ఒరిజినల్ కాకుండా కాపీ కొడితే అంతేగా
కాపీ కొట్టి సినిమాలు తీసే సీన్ ఇక కనుమరుగైనట్టే. నేటి సోషల్ మీడియా- డిజిటల్ యుగంలో ఇది చాలా రిస్క్ తో కూడుకున్న ప్రక్రియ.
By: Tupaki Desk | 14 Feb 2025 3:58 AM GMTకాపీ కొట్టి సినిమాలు తీసే సీన్ ఇక కనుమరుగైనట్టే. నేటి సోషల్ మీడియా- డిజిటల్ యుగంలో ఇది చాలా రిస్క్ తో కూడుకున్న ప్రక్రియ. ఇంతకుముందులా ఏదైనా హాలీవుడ్ సినిమా లేదా కొరియన్ సినిమా నుంచి కథను లిఫ్ట్ చేయడం లేదా సీన్లు ఎత్తి వేయడం అనేది ఇక కుదరదు. ఎందుకంటే గ్లోబల్ ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదిగా మారింది. కేవలం స్మార్ట్ ఫోన్ లో గూగుల్ సెర్చ్ చేస్తే చాలు.. కాపీ సీన్లు ఏవి? ఏ సినిమాకి ఏది కాపీ? అన్నది సులువుగా తెలిసిపోతుంది.
గతంలో `అజ్ఞాతవాసి` చిత్రం `లార్గో వించ్`కి కాపీ అని ఆరోపణలు వచ్చాయి. ఆ సినిమా చట్టపరమైన సమస్యల్ని కూడా ఎదుర్కొంది. లార్గోవించ్ హక్కులు టీసిరీస్ వద్ద ఉన్నాయి. దీంతో అజ్ఞాతవాసి నిర్మాతలు టీసిరీస్ ని సంప్రదించి సమస్యను పరిష్కరించుకున్నారు. కానీ దాని ఒరిజినల్ క్రియేటర్ అయిన ఫ్రెంచి ఫిలింమేకర్ జెరోమ్ సల్లే పరిహారం డిమాండ్ చేయగా అతడితోను మరో ఒప్పందం కుదుర్చుకున్నారని కథనాలొచ్చాయి. ఇకపోతే కాపీ క్యాట్ ఆరోపణల కారణంగా త్రివిక్రమ్ అతడి టీమ్ ప్రతిష్ఠ మసకబారింది. పైగా అజ్ఞాతవాసి డిజాస్టర్ అయ్యి అందరికీ నష్టాలను తెచ్చింది.
ఇంతకుముందు తాప్సీ, అమితాబ్ నటించిన బద్లా చిత్రం కూడా కాపీ రైట్స్ ఉల్లంఘనల ఆరోపణల్ని ఎదుర్కొంది. స్పానిష్ చిత్రం ఇన్ విజిబుల్ గెస్ట్ కి కాపీ అని ఆరోపణలు రావడంతో దానిని చట్టపరంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు తళా అజిత్ నటించిన తమిళ చిత్రం `విదాముయార్చి`హాలీవుడ్ చిత్రం `బ్రేక్‌డౌన్`( 1997 )కి అనధికారిక రీమేక్ అని ఆరోపణలు వచ్చాయి. ఒరిజినల్ నిర్మాత పారామౌంట్ పిక్చర్స్ లైకా ప్రొడక్షన్స్‌పై రూ.150 కోట్లకు దావా వేసిందని, రూ.11 కోట్లకు సెటిల్ చేసుకున్నారని కథనాలొచ్చాయి. దురదృష్టవశాత్తూ విదాముయార్చి (తెలుగులో పట్టుదల) డిజాస్టర్ గా మారింది. కాపీ క్యాట్ ఆరోపణల కారణంగా పరువు పోవడమే కాకుండా, ఒరిజినల్ క్రియేటర్లకు కోట్లలో చెల్లించుకోవాల్సి వచ్చింది.
రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకుల సినిమాలపై గతంలో విమర్శలొచ్చాయి. ఫలానా సీన్ నుంచి కాపీ చేసారని, పోస్టర్ కాపీ అని చాలా పుకార్లు షికార్ చేసాయి. అయితే ఇలా వేరొక భాష నుంచి సినిమాను కాపీ చేస్తే ఇప్పుడు వెంటనే యూత్ కనిపెట్టేస్తున్నారు. దానిపై సోషల్ మీడియాల్లో పెద్ద డిబేట్లు పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. ఈ అధునాతన డిజిటల్ యుగంలో ఇకపై కాపీ కొట్టి ఫ్రీమేక్ లు చేయలేరు. ఉచితంగా ఏదీ కొట్టేయలేరు! ఒకప్పటితో పోలిస్తే మారిన సీన్ ఇది. ఇకపై పుష్ప తరహాలో ఒరిజినల్ కంటెంట్ ని క్రియేట్ చేసేవాళ్లకే మార్కెట్లో చెల్లుబాటు అవుతుంది.