Begin typing your search above and press return to search.

యాంక‌ర్‌తో న‌టుడి అనుచిత ప్ర‌వ‌ర్త‌నకు చీవాట్లు

మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు తమిళ నటుడు కూల్ సురేష్ బ‌హిరంగంగా క్షమాపణలు చెప్పాడు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 3:29 PM GMT
యాంక‌ర్‌తో న‌టుడి అనుచిత ప్ర‌వ‌ర్త‌నకు చీవాట్లు
X

మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు తమిళ నటుడు కూల్ సురేష్ బ‌హిరంగంగా క్షమాపణలు చెప్పాడు. త్వ‌ర‌లో రిలీజ్‌కి రానున్న 'స‌రక్కు' ప్ర‌మోష‌న్స్ లో యాంక‌ర్ మెడ‌లో న‌టుడు కూల్ సురేష్ బలవంతంగా దండ వేసాడు. అయితే దీనిపై నెటిజనులు స‌హా ప‌లువురు తీవ్రంగా అత‌డిని దండించే ప్ర‌య‌త్నం చేసారు. తొలిగా త‌న‌ని తాను స‌మ‌ర్థించుకుంటూ, ఆమెతో తొలి నుంచి స‌ర‌దాగా ఉన్నాన‌ని, ఇది యాధృచ్ఛిక ఘ‌ట‌న అని వాదించాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.

కూల్ సురేష్ వివ‌ర‌ణ ఇలా ఉంది. నేను నిన్న షో హోస్ట్‌కి పూలమాల వేసాను. నేను అలా చేసి ఉండాల్సింది కాద‌ని తర్వాత తెలుసుకున్నాను. వాతావరణం ఉల్లాసంగా .. సరదాగా ఉండాలని నేను కోరుకున్నాను. అయితే నేను సరదాగా చేసినది స‌రికాద‌ని నాక్కూడా అనిపించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా పెద్దదిగా మారింది. ఇది నాకు చాలా బాధ కలిగించింది... అని అన్నాడు. మహిళా హోస్ట్ పేరు నాకు తెలియదు. కానీ నేను ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ అమ్మాయి నాకు ముందుగా తెలియదు. ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు నేను ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాను. నేను దండ వేయగానే ఆ అమ్మాయి వెంటనే స్పందించింది. ఆమె కూడా ఇంతకు ముందు నాతో కలిసి డ్యాన్స్ చేసిందని భావించి, ఆమె సరదాగా ఉంటుందని భావించినందున నేను మాలను అలా మెడ‌లో వేసాను.. అని అన్నాడు.

కూల్ సురేష్ జ‌ర్న‌లిస్టుల‌కు సారీ చెప్పాడు. తాను చేసిన ప‌నికి కారణాలను వివరిస్తూ-"కూల్ సురేష్ ఏదైనా చేస్తే, అతను దానిని పిచ్చిగా చేస్తాడని అందరూ ఊహిస్తారు. అదే ఆలోచిస్తూ నాకు కూడా కాస్త సరదాగా గడపాలనిపించింది. కానీ అది ఆ మహిళకు ఇంత ఇబ్బందిని కలిగిస్తుందని నేను ఊహించలేదు. దీనికి ప్రెస్ ఫ్రెండ్స్కి క్షమాపణలు" అని అన్నాడు. ఇది పూర్తిగా తన తప్పు అని నిన్న జరిగిన కార్యక్రమంలో కూల్ సురేష్‌ తరపున క్షమాపణలు చెప్పిన నిర్మాత మన్సూర్ అలీ ఖాన్ అత‌డి ప్రవర్తనకు తాను మ‌ద్ధ‌తు ప‌ల‌క‌న‌ని కూడా పేర్కొన్నాడు. ఘ‌ట‌న అనంత‌రం కూల్ సురేష్ స‌ద‌రు యాంక‌ర్ కి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా వేదిక‌పై మ‌న్సూర్ అలీఖాన్ డిమాండ్ చేసారు.

అమ్మాయి నోరు మూయిస్తారు..

అనుమ‌తి లేకుండా ఇలా మాల వేయ‌డం త‌ప్పు అని చాలా మంది అభిప్రాయం వ్య‌క్తం చేయ‌గా, గాయ‌ని చిన్మ‌యి దీనిని పూర్తిగా త‌ప్పు ప‌ట్టారు. "ఇది భ‌యంక‌ర‌మైన ప్ర‌వ‌ర్త‌న‌. అత‌డిపై ఎవ‌రూ చ‌ర్య‌లు తీసుకోరు. పైగా ఆ అమ్మాయి నోరే మూయిస్తారు. వివాదం చేయొద్ద‌ని నోరు నొక్కేస్తారు. అక్క‌డ ఉన్న అబ్బాయిలు దీనికి చ‌ప్ప‌ట్లు కూడా కొట్టారు.." అని చిన్మ‌యి సీరియ‌స్ అయ్యారు.