సినిమా విషయంలో నాని నమ్మే రెండు విషయాలు
మార్చి 14న రిలీజైన ఈ సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులతో పాటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది.
By: Tupaki Desk | 16 March 2025 12:04 PM ISTనాని హీరోగా వాల్‌పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో రూపొందిన మూవీ కోర్టు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాతో రామ్ జగదీష్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మార్చి 14న రిలీజైన ఈ సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులతో పాటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సెలబ్రేషన్ ఆఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ పేరుతో సక్సెస్ మీట్ ను నిర్వహించి తమ ఆనందాన్ని తెలిపారు. తాను ఇప్పటివరకు స్క్రిప్ట్, ఆడియన్స్ అనే రెండు విషయాలనే నమ్మానని, స్క్రిప్ట్ తన టీమ్ ను గెలిపిస్తే, తెలుగు ఆడియన్స్ సినిమాను గెలిపించారని, కోర్టు సినిమా తనను గెలిపించిందని నేచురల్ స్టార్ నాని అన్నారు. కోర్టు టీమ్ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో కోర్టు పేరు మరింత వినపడుతుందని, సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు.
ఇక కీలక పాత్రలో నటించిన ప్రియదర్శి మాట్లాడుతూ బలగం లాంటి హిట్ అందుకున్న తర్వాత ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ రామ్ జగదీష్ తనకు ఈ కథ చెప్పాడని, ఈ కథను నాని నమ్మకపోయుంటే ఇంత దూరం వచ్చేది కాదని, తనకి, తమ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పిన ఆయన తెలుగు ఆడియన్స్ జాతిరత్నాలు అన్నారు.
కోర్టు మూవీ రిలీజయ్యాక అందరికంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేసిన శివాజీ 25 ఏళ్లుగా మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం ఎదురుచూశానని, ప్రతీ ఆర్టిస్ట్‌కు ఒక కల ఉంటుందని, ఒక రోజంతా మన గురించే మాట్లాడుకోవాలనుకుంటారని, ఆ కల కోర్టు మూవీతో తీరిందన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి నాని, మరో సూపర్ స్టార్ కృష్ణ అని, నాని కూడా కృష్ణ గారిలానే కొత్తగా ఆలోచిస్తూ మంచి కంటెంట్ ను ప్రోత్సహిస్తాడని అన్నారు. కోర్టు సినిమాను ఆదరిస్తున్న ఆడియన్స్ కు ధన్యవాదాలని, సినిమా జిందాబాద్... ప్రొడ్యూసర్ జిందాబాద్ అన్నారు.
కోర్టు సినిమా విషయంలో చాలా గర్వంగా ఫీలవుతున్నట్టు డైరెక్టర్ రామ్ జగదీష్ తెలిపారు. సినిమాకు చాలా పవర్ ఉందని, సినిమా లైఫ్ నే మార్చేస్తుందని, తను నాని గారి ప్రొడక్ట్ అని చెప్పడం ఎంతో ప్రౌడ్ గా ఉందన్నారు. ప్రియదర్శికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన రామ్ జగదీష్, మంగపతి పాత్రలో శివాజీని తప్ప మరొకరిని ఊహించలేనన్నారు.
అన్ని చోట్ల నుంచి కోర్టు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని, రామ్ జగదీష్ అద్భుతమైన రైటింగ్ తో మంచి కథ చెప్పారని రోహిణి చెప్పారు. అనిల్ రాసిన మాస్టర్ స్క్రీన్ ప్లే కు చాలా చోట్ల చప్పట్లు కొట్టారని, నాని మంచి టాలెంట్ ను ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారని, మంచి సినిమా వస్తే ఆడియన్స్ దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పడానికి కోర్టు సినిమా నిదర్శనమని ఆమె అన్నారు.
కోర్టు సినిమా ఇంత మంచి అవుట్‌పుట్ రావడానికి కారణం నాని గారి జడ్జిమెంటే కారణమన్నారు హర్ష వర్ధన్. ఈ సక్సెస్‌మీట్ లో అందరికీ క్రెడిట్ ఇవ్వడం ఆనందంగా ఉందని, నాని ఈ సినిమాను ఎంతో నమ్మారని, మంచి స్టార్ అవడమే కాదు, స్టార్ మేకర్ కూడా అయ్యారని, గట్స్ ఉంటేనే ఇలాంటి సినిమాలు తీయగలమని ఆయన అన్నారు.
ఇక సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన శ్రీదేవి మాట్లాడుతూ, తన సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడటం ఒక కల అని, ఆ కల కోర్టుతో తీరిందని, చిత్ర యూనిట్ మొత్తానికి థ్యాంక్స్ చెప్తూ ప్రతి ఒక్కరూ కోర్టుని థియేటర్లలో చూడమని కోరింది. రోషన్ మాట్లాడుతూ కోర్టు సక్సెస్ చాలా గొప్ప అనుభూతినిచ్చిందని, డైరెక్టర్ జగదీష్ అన్నకి చాలా పెద్ద థ్యాంక్స్ అన్నాడు. తనను తను నమ్మే దానికంటే జగదీష్ అన్న ఎక్కువగా నమ్మాడని చెప్పాడు. ఇంత మంది ఛాన్స్ ఇచ్చినందుకు నాని అన్న లవ్ యూ అని చెప్పాడు.
కోర్టు గురించి నాని సోదరి దీప్తి మాట్లాడుతూ డైరెక్టర్ జగదీష్ సినిమా పిచ్చోడని, సినిమా గురించి తప్ప మరో విషయం మాట్లాడడని, ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపింది. ఈ ఈవెంట్ లో శ్రీదేవి, రోషన్ ప్రేమలో సాంగ్ కు సంతోషంగా డ్యాన్స్ వేయగా, వారితో పాటూ ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ నాని, ప్రియదర్శి కూడా ఆ హిట్ సాంగ్ కు డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.