నాన్నకు రావాల్సినంత గుర్తింపు రాలేదు!
పాతతరం నటుడు పొట్టి ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
By: Tupaki Desk | 28 Sep 2024 7:00 PM GMTపాతతరం నటుడు పొట్టి ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1960లలోనే ఇండస్ట్రీకి వచ్చారు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసారు. చిన్న చిన్న వేషాలతో మొదలైన ఆయన కెరీర్ కాలక్రమంలో ఎంతో మంది అప్పటి స్టార్ హీరోలో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. డైలాగ్ డెలివిరీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అదే డిక్షన్ తో కొన్ని దశాబ్ధాల పాటుతెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు.
అయితే ఆయన చివరి రోజుల్లో ఎన్నో అర్దిక ఇబ్బందులు పడ్డారని అంటుంటారు. తాజాగా పొట్టి ప్రసాద్ గురించి ఆయన తనయుడు జగన్నాథరావు కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లోనే. `మా నాన్నగారికి రావాల్సిన గుర్తింపు రాలేదనేది నా అభిప్రాయం. ఆయనంటే అప్పటి స్టార్ హీరోలందరికీ ఇష్టమే. శోభన్ బాబు లాంటి వారు, మా నాన్నకి షూటింగు లేకపోయినా సెట్ కి పిలిపించుకునేవారు.
ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే. సందడే ఉండేది. ఎన్టీఆర్ , ఏఎన్నార్ కూడా మా నాన్న పట్ల ఎంతో అభిమానం చూపేవారు. అయితే తన పరిచయాలను అవకాశాలుగా మార్చుకోవడానికి నాన్న ఎప్పుడూ ప్రయత్నించలేదు. నాన్నగారు చెన్నై వచ్చినప్పుడు ఆయనకి ఆశ్రయం ఇచ్చినవారు జేవీ రమణమూర్తిగారు. నాన్నకి రావి కొండలరావు , సాక్షి రంగారావు , రాళ్లపల్లి మంచి స్నేహితులు.
ఇక నాన్న అంటే రాజబాబుగారికి ఎంతో ఇష్టం. ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చి నాన్నకి ఏవో విషయాలు చెప్పుకుని చాలాసేపు ఏడ్చారు. నేను అప్పుడు చిన్నపిల్లాడిని కాబట్టి నాకు అర్థం కాలేదు. 'అమ్మానాన్నలను బాగా చూసుకో అప్పుడు అన్నీ వాటంతట అవే వస్తాయి అని ఆయన చెప్పినమాట గుర్తుంది. మా నాన్న ఇల్లు కట్టుకోవడానికి అప్పట్లో రాజబాబుగారే సాయం చేశారు` అని అన్నారు.