దగ్గుబాటి కుటుంబంపై కోర్టు సీరియస్!?
అనధికార కూల్చివేత కోసం వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ లు జీహెచ్ఎంసి అధికారులు- పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jan 2025 6:21 AM GMTటాలీవుడ్ అగ్ర కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌ను కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేసారని ఆరోపిస్తూ నందకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను అనుసరించి కోర్టు నిర్ణయం తీసుకుంది. లీజుకు సంబంధించి ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కోట్లాది రూపాయల విలువైన హోటల్ ను కూల్చివేసారని నందకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనధికార కూల్చివేత కోసం వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ లు జీహెచ్ఎంసి అధికారులు- పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
2022 నుంచి ఈ వివాదం ఇరుపక్షాల నడుమా నలుగుతోంది. అప్పట్లోనే హోటల్ ని పాక్షికంగా కూల్చివేశారని మీడియాలో కథనాలొచ్చాయి. 2024 జనవరిలో పూర్తిగా కూల్చివేతలు జరిగాయి. అదే ఏడాది నవంబర్ లో దగ్గుబాటి కుటుంబంపై కేసు పెట్టి విచారించాలని కోర్టు పేర్కొంది. 60 మంది వరకు ప్రైవేట్ బౌన్సర్లు ఆస్తిని ధ్వంసం చేయడంలో పాల్గొన్నారని, ఈ ప్రక్రియలో విలువైన ఫర్నిచర్ తీసుకెళ్లారని, దీని ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని నందకుమార్ గతంలోనే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నందకుమార్ విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, నాంపల్లి కోర్టు దగ్గుబాటి కుటుంబ సభ్యులపై భారత శిక్షాస్మృతి (IPC)లోని 448, 452, 380, 506, 120b సెక్షన్‌లను ప్రయోగించి కేసు నమోదు చేయాలని ఇదివరకూ ఆదేశించింది.
ఈ కేసులో నాంపల్లి కోర్టు (17వ నంబర్) తాజా విచారణలో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పేర్కొంటూ ఈ శనివారం (11జనవరి) నాడు స్పష్ఠంగా ఆదేశాలు జారీ చేసింది. కేసు ముందుకు సాగుతున్న కొద్దీ చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు పేరుగాంచిన దగ్గుబాటి కుటుంబానికి గొప్ప పేరుంది. ఇప్పుడు ఆస్తి వివాదం కారణంగా.. కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవడం చర్చగా మారింది. ముఖ్యంగా కోర్టు ఆదేశాల ధిక్కరణపై న్యాయమూర్తులు సీరియస్ గా ఉన్నారని కథనాలొస్తున్నాయి.