క్రూ టీజర్: ఖతర్నాక్ ఎయిర్ హోస్టెస్‌తో తస్మాత్ జాగ్రత్త!
ఇప్పుడు పూర్తిగా విమానంలో ప్రయాణీకులతో కమ్యూనికేట్ చేస్తూ కీలక పాత్ర పోషించే అందగత్తెలైన ఎయిర్ హోస్టెస్ ల కథతో సినిమా తెరకెక్కింది.
By: Tupaki Desk | 25 Feb 2024 6:08 AM GMTవిమానయానం, వైమానిక సిబ్బంధి కథతో సినిమాలు చాలా అరుదు. విమానం హైజాక్ నేపథ్యంలో సినిమాలు ఎన్నో వచ్చినా కానీ, వైమానిక సిబ్బంది ఇక్కట్లు, అల్లరి నేపథ్యంలో సినిమాలు చాలా తక్కువే. ఇప్పుడు పూర్తిగా విమానంలో ప్రయాణీకులతో కమ్యూనికేట్ చేస్తూ కీలక పాత్ర పోషించే అందగత్తెలైన ఎయిర్ హోస్టెస్ ల కథతో సినిమా తెరకెక్కింది. ది క్రూ అనేది టైటిల్. టబు, కరీన్ కపూర్ ఖాన్, కృతి సనన్ ఎయిర్ హోస్టెస్ లుగా ప్రధాన పాత్రలు పోషించారు.
ముంబైకి చెందిన ముగ్గురు సాధారణ ఎయిర్‌హోస్టెస్‌లు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయాణం మొదలుపెట్టాక ఏం జరిగింది? అన్నదే సినిమా. అయితే ఊహించని దురదృష్టం వారిని వెన్నాడాక కథ ఎలాంటి మలుపుల తిరిగిందో తెరపై చూడొచ్చు. రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది.
తాజాగా రిలీజైన టీజర్ ఆద్యంతం రక్తి కట్టించింది. క్రూ పూర్తి వినోదాత్మక చిత్రమని టీజర్ చెబుతోంది. ఎయిర్ హోస్టెస్ లుగా ఉన్న ముగ్గురు అందగత్తెలు ఎలాంటి అల్లరి చేసారన్నది తెరపై అందంగా కనిపిస్తోంది. ది క్రూ టైటిల్ తోనే ఆసక్తిని కలిగించింది. వీళ్లు అసాధారణంగా ఏదో చేయబోతున్నారని పోస్టర్లు స్పష్టం చేసాయి. కాసేపటి క్రితం విడుదలైన టీజర్ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తోంది.
ముగ్గురు అసంతృప్తిగా ఉండే ఎయిర్ హోస్టెస్ తమ జీవితాల్లో కొత్త ఎత్తులకు ఎదగాలనుకుంటారు. ఆ ముగ్గురిలో యుక్తవయసు సుందరి కృతి ఆడంబరాలకు వెళుతుంది. టబు ముగ్గురిలో పెద్దది... తెలివైనది.. ప్రశాంతమైనది. కరీనా డ్రమటిక్ గాళ్. ఈ ముగ్గురు విమానయాన సంస్థల నుండి వస్తువులను దొంగిలిస్తారు. ఈ దొంగతనాలు బోలెడంత హాస్యాన్ని క్రియేట్ చేయనున్నాయి. సరదా, గందరగోళం నుంచి హాస్యం పుట్టనుంది. ఇక ముగ్గురు భామలు అందంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. ఇక నటన పరంగా చెప్పేదేం ఉంది. ఆ ముగ్గురు జాతీయ అవార్డులు అందుకున్న వారే.
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ప్రత్యేక పాత్రలో కనిపించగా, దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజర్ ఉత్కంఠను కలిగించింది. విమానంలో కామెడీ మరింత రక్తి కట్టించనుందని అర్థమవుతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ అఫీషియల్, AFKCN బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. క్రూ పూర్తిగా వినోదాత్మక చిత్రమని, థియేటర్లలో హాయిగా నవ్వుకుంటారని నిర్మాతలు చెబుతున్నారు.