వేణు స్వామి వివాదం.. తెలంగాణ మహిళా కమిషన్ లో పిర్యాదు
అందులో, ఆయన జాతకాలు ఆధారంగా జంట విడిపోతారనే ఊహాజనకమైన వ్యాఖ్యలు చేశారు, ఇది తీవ్రమైన దుమారాన్ని సృష్టించింది.
By: Tupaki Desk | 12 Aug 2024 1:52 PM GMTసోషల్ మీడియాలో ప్రముఖుల జాతకాల పై వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న వేణు స్వామి ఇటీవల అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళల ఎంగేజ్మెంట్ సమయంలో వారి జాతక విశ్లేషణపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా విమర్శించబడిన విషయం తెలిసిందే. అందులో, ఆయన జాతకాలు ఆధారంగా జంట విడిపోతారనే ఊహాజనకమైన వ్యాఖ్యలు చేశారు, ఇది తీవ్రమైన దుమారాన్ని సృష్టించింది.
అయితే, గతంలోనూ కొన్ని సందర్భాల్లో సినిమా విడుదలలు మరియు రాజకీయ ఫలితాల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హైలెట్ అయిన వేణు స్వామి, తాజాగా మరోసారి అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణు స్వామి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు పిర్యాదు చేశారు.
తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారు ఈ పిర్యాదును స్వీకరించారు. వారు వేణు స్వామి పై మరియు టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పై పర్యవేక్షణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు, వేణు స్వామిని పిలిచి అతని వివరణను అడిగే అవకాశముందని కూడా స్పష్టం చేశారు.
ఈ పిర్యాదులో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మినారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రైజరర్ సురేంద్ర కుమార్ నాయుడు, ప్రసాదం రఘు, లక్ష్మీ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ ప్రేమమాలిని వనం, సెక్రటరీ వేదుల మూర్తి, మెంబెర్స్ సువర్ణ, తేజస్విని సజ్జ, భాగ్యలక్ష్మి, యస్.కుమార్, మరియు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వనజ తదితరులు పాల్గొన్నారు.
ఇక మంచు విష్ణు కూడా వేణుస్వామి చేసిన కామెంట్స్ పై స్పందించారు. వెంటనే ఆయనకు ఫోన్ కాల్ చేసి ఇక నుంచి సెలబ్రెటీల వ్యక్తిగత జాతకాలపై వ్యాఖ్యలు విశ్లేషణలు చేయకూడదని తెలిపారు. ఇక వేణుస్వామి కూడా మర్యాదపూర్వకంగా మంచు విష్ణుకు సమాధానం ఇచ్చారు. ఇదివరకే కొన్ని విషయాలపై నేను మాట్లాడను అని అన్నాను. ఇక సెలబ్రెటీలపై కూడా ఎలాంటి జాతకాలపై విశ్లేషణ చేయదలచుకోలేదని ఒక వీడియో రిలీజ్ చేశారు.