Begin typing your search above and press return to search.

చిన్న సినిమా రెండు పెద్ద రికార్డ్‌లు

చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా కలెక్షన్స్ గురించి అధికారిక ప్రకటన చేశారు.

By:  Tupaki Desk   |   26 March 2025 4:41 AM
Court Box Office Collections
X

నాని హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. హీరోగా ఎంత బిజీగా ఉన్నా నిర్మాతగా తన అభిరుచికి తగ్గ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. విభిన్న కథలతో పాటు, మంచి మెసేజ్‌ను జనాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో లో బడ్జెట్‌ సినిమాలు, మీడియం బడ్జెట్‌ సినిమాలను నిర్మించడం లేదా, తన వంతు సహకారంను అందించడం చేస్తూ వస్తున్నాడు. తాజాగా 'కోర్ట్‌' సినిమాను నాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. రామ్‌ జగదీష్ దర్శకత్వంలో దీప్తి గంటా, ప్రశాంతి తిర్పినేని నిర్మించిన ఈ సినిమాను నాని సమర్పించాడు. సినిమా కథపై నమ్మకంతో, దర్శకుడు తీసిన విధానం నచ్చడంతో ప్రమోషన్స్‌లో ఎక్కువగా కనిపించాడు.


కోర్ట్‌ సినిమా నచ్చక పోతే తన హిట్‌ 3 సినిమా చూడవద్దంటూ ఓపెన్‌ ఛాలెంజ్‌ చేసేంత నమ్మకంను ఆయన పెంచుకున్నాడు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. చిన్న సినిమాగా విడుదలైన కోర్ట్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కొన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది.. కానీ వసూళ్లు అంతంత మాత్రమే రాబడుతాయి. కొన్ని సినిమాలు వసూళ్లు రాబట్టినా విమర్శలు ఎదుర్కొంటాయి. కానీ కోర్ట్‌ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని, మంచి మెసేజ్ ఉన్న సినిమా అని కామెంట్స్ దక్కించుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా కలెక్షన్స్ గురించి అధికారిక ప్రకటన చేశారు.


ఇటీవలే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు మించి వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్‌ నమోదు చేసింది. అంతే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. ఈ మద్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు కూడా యూఎస్‌లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేసేందుకు కష్టపడుతున్నాయి. ఇలాంటి సమయంలో యూఎస్‌లో చిన్న సినిమా అయిన కోర్ట్‌ కి మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు కావడం పెద్ద విషయం. మిడియం రేంజ్ సినిమాలు, చిన్న బడ్జెట్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టడం అతి పెద్ద విషయం. ఆ అరుదైన రికార్డ్‌ను కోర్ట్‌ సినిమా దక్కించుకుంది.

పోక్సో చట్టంను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయాన్ని చక్కగా అర్థం అయ్యేలా దర్శకుడు రామ్‌ జగదీష్ ఈ సినిమాలో చూపించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో యూత్‌ చట్టం గురించి తెలియకుండా చేస్తున్న తప్పుల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి కోర్ట్‌ సినిమా యూత్‌కి మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కి సైతం కనెక్ట్‌ అయ్యే విధంగా కాన్సెప్ట్‌ను కలిగి ఉండటంతో మంచి స్పందన దక్కించుకుంది. విడుదలై రెండు వారాలు పూర్తి అయినా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటికి సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో లాంగ్‌ రన్‌లో కోర్ట్‌ రూ.70 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్‌ వర్గాల అంచనా. నాని ఈ సినిమాతో మరో మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.