Begin typing your search above and press return to search.

అటు ఇటు ఉన్న సినిమాలు ఆడట్లేదు బాస్..!

ఫ్యామిలీ, యాక్షన్, క్రైం ఇలా అన్ని జోనర్ల సినిమాలు సరైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   15 April 2024 5:48 AM GMT
అటు ఇటు ఉన్న సినిమాలు ఆడట్లేదు బాస్..!
X

సినిమా హిట్ అవ్వడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి ఉండవు. 200 పెట్టి టికెట్ కొనే ప్రేక్షకుడు రెండున్నర గంటలు ఎంటర్టైన్ అయితే చాలు తనే వెళ్లి మరో నలుగురికి సినిమా గురించి పాజిటివ్ రివ్యూ ఇచ్చేస్తాడు. ఏ జోనర్ సినిమా అయినా సరే ఆడియన్స్ మనసులను టచ్ చేయడమే ప్రధాన లక్ష్యం. అయితే కొన్ని సినిమాలు కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా వర్క్ అవుట్ అవుతుంటాయి. ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సీన్ లేదని చెప్పొచ్చు.

స్టార్ సినిమా అయినా మీడియం రేంజ్ సినిమా అయినా.. వందల కోట్ల బడ్జెట్ ఉన్నా.. లో బడ్జెట్ తో చేసినా సరే సినిమాకు ఎంచుకున్న కథ.. దానికి తగినట్టుగా కథనం ఇవి బాగుంటేనే ఆడియన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. ఏదో కొన్ని బ్లాక్స్ మాత్రం బాగా తీసి మిగతా అంతా నడిచిపోతుందిలే అంటే మాత్రం అలాంటి సినిమాలను తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు.

సినిమా టీజర్, ట్రైలర్ ఎంత బజ్ పెంచినా.. రిలీజ్ ముందు ఎంత ప్రమోట్ చేసినా సినిమా మొత్తం ఎంటర్టైన్ అయితేనే సూపర్ అనేస్తున్నారు తప్ప కొంత బాగుండి కొంత బాగాలేని సినిమాలను ఎంకరేజ్ చేయట్లేదు. ఈమధ్య వచ్చిన కొన్ని సినిమాల ఫలితం చూసుకుంటే సినిమా మరీ వరస్ట్ అనిపించేలా లేకపోయినా ఈ హాఫ్ బేక్డ్ మూవీస్ మాకెందుకు అంటూ రెస్పాండ్ అవుతున్నారు.

ఫ్యామిలీ, యాక్షన్, క్రైం ఇలా అన్ని జోనర్ల సినిమాలు సరైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది. అయితే కథ కథనాల్లో కొత్తదనం లేకపోయినా ప్రేక్షకులు ఎలాంటి సినిమా తీసినా చూస్తారులే అనే ఆలోచనతో చేసినా ఈ ప్రయత్నాలన్నీ కూడా వర్క్ అవుట్ అవ్వవు. కొత్త టాలెంట్ కొత్త కథలు అద్భుతమైన కథనాలతో సినిమాలు వస్తున్నా వాటికి తగినట్టుగానే రొటీన్ కంటెంట్ తో సినిమాలు కూడా అడపాదడపా కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలు చేయడం వల్ల నెంబర్స్ కౌంట్ తప్ప ఎలాంటి లాభం ఉండదని గుర్తించాల్సిందే.

థియేటర్ లో డబ్బులు పెట్టి సినిమా చూసినా అక్కడ కొన్ని రొటీన్ రోత సినిమాలు వస్తున్న కారణంగా సినీ ప్రియులంతా ఓటీటీ దారి పడుతున్నారు. అందుకే మన దగ్గర ఓటీటీ లకు మంచి డిమాండ్ పెరిగింది. కొందరు ఆడియన్స్ అయితే థియేటర్ లకు వెళ్లడం మానేసి కేవలం ఓటీటీ కంటెంట్ ని చూసి ఎంటర్టైన్ అవుతున్నారు.