అల్లు అర్జున్ ఇంటి ముందు పరదాలు, ఆ వెంటనే..!
దాంతో అల్లు అర్జున్ ఇంటి భద్రత సిబ్బంది పరదాలు ఏర్పాటు చేశారు.
By: Tupaki Desk | 24 Dec 2024 9:56 AM GMTసంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ పై విడుదల కావడం, ఆ తర్వాత కొందరు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం వంటివి జరిగిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద ఎప్పుడూ మీడియా హడావుడి కనిపిస్తుంది. నేడు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరు అయ్యాడు. దాంతో రాత్రి నుంచే మీడియా హడావిడి అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎక్కువ అయ్యింది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే విషయాలను చూపించేందుకు మీడియా తెగ ఆరాట పడుతుంది. దాంతో అల్లు అర్జున్ ఇంటి భద్రత సిబ్బంది పరదాలు ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్ ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయాలు కనిపించకుండా తెల్లటి పరదాలు కట్టడం ద్వారా విమర్శలు ఎదురు అయ్యాయి. ఇలాంటివి సరికాదు అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఇంటి నుంచి విచారణ నిమిత్తం వెళ్లిన తర్వాత ఇలా కట్టారు. అయితే విమర్శలు రావడంతో రెండు గంటల్లోనే ఆ పరదాలు తొలగించారు. ఆ పరదాలు తొలగింపు నేపథ్యంలో మళ్లీ మీడియా హడావుడి ఎక్కువ అయ్యింది. సోషల్ మీడియాల అనునిత్యం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఏం జరుగుతుంది అనే విషయాలను తెలియజేస్తూ లైవ్‌లు ఇస్తున్నారు. అందుకే పరదాలు ఏర్పాటు చేశారు. కానీ అది ఏ మాత్రం సరికాదు అనే ఉద్దేశ్యంతో తొలగించారు.
సంధ్య థియేటర్ ఘటన కేసు ఎక్కడ నుంచి ఎక్కడికి దారి తీస్తుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి పెద్ద నష్టంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ ఇండస్ట్రీకి నైజాం ఏరియా అత్యంత కీలకం. అలాంటి నైజాం ఏరియాలో ఇక ముందు బెనిఫిట్ షోలు ఉండవు అలాగే టికెట్ల రేట్లు పెంపు ఉండవు అని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నా ఈ వివాదం కారణంగా సక్సెస్‌ను యూనిట్ సభ్యులు సెలబ్రేట్ చేసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్‌పై ఉన్న అభిమానంతో పుష్ప 2 సినిమాను చూసేందుకు వెళ్లిన వందలాది మంది మధ్య మహిళ, చిన్న బాబులు చిక్కుకోవడం అనేది దారుణం. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సంఘటనపై స్పందించాల్సిందే. ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నా, అది ఏం తప్పు కాదు అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ను విచారించడం, ఆయనకు సంబంధించిన విషయాలను మీడియాలో మళ్లీ మళ్లీ చూపిస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటి ముందు మీడియా హడావుడి ఎక్కువ ఉంటుంది. అందుకే పరదాలు కట్టారు, ఆ తర్వాత వాటిని తొలగించారు.