Begin typing your search above and press return to search.

ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గు.. చ‌క్క‌న‌మ్మ‌ల గొడ‌వ‌లు ఇందుకేనా?

అంతేకాదు.. ఈడీ ప‌రిశోధ‌న‌లో జాక్విలిన్ - నోరాల‌కు సుకేష్ కానుక‌లు అందించాడ‌ని వెల్ల‌డైంది

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:07 AM GMT
ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గు.. చ‌క్క‌న‌మ్మ‌ల గొడ‌వ‌లు ఇందుకేనా?
X

200 కోట్ల దోపిడీ కేసులో జాక్విలిన్ ఫెర్నాండెజ్ వ‌ర్సెస్ నోరాఫ‌తేహి ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. కాన్ మాన్ సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్విలిన్ కి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుండి హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. సుకేష్ తో మ‌రో ఐట‌మ్ గాళ్ నోరా ఫ‌తేహికి స‌త్సంబంధాలున్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి.

అంతేకాదు.. ఈడీ ప‌రిశోధ‌న‌లో జాక్విలిన్ - నోరాల‌కు సుకేష్ కానుక‌లు అందించాడ‌ని వెల్ల‌డైంది. అదేగాక‌... ఈ కేసు విచార‌ణ స‌మ‌యంలోనే 'జాకీ వ‌ర్సెస్ నోరా' ఎపిసోడ్స్ ర‌క్తి క‌ట్టించాయి. ఆ ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. చ‌క్క‌న‌మ్మ‌ల న‌డుమ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం ఉంద‌ని ఈ విచార‌ణ‌లోనే తేలింది. ఆ ఇరువురి న‌డుమా వృత్తిగ‌త‌మైన పోటీ వైరానికి కార‌ణం. ప‌రువు న‌ష్టం దావాల‌తోను పోరాడుతున్నారు.

జాక్విలిన్ - నోరా.. ఒక‌రి అవ‌కాశాల్ని ఒక‌రు కాజేస్తున్నార‌ని కూడా ఆరోప‌ణ‌లు చేసుకున్న సంద‌ర్భాలున్నాయి. ఇక‌పోతే జాక్విలిన్ కి ద‌క్కాల్సిన ఒక క్రేజీ ఆఫ‌ర్ ని నోరా ఫ‌తేహి ఇప్పుడు త‌న ఖాతాలో వేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పాపుల‌ర్ హిందుస్థాన్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. నోరా మహిళా ఒక భారీ స్పోర్ట్స్ డ్రామాలో కీల‌క పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కించుకుంది. 'క్రాక్ - జీతేగా తో జియేగా' భారతదేశపు మొట్టమొదటి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం.

ముంబైలోని మురికివాడల నుండి ఎదిగిన ఒక క్రీడాకారుని జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇందులో విద్యుత్ జమ్వాల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. అత‌డి పాత్ర పూర్తిగా యాక్ష‌న్ ప్రాధాన్య‌తతో ర‌క్తి క‌ట్టించ‌నుంది. జ‌మ్వాల్ ర‌క‌ర‌కాల‌ స్పోర్ట్స్ తో అల‌రిస్తాడు. స్టంట్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో దుమ్ము ద‌లిపేస్తాడ‌ని తెలుస్తోంది. అత‌డి స‌ర‌స‌న నిజానికి జాక్విలిన్ ని క‌థానాయిక‌గా ఎంపిక చేసారు. కానీ ఇంత‌లోనే నోరా ఫ‌తేహి ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తోంది. ఇంకా కోర్టు గొడ‌వ‌లు ముగియ‌లేదు. ఇంత‌లోనే ఈ ప‌రిణామం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

'క్రాక్‌' చిత్రాన్ని ఆది శర్మ -ఆదిత్య చౌక్సే సహ-నిర్మాతలుగా తెర‌కెక్కిస్తున్నారు. ఆదిత్య దత్, సరిమ్ మోమిమ్, రెహాన్ ఖాన్ ర‌చ‌యిత‌లు. మొహెందర్ ప్రతాప్ సింగ్ , అదనపు స్క్రీన్‌ప్లే - డైలాగ్‌ని అందించారు. క్రాక్ - జీతేగా తో జియేగా పోలాండ్‌లో షూటింగ్ ప్రారంభమైంది. 2023లో విడుదల కానుంది.