ఓటీటీలో 'డాకు మహారాజ్' స్పెషల్ ట్రీట్
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కానప్పటికీ కచ్చితంగా ఈ సినిమా ఫిబ్రవరి 8 లేదా 9వ తారీకున స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి.
By: Tupaki Desk | 29 Jan 2025 7:03 AM GMTనందమూరి బాలకృష్ణ వరుసగా నాల్గవ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ దక్కించుకున్న బాలకృష్ణ ఈసారి అంతకు మించి అనే విధంగా డాకు మహారాజ్ సినిమాతో సక్సెస్ దక్కించుకున్నారు. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో ఒక సినిమాగా డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయ్యింది. గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌గా నిలువగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా జోరు ముందు డాకు మహారాజ్ సినిమా నిలిచింది. మరే సినిమా అయినా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు నిలిచే అవకాశం లేదు. అయినా డాకు మహారాజ్ సినిమా నిలిచి ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే.
ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు డాకు మహారాజ్ సినిమాను ఎంజాయ్ చేశారు. సినిమాలోని బాలకృష్ణ ప్రతి సన్నివేశం ఫ్యాన్స్‌కి హై మూమెంట్‌ని తెచ్చింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమాను ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కానప్పటికీ కచ్చితంగా ఈ సినిమా ఫిబ్రవరి 8 లేదా 9వ తారీకున స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ విషయమై తమన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
నెట్‌ఫ్లిక్స్ ద్వారా డాకు మహారాజ్ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సంగీత దర్శకుడు తమన్ అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమాను అద్భుతమైన సౌండ్ టెక్నాలజీతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా తీసుకు రాబోతున్నట్లు పేర్కొన్నారు. డాల్బీ సౌండ్ సిస్టమ్ కారణంగా సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్ మొదలైన తర్వాత మరోసారి డాకు మహారాజ్ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారని తమన్ ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చాడు. డాల్బీ ఔట్‌పుట్ కారణంగా సినిమాతో సరికొత్త అనుభూతిని ఓటీటీ ద్వారా కూడా అనుభూతి చెందుతారని తమన్ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు.
బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటించింది. అఖండ తర్వాత మరోసారి బాలయ్య, ప్రగ్యా కాంబోలో మరో విజయం ఈ సినిమాతో దక్కింది. ఇక ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో దబిడి దిబిడి సాంగ్‌కి డాన్స్ చేయడంతో పాటు యాక్షన్ సన్నివేశంలోనూ నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. ఇక శ్రద్దా శ్రీనాథ్ కలెక్టర్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు, యానిమల్ స్టార్ బాబీ డియోల్ స్టైలిష్ విలన్‌గా కనిపించి మెప్పించారు. సినిమా తీవ్ర పోటీ మధ్య విడుదలైనా రూ.150 కోట్లకు మించి వసూళ్లు సాధించి హిట్‌గా నిలిచింది. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్‌తోనూ డాకు మహారాజ్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.