చావా డిబేట్.. మొఘలులను తక్కువ చేసి చూపించారా?
చరిత్ర నేపథ్యంలో నేటి అధునాతన సాంకేతికతతో అద్భుతమైన సినిమాలు తీస్తున్నందుకు క్రియేటర్లకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
By: Tupaki Desk | 25 Jan 2025 5:13 PM GMTభారతదేశ చరిత్రను పరిశీలిస్తే, భిన్నజాతులు మతాల కలయికను చూడొచ్చు. హిందూ రాజ్యాలపై మొఘలుల దాడుల అనంతరం ముస్లిమ్ చక్రవర్తుల పాలన గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే ఇదే చరిత్రలో విరోచితంగా పోరాడి దుర్భేధ్యమైన పరాయి దేశ చక్రవర్తులపై గెలిచిన హిందూ రాజుల గురించిన అసాధారణ కథలను వెతికి మరీ మన దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. చరిత్ర నేపథ్యంలో నేటి అధునాతన సాంకేతికతతో అద్భుతమైన సినిమాలు తీస్తున్నందుకు క్రియేటర్లకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఇప్పుడు మొఘలులను, చక్రవర్తి ఔరంగజేబ్ ను ఎదుర్కొన్న మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడైన శంభాజీ మహారాజ్ కథను చావా పేరుతో సినిమాగా తీసారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే వీరాధి వీరుడిగా శంభాజీ పరాక్రమాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ పోరాట విన్యాసాలు రక్తి కట్టించాయి. ఇందులో రాణి పాత్రలో రష్మిక మందన్న నటించింది.
అయితే చావా ట్రైలర్ చూశాక... ఒక సెక్షన్ లో ఇస్లామోఫోబిక్ సినిమాలు తీసే ధోరణి గురించి చర్చ సాగుతోంది. చావా అనేది మొఘలులను ఎదుర్కొనే మరాఠా రాజుల కథ. హిందువుల జీవన్మరణ కథ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ఎదురించే శంభాజీ మహారాజ్ విరోచిత పోరాటాల కథ. అయితే చరిత్రను వక్రీకరించకుండా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడని అంతా భావిస్తున్నారు. సహజంగానే బాలీవుడ్ దర్శకులు ముస్లిమ్ వ్యతిరేక సినిమాలు తీస్తున్నారని ఇటీవలి కాలంలో కొన్ని వివాదాలు చెలరేగాయి. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ ఈ తరహాలోనే విమర్శల్ని ఎదుర్కొన్నాయి. చాలా దేశభక్తి సినిమాలు ఒక మతానికి వ్యతిరేక సినిమాలుగా ముద్రపడ్డాయి. ఇప్పుడు చావా చిత్రానికి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉటేకర్ చరిత్ర కథను యథాతథంగా కళ్లకు కట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేటి సాంకేతికతతో దీనిని విజువల్ వండర్ గా మలిచారని ట్రైలర్ చెబుతోంది. అయితే ఇది హిందూ రాజు కథ కావడం వల్లనే ఇస్లామో ఫోబియోను తెరపైకి తెచ్చారని అర్థమవుతోంది.
పద్మావత్ సినిమాలో దర్శకుడు భన్సాలీ హిందూ రాజులను తగ్గించి చూపించినందున రాజ్ పుత్ ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు హిందూ రాజులను అద్భుతంగా చూపిస్తున్నాడు గనుక ఒక మతం నుంచి లక్ష్మణ్ ఉటేకర్ కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడం సహజం. అయితే చరిత్రను వక్రీకరించకుండా, పాత్రలను ఫేక్ గా చూపించకుండా, జరిగిన కథను ఉన్నదున్నట్టు చూపిస్తేనే అది ప్రజలకు నచ్చుతుంది. లేదంటే తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చారిత్రక వారియర్ డ్రామా చావా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.