి CBFC వెబ్‌సైట్‌లోని డ్యాష్‌బోర్డ్ `రంగ్ దే బసంతి` స్థితిని చైర్మన్ పరీక్షిస్తున్నార‌ని, స‌మీక్ష ఇంకా పెండింగ్‌లో ఉంది అని చూపిస్తోంది. ఇది చాలా అరుదుగా జరుగుతుందని పహ్లాజ్ నిహ‌లానీ ప్ర‌స్తుత అధ్య‌క్షుని తీరును ఎత్తి చూపారు. సాధారణంగా, చైర్‌పర్సన్ ఎప్పుడూ క్లియర్ చేయరు. CEO లేదా RO అవసరమైన వాటిని చేస్తారు. అయితే రంగ్ దే బసంతి అనే టైటిల్ విష‌య‌మై మిస్టర్ ప్రసూన్ జోషి కి అభ్యంత‌రాలున్నాయి. ఆ టైటిల్ ఉన్న‌ హిందీ సినిమాకి పాటలు రాశారు కాబట్టి ఆయ‌న ఆల‌స్యం చేస్తున్నారు అని నిహ్లానీ అన్నారు. భోజ్ పురి సినిమాని డిపెండ్ చేస్తూ ప్ర‌సూన్ జోషిపై ఆయ‌న విరుచుకుప‌డ‌డం చూస్తుంటే వారి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌ని అర్థం చేసుకోవాల్సి వ‌స్తోందని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.