3>2... కమిటీ కుర్రాళ్ల జోరు
స్టార్ హీరోల సినిమాలు, క్రేజీ కాంబో సినిమాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంలో విఫలం అయ్యాయి
By: Tupaki Desk | 23 Aug 2024 11:14 AM GMTస్టార్ హీరోల సినిమాలు, క్రేజీ కాంబో సినిమాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంలో విఫలం అయ్యాయి. ముఖ్యంగా ఆగస్టు 15వ తారీకున వచ్చిన రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొంది విడుదల అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలు దారుణమైన పరాభవంను మూట కట్టుకున్నాయి. ఆ స్థాయి ఫ్లాప్ ను ఏ ఒక్కరు ఊహించి ఉండరు. ఒక వైపు ఆ సినిమాలు నిరాశ పరచగా మరో వైపు ఆయ్ మరియు కమిటీ కుర్రాళ్లు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి.
కమిటీ కుర్రాళ్లు సినిమా వచ్చి రెండు వారాలు పూర్తి అయ్యింది. ప్రస్తుతం మూడో వారం రన్ అవుతోంది. రెండు వారాలకు గాను కమిటీ కుర్రాళ్లు సినిమా రూ.15.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొదటి వారంలో పోటీ లేక పోవడంతో ఎక్కువ థియేటర్ లలో విడుదల అయ్యింది. కానీ రెండో వారంకు పెద్ద సినిమాలు విడుదల అవ్వడంతో సగానికి పైగా థియేటర్ లను తగ్గించడం జరిగింది. ఆగస్టు 15న విడుదల అయిన సినిమాల్లో ఆయ్ తప్ప మిగిలిన సినిమాలు కనిపించకుండా పోయాయి.
పోయిన వారం విడుదల అయిన సినిమాలు పోవడంతో మళ్లీ కమిటీ కుర్రాళ్లు సినిమాను థియేటర్ లో వేసుకుంటున్నారు. రెండో వారం లో కమిటీ కుర్రాళ్లు స్క్రీనింగ్ అయిన థియేటర్ లతో పోల్చితే మూడో వారం లో స్క్రీనింగ్ అవుతున్న థియేటర్ ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. మూడో వారంలో కూడా వసూళ్ల జోరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లాంగ్ రన్ లో కమిటీ కుర్రాళ్లు సినిమా అటు ఇటుగా దాదాపు రూ.20 కోట్ల నుంచి రూ.22 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయనే అంచనా వేస్తున్నారు.
మెగా డాటర్ నిహారిక తన తల్లి పేరు తో నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో మెగా ఫ్యామిలీ లో ఆనందం వ్యక్తం అవుతోంది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంకా పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు, ఫ్యామిలీ మెంబర్స్ కమిటీ కుర్రాళ్లు సినిమా కోసం నిలబడ్డారు. ఆ కారణం వల్ల కూడా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యి మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమాతో నిహారిక ఏకంగా 14 మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం గర్వంగా ఉందని నాగబాబు ఒక చిట్ చాట్ లో చెప్పుకొచ్చాడు.