Begin typing your search above and press return to search.

అట‌వీ భూమిలో షూట్ య‌ష్ 'టాక్సిక్‌'కి కోర్టు చిక్కులు

అంతేకాకుండా ఈ వివాదాస్పద ప్రదేశంలో ఫిల్మ్ సెట్‌ను నిర్మించ‌డానికి అనుమతినిచ్చిన HMT కంపెనీకి కోర్టు నుండి నోటీసు పంపారు.

By:  Tupaki Desk   |   28 July 2024 6:58 AM GMT
అట‌వీ భూమిలో షూట్ య‌ష్ టాక్సిక్‌కి కోర్టు చిక్కులు
X

యశ్ హీరోగా తెరకెక్కుతున్న `టాక్సిక్` సినిమా సెట్ విషయంలో కెవిఎన్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీకి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా సినిమా సెట్‌ను నిర్మించడమే దీనికి కార‌ణం. అటవీ భూమిగా వర్గీకరించిన బెంగళూరు సరిహద్దులో ఉన్న సుమారు 20 ఎకరాల స్థలంలో భారీ బడ్జెట్ చిత్రం సెట్‌ను నిర్మించారని పేర్కొంటూ న్యాయవాది బాలాజీ నాయుడు జి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అనుమతి లేకుండానే ఈ నిర్మాణాన్ని చేపట్టారని పిల్‌ పేర్కొంది.

అంతేకాకుండా ఈ వివాదాస్పద ప్రదేశంలో ఫిల్మ్ సెట్‌ను నిర్మించ‌డానికి అనుమతినిచ్చిన HMT కంపెనీకి కోర్టు నుండి నోటీసు పంపారు. తాజా క‌థ‌నం ప్రకారం.. హెచ్ఎంటి ఆ ప్రదేశంలో కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత ప్రశ్నార్థకమైన భూమిని కెనరా బ్యాంక్‌కు విక్రయించారు. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ ఆ భూమిని అటవీ భూమిగా వర్గీకరిస్తూనే ఉన్నారని పిల్ లో ఎత్తి చూపారు. ఈటీవీ భార‌త్ క‌థ‌నం ప్ర‌కారం.. పీణ్య(బెంగ‌ళూరు) ప్లాంటేషన్‌ భూమికి ఆనుకుని ఉన్న అటవీ భూమిగా పేర్కొన్న 20 ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా సెట్‌ను నిర్మించారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించామని న్యాయవాది బాలాజీ నాయుడు తెలిపారు. లీగల్ క్లియరెన్స్ లేకుండా నిర్మించిన ఈ సెట్‌ను క్లియర్ చేయాల్సి ఉంద‌ని పిల్ ప్ర‌స్థావించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ అంజరియా, జస్టిస్ కేవీ అరవింద్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.

కోర్టు నోటీసుపై కెవిఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రీత్ స్పందిస్తూ- ``ఈ సెట్ హెచ్‌ఎంటికి చెందిన ఆస్తికి ఆనుకుని ఉన్న స్థలంలో ఉంది. సెట్ నిర్మాణం ఇంకా పురోగతిలో ఉన్నందున మేము ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు. ఈ ప్రాంతం ప్రజలతో ముడిపడి ఉంది. మా కార్యాలయానికి లేదా ఆస్తి యజమానికి నోటీసు పంపించి ఉండవచ్చు`` అని తెలిపిన‌ట్టు ఈటీవీ భార‌త్ పేర్కొంది.

కేజీఎఫ్ ఫ్రాంఛైజీ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని య‌ష్ ఈ సినిమా చేస్తున్నారు. ఓవైపు నితీష్ తివారీ రామాయ‌ణం లో న‌టిస్తూనే, టాక్సిక్ ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇది అంత‌కంత‌కు డిలే అవుతోంది. నిజానికి టాక్సిక్ 10 ఏప్రిల్ 2025న గ్రాండ్ రిలీజ్ కానుంద‌ని టీమ్ ప్ర‌క‌టించింది. అయితే బాలీవుడ్ మీడియాలో ఇటీవల వచ్చిన క‌థ‌నాల ప్ర‌కారం.. టాక్సిక్ వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్‌ని కోల్పోవచ్చని తెలుస్తోంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఉన్న పాపుల‌ర్ స్టార్ల‌ను ఒకచోట చేర్చి చిత్రీక‌రించాల్సి ఉంది. మేకర్స్ దీనిని భారీ కాన్వాస్‌తో రూపొందిస్తున్నందున స్టార్ల కాల్షీట్ల‌ను పొందడం పెద్ద సవాలుగా ఉంద‌ని తెలుస్తోంది. అందువల్ల షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లు ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. అందుకే విడుదల తేదీని వాయిదా వేయాల‌ని టీమ్ నిర్ణయించుకుందని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఇప్పుడు కోర్టు చిక్కులు కూడా ఆల‌స్యానికి కార‌ణం కావొచ్చ‌ని అంచ‌నా. అయితే టాక్సిక్ టీమ్ నుంచి కొత్త రిలీజ్ డేట్ ప్రస్తావన లేదు. ఈ చిత్రంలో యష్ సోదరిగా నయనతార నటిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా నేప‌థ్యంలో భారీ యాక్షన్ చిత్రం. ఇందులో కియారా అద్వానీ, తారా సుతారియా, శృతి హాసన్, హుమా ఖురేషి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.