చావా (X) సైరా: క్లైమాక్స్ ఎమోషన్స్ ఒకటే కానీ..!
వాటి కోసం థియేటర్లకు వెళ్లేందుకు జనం ఎప్పుడూ ఆసక్తిగానే ఉన్నారని ఇటీవల విడుదలైన 'చావా' ఫలితం చెబుతోంది.
By: Tupaki Desk | 19 Feb 2025 5:18 PM GMTచారిత్రక నేపథ్యం ఉన్న కథలు, రాజులు, చక్రవర్తుల కథలు వరుస పెట్టి తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా వీరాధివీరుల జీవిత కథలు సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వాటి కోసం థియేటర్లకు వెళ్లేందుకు జనం ఎప్పుడూ ఆసక్తిగానే ఉన్నారని ఇటీవల విడుదలైన `చావా` ఫలితం చెబుతోంది. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేందుకు ఇంకెంతో సమయం పట్టదు.
ఇక చావాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ కథను అద్భుతంగా చూపించారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ఎంతో గొప్పగా నటించగా, శంభాజీ భార్య యేసుభాయి పాత్రలో రష్మిక, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా కూడా మైమరిపించే నటనతో ఆకట్టుకున్నారని కథనాలొచ్చాయి. ఈ సినిమాలో ఎమోషనల్ ఘట్టాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. శంభాజీ మహారాజ్ ని ఉరి తీసే సన్నివేశం కానీ, విరోచిత పోరాటాలకు సంబంధించిన క్లిప్స్ కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక సినిమా చూసిన జనం థియేటర్ బయటకు విషణ్ణవదనాలతో వస్తున్నారు. మీడియా ముందు ఎమోషన్ ని ఆపుకోలేక ఏడ్చేస్తున్నారు. అంతగా చావా సినిమా ప్రజలకు నచ్చింది.
అయితే ఈ రిజల్ట్ చూశాక, అంతే ఎమోషనల్ కనెక్టివిటీతో రూపొందించిన పాన్ ఇండియన్ సినిమా `సైరా నరసింహారెడ్డి` ఎందుకు ప్రజలకు నచ్చలేదు? అన్నది ఆరా తీస్తున్నారు. ఇది రాయలసీమ చరిత్రకారుడి సినిమా. ఒక నిజమైన వీరుడి కథతో రూపొందింది. ఇందులో కూడా ఎమోషన్స్ కి కొదవేమీ లేదు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో నరసింహారెడ్డి (చిరంజీవి) తల నరికే సన్నివేశం రగిలిస్తుంది. ఎమోషన్ తో ఊగిపోయేలా చేస్తుంది. ఆ సీన్ కి కానీ, చిరంజీవి నటనకు కానీ చాలా ప్రశంసలు దక్కాయి. కేవలం తెలుగు క్రిటిక్స్ ఆడియెన్ మాత్రమే కాదు.. ముంబై క్రిటిక్స్ కూడా సైరా సినిమాని ప్రశంసించారు. చిరంజీవి అసమాన నట ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. కానీ జనాలు ఎందుకనో థియేటర్లకు రాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో `సైరా` అద్భుత వసూళ్లను సాధించగలిగినా, ఎందుకనో ఉత్తరాది జనాల్ని థియేటర్లకు రప్పించడంలో తడబడింది. ఒక సినిమా జయాపజయాలకు సవాలక్ష కారణాలు. అందులో ఏ కారణం సైరా ఉత్తరాది ఆడియెన్ ని ఆకర్షించలేదో అర్థం కాని పరిస్థితి. సినిమా బాలేదు అన్నవాళ్లే లేరు. కానీ అది ఆశించిన స్థాయికి చేరలేదు. కనీసం జనం థియేటర్ల వరకూ రాలేదు. చావా విజయం ఒక రకంగా సైరా అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాని తెలుగు ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు. హిందీ వెర్షన్ చూడటానికి థియేటర్లకు వెళుతున్నారు. అయితే ఒక తెలుగు స్టార్ నటించిన అదే తరహా ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సినిమాకి అంతగా ఆదరణ దక్కలేదు. కానీ చావాకు ఇంతటి ఆదరణ దేనివల్లనో అంటూ విశ్లేషిస్తున్నారు. చావా సినిమాని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయాలని డిమాండ్ ఉంది. అయితే సైరా-నరసింహారెడ్డి చిత్రాన్ని రీరిలీజ్ చేస్తే జనం చూసేందుకు ఆస్కారం ఉందంటారా?