రష్మికకు రక్షణ కల్పించమంటున్న కొడవ నేషనల్ కౌన్సిల్
రీసెంట్ గా మండ్య నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ రష్మికపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో CNC రష్మికకు భద్రత కల్పించాలని కోరింది.
By: Tupaki Desk | 10 March 2025 5:39 PM ISTకొడవ సమాజం హక్కుల పరిరక్షణ సంస్థ కొడవ నేషనల్ కౌన్సిల్ (CNC) హీరోయిన్ రష్మిక మందన్నాకు భద్రత కల్పించాలని కర్ణాటక మరియు కేంద్ర హోం మంత్రులను కోరింది. రష్మిక కొడవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రష్మిక చుట్టూ జరుగుతున్న రాజకీయ వివాదాల నేపథ్యంలో ఆమెకు భద్రత కల్పించాలని CNC కోరింది.
రీసెంట్ గా మండ్య నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ రష్మికపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో CNC రష్మికకు భద్రత కల్పించాలని కోరింది. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మిక హాజరవకుండా కన్నడ చిత్ర పరిశ్రమను అగౌరవపరిచిందని ఎమ్మెల్యే రవి రష్మికపై ఆరోపణలు చేశారు. కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక సొంత రాష్ట్రాన్ని, తనకు మొదటి సినిమా అవకాశమిచ్చిన కన్నడ చిత్ర పరిశ్రమను లెక్క చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
రష్మికను బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎన్నిసార్లు పిలిచినా ఆమె రాలేదని, ఇలాంటి వారికి మనం గుణపాఠం నేర్పించాలని సంచలన వ్యాఖ్యలు చేయడంతో రష్మిక భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో CNC ప్రెసిడెంట్ నందినేర్వండ నాచప్ప అనవసరంగా రష్మికను రాజకీయ వివాదాల్లోకి లాగి, ఆమెను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల వల్ల రష్మిక సక్సెస్ కాలేదని, ఆమె సక్సెస్‌ను రాజకీయ అజెండాల కోసం వాడకూడదని నాచప్ప అన్నారు.
ఈ విషయంలో కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మాత్రం తనకు CNC నుంచి ఎలాంటి లెటర్ రాలేదని, ఈ విషయాన్ని మరోసారి సమీక్షిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే ఛావా సక్సెస్ మీట్ లో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని, అయినప్పటికీ అందరూ తనను ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నప్పటి నుంచి రష్మిక పై కర్ణాటక అభిమానులంతా ఫైర్ అవుతూ ఆమెను ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు. కానీ రష్మిక మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.