Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్లకు "గుట్కా" డబ్బు కక్కుర్తి.. కోర్టు నోటీసు

అందులోనూ టాప్ స్టార్లంతా ఒకే యాడ్ లో చేయడంతో.. గుట్కాను ప్రమోట్ చేస్తారా? అంటూ వారిపై మహిళలు, మధ్య తరగతి వారు మండిపడ్డారు. ఇప్పుడీ వ్యవహారంలోనే కోర్టు స్పందించింది.

By:  Tupaki Desk   |   10 Dec 2023 7:35 AM GMT
బాలీవుడ్ స్టార్లకు గుట్కా డబ్బు కక్కుర్తి.. కోర్టు నోటీసు
X

రూ.వంద కోట్లపైగా రెమ్యూనరేషన్.. సెలబ్రిటీ హోదా.. ఇంకా వాణిజ్య ప్రకటనల ఆదాయం.. సమాజంలో పలుకుబడి.. సినిమా స్టార్లకు దక్కే దర్పం ఇది. సినిమా రంగం అంటేనే గ్యారెంటీ లేనిది.. కళను నమ్ముకుని భవిష్యత్తును పెట్టుబడిగా పెట్టే రంగం.. అయితే, ప్రతిభ ఉండి క్లిక్ అయితే తిరుగుండదు. దీంతోనే పేరు, డబ్బు వచ్చి పడుతుంటుంది. కొందరు ఇదే సమయంలో తప్పు దారి పడితే.. మరికొందరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్థిరపడుతుంటారు. అలాఅలా స్టార్లుగా ఎదిగిపోతుంటారు. అందులోనూ హీరోలయితే ఆరాధ్య దేవతలుగా మారిపోతుంటారు.

సంపాదనలోనూ సామాజిక బాధ్యత ఉండాలి..

ఎంత సంపాదించినా.. సామాజిక బాధ్యత మరువకూడదు. మరీ ముఖ్యంగా సినిమా రంగంలోని వారికి. తమ చిత్రాలతో నీతులు చెప్పేవారు కావడమే దీనికి కారణం. అందుకనే చాలామంది హీరోలు సినిమాల్లో సిగరెట్ మద్యం తాగే సీన్లలో నటించరు. ఇప్పటికే కూల్ డ్రింక్స్ ప్రకటనల్లో కనిపిస్తున్న స్టార్లపైనా విమర్శలు వస్తున్నాయి. కాగా.. ముగ్గురు బాలీవుడ్ అగ్ర కథనాయకులు ఓ గుట్కా యాడ్ లో కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇటీవలి కాలంలో ఈ యాడ్ బాగా పాపులర్ అయింది. అందులోనూ టాప్ స్టార్లంతా ఒకే యాడ్ లో చేయడంతో.. గుట్కాను ప్రమోట్ చేస్తారా? అంటూ వారిపై మహిళలు, మధ్య తరగతి వారు మండిపడ్డారు. ఇప్పుడీ వ్యవహారంలోనే కోర్టు స్పందించింది.

షారూఖ్ అక్షయ్ అజయ్ ఇదేం పని..?

బాలీవుడ్ లో బాద్ షా ఎవరంటే ఠక్కున వచ్చే పేరు షారూక్ ఖాన్. ఇటీవలే రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది ఆయన సినిమా. ఇక సినిమాల హిట్ల పరంగా అక్షయ్ కుమార్ ది రికార్డు. అందులోనూ ఆయన ఎంచుకునే పాత్రలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అజయ్ దేవగన్ సింగం సిరీస్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. ఓ విధంగా చెప్పాలంటే వీరు ముగ్గురు బాలీవుడ్ టాప్-5 హీరోలు. అలాంటివారు ఒక గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనలో పాల్గొనడం గమనార్హం. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను ప్రమోట్ చేస్తూ, సాగే ఈ యాడ్ లో టాప్ స్టార్లు నటించడం అంటే ప్రజలను తప్పుదారి పట్టించడమే. దీనిపైనే కోర్టులో పిటిషన్ దాఖలైంది. ముగ్గురు బాలీవుడ్‌ హీరోలకూ కేంద్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. షారుక్‌, అక్షయ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారని అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌ నవూ బెంచ్‌ కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేశారు.

సంచలనాల అలహాబాద్ హైకోర్టు..

అగ్ర హీరోలు అయినప్పటికీ హానికారక ఉత్పత్తుల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల మోతీలాల్‌ యాదవ్‌ న్యాయవాది గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అందులోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ ఇటీవల పిటిషనర్‌ మళ్లీ కోర్టుకెళ్లారు. దీనిపై స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. ముగ్గురు అగ్ర హీరోలకు అక్టోబరు 22నే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అయితే, ఈ సంగతి దాదాపు రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. మరోవైపు అలహాబాద్ హైకోర్టు అంటే సంచలన తీర్పులకు మారు పేరు. ఇందిరాగాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది ఈ కోర్టే.

అమితాబ్ కూ గతంలో సెగ

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ గతంలో పాన్ మసాలా యాడ్ లో కనిపించారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆయన ఆ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నారని అలహాబాద్ హైకోర్టు కు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పాండే తెలియజేశారు. అయినప్పటికీ.. ఓ గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేయగా, అమితాబ్ దానిని నోటీసులు పంపారని చెప్పారు. ఈ వ్యవహారంపై ఓ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉందని పాండే వివరించారు. కాబట్టి పిటిషన్‌ ను కొట్టివేయాల్సిందిగా కోరారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.