Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: 'క‌న్న‌ప్ప‌'లో బాహుబ‌లి పోలిక‌లు

ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ విజువ‌ల్ ట్రీట్ అంటూ ప్ర‌శంస‌లు ద‌క్కినా కానీ, ఒక సెక్ష‌న్ నుంచి ఇది బాహుబ‌లి పాత్ర‌ల స్ఫూర్తితో రూపొందించిన‌ది!

By:  Tupaki Desk   |   17 Jun 2024 12:23 PM GMT
ట్రెండీ స్టోరి: క‌న్న‌ప్ప‌లో బాహుబ‌లి పోలిక‌లు
X

మంచు కుటుంబ హీరోల‌ నుంచి చాలా రోజుల త‌ర్వాత ఒక సినిమా వ‌స్తోంది. అది కూడా పాన్ ఇండియా టార్గెట్ తో అత్యంత భారీ వ్య‌యంతో రూపొందిస్తున్న సినిమా కావ‌డంతో ఆస‌క్తి నెల‌కొంది. ఇందులో పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్, మాలీవుడ్ కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ వంటి వారు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ విజువ‌ల్ ట్రీట్ అంటూ ప్ర‌శంస‌లు ద‌క్కినా కానీ, ఒక సెక్ష‌న్ నుంచి ఇది బాహుబ‌లి పాత్ర‌ల స్ఫూర్తితో రూపొందించిన‌ది! అంటూ విమ‌ర్శ‌లు రావ‌డం దానిపై సోష‌ల్ మీడియాలో డిబేట్లకు తెర లేవ‌డం విశేషం.

వాయులింగాన్ని దొంగిలించడానికి దుండుగులు చేసే ప్ర‌య‌త్నాన్ని క‌న్న‌ప్ప‌ టీజర్ లో ఆవిష్క‌రించారు. అయితే ఈ దొంగ‌త‌నాన్ని ఆపిని ఒకే ఒక వ్యక్తి-కన్నప్ప. శివ‌య్య విగ్రహాన్ని దొంగతనం నుండి రక్షిస్తాడు. అతడు ఎవ‌రి సహాయం లేకుండా ఎంత‌టి బలమైన వ్యక్తులనైనా చంపగలడని టీజ‌ర్ లో చూపించారు. టీజర్‌లో కన్నప్ప తన కర్తవ్యం కోసం పోరాడే సన్నివేశాలు ర‌క్తి క‌ట్టించాయి. కొన్ని సెక‌న్ల టీజ‌ర్ లో ఇందులో న‌టించిన స్టార్లంద‌రినీ ఛ‌మ‌క్కులాగా చూపించారు. మోహన్ బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్‌లను డేగకళ్లతో చూసిన అభిమానులు గుర్తించారు. గ‌మ్మ‌త్తుగా వీరంద‌రినీ రెప్ప పాటులో మాత్ర‌మే గుర్తించేలా టీజ‌ర్ ని క‌ట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. టీజ‌ర్ ఆద్యంతం క‌న్న‌ప్ప పాత్ర‌ధారి మంచు విష్ణు విరోచిత పోరాటాలు ర‌క్తి క‌ట్టించాయి. అడ‌వులు ప‌చ్చ‌ద‌నం ఆక‌ట్టుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ఆస‌క్తిక‌రంగా ఈ యాక్ష‌న్ సినిమా టీజ‌ర్‌లో ''1:24 ప్రభాస్️‍, 1:06 కాజల్, 0:59 మోహన్ లాల్, 1:13 అక్షయ్ కుమార్'' అని రాస్తూ ఒక అభిమాని టీజ‌ర్ లో ఎవ‌రెవ‌రిని గుర్తించాడో టైమ్‌లైన్‌లను షేర్ చేశాడు. అంతేకాదు.. ఇందులో విల‌న్ కి స‌హాయక పాత్ర‌ధారిగా ఉన్న ఒక ఒంటిక‌న్ను వికృత రూపధారిని చూపిస్తూ ఇత‌డు బాహుబ‌లిలోని కాళ‌కేయ‌ను త‌ల‌పించాడ‌ని, అత‌డి గ్యాంగ్ కాళ‌కేయ గ్యాంగ్ లా ఉంద‌ని ఒక‌ నెటిజ‌నుడు కామెంట్ చేసారు. అలాగే ఇందులో క‌థానాయిక‌గా క‌నిపిస్తున్న ప్రీతి ముకుంద‌న్ లుక్ ను ఆ పాత్ర‌ను బాహుబ‌లి అవంతిక పాత్ర‌తో పోల్చ‌డం గుర్తించాలి. అయితే క‌న్న‌ప్ప‌గా న‌టించిన విష్ణు పాత్ర‌ను బాహుబ‌లిలోని శివుడి పాత్ర‌తో పోల్చ‌క‌పోవ‌డం గ‌మ‌నించ‌ద‌గిన‌ది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యాలు ఇంకా చాలా ఉన్నాయి. బాహుబ‌లిలో శివుడు పాత్ర‌ధారి (ప్ర‌భాస్) అత‌డి గిరిజ‌నుల వంశానికి చెందిన‌ పోలిక‌లు క‌న్న‌ప్ప‌కు అత‌డు నివ‌శించే సమాజానికి ఉన్నాయి. క‌న్న‌ప్ప కూడా ఒక గిరిజ‌నుడు. అందువ‌ల్ల అత‌డి ద‌ళంలోని వారంతా, లేదా ప్ర‌త్య‌ర్థి ద‌ళంలోని వారంతా ఇంచుమించి కాళ‌కేయ ద‌ళంలా క‌నిపిస్తున్నారు. అందువ‌ల్ల పోలిక చూడ‌టం స‌హ‌జం. అవంతిక త‌మ‌న్నా లాగా ఇంచుమించు అవే నార దుస్తులు త‌ర‌హాలో ధ‌రించింది కాబ‌ట్టి క‌న్న‌ప్ప హీరోయిన్ ని వెంట‌నే పోలిక‌లు చెప్పేశారు నెటిజ‌నులు.

కేన్స్‌లో కన్నప్ప టీజర్ ప్ర‌ద‌ర్శ‌న‌ విష్ణు, మోహన్ బాబు, విరానికా మంచు, ప్రభుదేవా గత నెలలో ఈ చిత్రం టీజర్‌ను ప్రదర్శించడానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లారు. స్క్రీనింగ్ తర్వాత విష్ణు X లో ఇలా రాసాడు. క‌న్న‌ప్ప‌ టీజర్‌ను ఇక్కడ కేన్స్‌లో ప్రదర్శించామని, సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు! అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్‌లు, స్థానిక భారతీయులు చూసిన ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తిగా ఇష్టపడ్డారు. ఈ స్పంద‌న‌ల‌ను చూసిన తర్వాత నేను సంతోషిస్తున్నాను అని అన్నారు.

కన్నప్ప గురించి... కన్నప్ప పరమశివుని భక్తుడు. శివుడి కోసం త‌న‌ కనుగుడ్ల‌ను పెకిలించి ఇచ్చిన‌ సాహ‌సి. టైటిల్ పాత్ర‌లో మంచు విష్ణు న‌టించారు. ఈ చిత్రానికి డా.ఎం.మోహన్ బాబు నిర్మాత. పరుచూరి గోపాల కృష్ణ, ఈశ్వర్ రెడ్డి, జి నాగేశ్వర రెడ్డి, తోట ప్రసాద్ కథ అందించ‌గా, కన్నప్ప చిత్రానికి విష్ణు స్క్రీన్ ప్లే రాశారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.