Begin typing your search above and press return to search.

స‌హ‌న‌టుడిపై వ‌డివేలు 5 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం

ఇప్పుడు స‌హ‌న‌టుడిపై ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేసి చ‌ర్చ‌ల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 5:30 PM GMT
స‌హ‌న‌టుడిపై వ‌డివేలు 5 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం
X

కోలీవుడ్ కామెడీ కింగ్ వ‌డివేలు ఇటీవ‌ల సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే ఎక్కువ‌గా మీడియా హెడ్ లైన్స్‌లో కొస్తున్నారు. ఇప్పుడు స‌హ‌న‌టుడిపై ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేసి చ‌ర్చ‌ల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ సహచర నటుడు సింగముత్తు నుంచి రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వడివేలు మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

సింగముత్తు తనపై తదుపరి ఎలాంటి తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయకుండా నిరోధించేలా శాశ్వత ఉత్తర్వులు జారీ చేయాలని వడివేలు తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. జస్టిస్ ఆర్‌ఎంటీ టీకా రామన్‌ కేసును విచారణకు స్వీకరించి దావాపై స్పందించాల్సిందిగా సింగముత్తును ఆదేశించారు. సింగముత్తు జనవరి 16, ఫిబ్రవరి 11 తేదీలలో యూట్యూబ్ ఛానెల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వ్యాఖ్య‌ల‌ను వ‌డివేలు సీరియ‌స్ గా తీసుకున్నారు. వ‌డివేలు వ్యక్తిగత, వృత్తిగ‌త‌ జీవితం గురించి సింగ‌ముత్తు ప‌లుర‌కాలుగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసాడు. త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేసాడని దావాలో పేర్కొన్నారు.

ఆ ఇంటర్వ్యూల తర్వాత వడివేలు మార్చి 19న సింగముత్తు స‌హా స‌ద‌రు యూట్యూబ్ ఛానెల్‌లకు లీగల్ నోటీసులు జారీ చేశారు. క్షమాపణలు చెప్పాలని, వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఛానెల్‌లు కట్టుబడి ఉండగా సింగముత్తు ప్రతిస్పందిస్తూ తన వాక్ స్వాతంత్య్ర హక్కు రాజ్యాంగం ప్రకారం రక్షించబడిందని, దానిని చర్చనీయాంశంగా మార్చార‌ని అన్నారు.

వడివేలు దీనికి ప్ర‌తిగా స్పందిస్తూ.. ఇది `గాయానికి ఉప్పు` అని అభివర్ణించారు. పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు త‌న‌ను తీవ్ర మానసిక వేదనకు గురి చేసాయ‌ని, అత‌డి త‌ప్పుడు వ్యాఖ్య‌లు చాలా బాధను కలిగించాయని సింగముత్తు తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించకపోతే అతడు ఇంకా అలాంటి చౌకబారు కామెంట్లు చేస్తూనే ఉంటాడని దావాలో పేర్కొన్నాడు. వడివేలు సినిమాలు ప‌లు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ అయ్యాయి. అత‌డు అన్నిచోట్లా పాపుల‌ర్ స్టార్. సింగముత్తు చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు ప్ర‌జ‌ల్లో త‌న‌ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని ఆయన వాదించారు.