కొడుకులను అలా పెంచానంటున్న బ్రహ్మానందం
ఈ సినిమాలో బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి నటించారు.
By: Tupaki Desk | 15 Feb 2025 2:27 PM GMTహాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటించిన తాజా సినిమా బ్రహ్మా ఆనందం. ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి నటించారు. నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మీ, రాజా ఈ సినిమాలో తాతా మనవడిగా నటించారు.
కొడుకు సినిమా కావడం వల్ల బ్రహ్మ ఆనందం సినిమాకు బ్రహ్మీ ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్స్ చేశారు. అడిగిన వారందరికీ ఇంటర్వ్యూలిస్తూ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. తండ్రితో పాటూ రాజా గౌతమ్ కూడా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకులు ఎన్నో ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ఇప్పటివరకు బ్రహ్మానందం ఎన్నో సినిమాల్లో చాలా పాత్రలు చేశారు. కమెడియన్ గా ఆయన చేసినన్ని సినిమాలు ఇంకెవరూ చేయలేదంటే అతిశయోక్తి లేదు. తెరపై బ్రహ్మానందాన్ని చూస్తే నవ్వొచ్చేస్తుంది. అలాంటి ఆయన్నుంచి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలో చేసిన పాత్ర ఎవరూ ఊహించలేదు.
ఆ పాత్రలో బ్రహ్మానందం పాత్ర ప్రతీ ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. అయితే రంగమార్తాండ సినిమా కోసం తన తండ్రి ఎంత డెడికేషన్ తో పనిచేశాడో రాజా గౌతమ్ రీసెంట్ గా ఓ ఇంటర్యూలో తెలిపాడు. ఆ సినిమాలో బ్రహ్మానందం భార్య చనిపోయే సీన్ లో నీరసంగా కనిపించాలని బ్రహ్మీ ముందు రోజు నుంచే ఆహారం తీసుకోవడం మానేశాడని, ఈ వయసులో కూడా ఆయనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ తనను ప్రతీ నిమిషం ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటుందని రాజా గౌతమ్ చెప్పాడు.
ఇదిలా ఉంటే మరో ఇంటర్వ్యూలో తన కొడుకులు ఎక్కడా తన పేరును వాడరని హాస్య బ్రహ్మ తెలిపారు. వాళ్లంతట వాళ్లు స్వతహాగా ఎదగాలనుకుంటారని, ఇప్పటివరకు ఇండస్ట్రీలో తన పేరు చెప్పి వారు అవకాశాలు అడిగింది లేదని, తన పిల్లలకు అది ఇష్టముండదని, బ్రహ్మానందం కొడుకులని వారెక్కడా చెప్పుకోరని, తాను వాళ్లని అలా పెంచానని, వాళ్లు కూడా అలానే పెరిగారని తన కొడుకులను ప్రశంసించారు బ్రహ్మానందం.