తడి తక్కువ తమాషా ఎక్కువ!
అవసరం మేర రిలీజ్ కి ముందు కొన్ని రకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 24 Feb 2024 12:30 PM GMTసినిమా ప్రచారం స్టైల్ మారింది. మా సినిమా బాగుంటుంది అందరూ తప్పకుండా చూడిండి అన్నది పాత పద్దతి. మా సినిమా కొంత మంది మాత్రమే చూడండి... అంత ధైర్యం మీలో ఉంటేనే థియేటర్ కి వచ్చి చూడండి...పిల్లలతో మాత్రం రాకండి అంటూ కొంత మంది ఓవర్ కాన్పెడెన్స్ తో సినిమాల్ని ప్రమోట్ చేస్తోన్న సన్నివేశం చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా సినిమాని పబ్లిసిటీ చేసి కొంతవరకూ హైప్ తీసుకురాగలుగుతున్నారు.
అవసరం మేర రిలీజ్ కి ముందు కొన్ని రకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా హారర్ జానర్ సినిమాల విషయంలో ఈ తంతు కనిపిస్తుంది. మరి ఆ సినిమాల్లో విషయం ఉందా? అంటే థియేటర్ కి వెళ్లి చూసిన తర్వాత తెలుస్తుంది అదెంత గొప్ప సినిమా అన్నది. రొటీన్ సినిమా తీసి గొప్ప థ్రిల్లింగ్ సినిమా అందించినట్లు హడావుడి తప్పా ఏమీ ఉండదని అర్ధమవుతుంది.
ఈ మధ్య కాలంలో రెండు..మూడు హారర్ సినిమాలు అలాగే రిలీజ్ అయ్యాయి. వాటిలో తడి తక్కువ తమాషా ఎక్కువ అన్నట్లే కనిపించింది. కంటెంట్ లేని సినిమాలు తీసి ప్రేక్షకుల్ని చీటింగ్ చేసినట్లే కనిపించింది. రొటీన్ సినిమా చేసి గొప్ప కళాఖండాలుగా ప్రమోట్ చేసుకోవడం అన్నది వాళ్లకే చెల్లింది. అయితే ఈ రకమైన ప్రచారం జెన్యూన్ కంటెంట్ పైనా పడుతుంది అన్నది వాస్తవం.
ఇలాంటి ప్రచారం చేయడం వల్ల నిజంగా విషయం ఉన్న సినిమా మళ్లీ ఇలాంటి ప్రచారం చేస్తే ప్రేక్ష కులు నమ్మరు అన్నది మేకర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. మాటలు తప్ప మ్యాటర్ లేని సినిమాలు చేసి పాలిష్ కొడుతున్నారని ఇప్పటికే జనాలకు అర్ధమైంది. తాజాగా ఓ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ రావ డంపై ఓ చిత్ర యూనిట్ ఇలాంటి ప్రచారానికి తెర తీసింది. మా సినిమాకు పిల్లలు రావొద్దని హెచ్చరి స్తున్నాం అంటూ మార్కెట్ లోకి పోస్టర్లు వదులుతున్నారు. మరి సినిమాలో నిజంగా పిల్లలు భయపడే అంశాలు ఉంటే ఆ రకమైన ప్రచారానికి అర్దం ఉంటుంది. అలా కాకుండా తేడా కొడితే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.