మూవీ రివ్యూ : డాకు మహారాజ్
By: Tupaki Desk | 12 Jan 2025 5:46 AM GMT'డాకు మహారాజ్' మూవీ రివ్యూ
నటీనటులు: నందమూరి బాలకృష్ణ-ప్రగ్యా జైశ్వాల్-శ్రద్ధా శ్రీనాథ్-బాబీ డియోల్- రవి కిషన్-రిషి-సచిన్ ఖేడ్కర్-చాందిని చౌదరి-రవి కాలె-మకరంద్ దేశ్ పాండే-దివి వడిత్య తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
స్క్రీన్ ప్లే: బాబి-చక్రవర్తి రెడ్డి
మాటలు: భాను-నందు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ-సాయి సౌజన్య
కథ-దర్శకత్వం: బాబీ కొల్లి
అఖండ.. వీరసింహారెడ్డి.. భగవంత్ కేసరి.. లాంటి వరుస హిట్లతో ఊపు మీదున్నాడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. మరోవైపు 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ కొట్టాడు దర్శకుడు బాబీ కొల్లి. వీరి కలయికలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
మదనపల్లిలో టీ ఎస్టేట్.. స్కూల్ నడిపే పెద్ద మనిషి మనవరాలైన జాహ్నవి ప్రమాదంలో ఉన్నట్లు మధ్య ప్రదేశ్ జైల్లో ఉన్న సీతారాం అలియాస్ డాకు మహారాజ్ (నందమూరి బాలకృష్ణ)కు తెలుస్తుంది. దీంతో పోలీసుల నుంచి తప్పించుకుని మదనపల్లికి వచ్చేసిన సీతారాం.. నానాజీ అని పేరు మార్చుకుని డ్రైవర్ పేరుతో ఆ పాపకు సంరక్షకుడిగా మారతాడు. లోకల్ ఎమ్మెల్యే నుంచి జాహ్నవికి ప్రాణహాని ఉందని తెలుసుకుని తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ గొడవ పెద్దదై పాప కుటుంబం మీద బల్వంత్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్) అనే డాన్ కళ్లు పడతాయి. అప్పుడే బల్వంత్ కు.. డాకుకు మధ్య వైరం సంగతి బయటికి వస్తుంది. ఇంతకీ సీతారాం డాకు ఎందుకయ్యాడు.. అతడికి పాపకు సంబంధమేంటి.. బల్వంత్ తో అతడి గొడవేంటి.. చివరికి అతడితో పోరాటంలో డాకు గెలిచాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
అనగనగా ఓ ప్రాంతం. అక్కడ అరాచకం రాజ్యమేలుతూ ఉంటుంది. ఓ పెద్ద విలన్.. అతడి గ్యాంగ్ అక్కడి జనాలను పీక్కు తింటూ ఉంటారు. అందరూ వారికి సలాం కొట్టాల్సిందే. ఎదురొచ్చిన వాళ్లందరినీ చంపి అవతల పడేస్తుంటుంది ఆ గ్యాంగ్. తమను కాపాడే దేవుడు ఎవరా అని అక్కడి జనం ఆశగా చూస్తున్న సమయంలో హీరో అక్కడికొస్తాడు. తన కళ్ల ముందు ఒక ఘోరం జరగడంతో అతడి ఉగ్ర రూపం బయటికి వస్తుంది. ఊచకోత మొదలవుతుంది. విలన్ తో వార్ షురూ అవుతుంది. చివర్లో ఈ పోరులో హీరోనే గెలుస్తాడు. కమర్షియల్ తెలుగు సినిమాలో చాలా సాధారణంగా కనిపించే ఫార్మాట్ ఇది. ఇక నందమూరి బాలకృష్ణ అయితే ఈ లైన్లో ఎన్ని సినిమాలు చేసి ఉంటాడో లెక్కే లేదు. కొంచెం నేపథ్యాన్ని మార్చి ఆయన్ని ఇదే కథల్లో ప్రెజెంట్ చేయడానికి చూస్తుంటారు దర్శకులు. ఐతే బాలయ్య సినిమా అంటే కథ గురించి కూడా ఆయన అభిమానులు.. మాస్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. తాము కోరుకునే ఎలివేషన్లు.. భారీ యాక్షన్ ఘట్టాలు.. పంచ్ డైలాగులు ఉంటే చాలు.. ''జై బాలయ్య'' అనేస్తారు. కెరీర్ ఆరంభం నుంచి సగటు మాస్ మసాలా సినిమాలే తీస్తూ వచ్చిన బాబీకి బాలయ్య శైలిని.. అభిమానుల ఆకాంక్షలను బాగానే అర్థం చేసుకుని అంచనాలకు తగ్గ సినిమానే తీశాడు. ఇందులో కొత్త కథేమీ లేదు. పైన చెప్పుకున్న ఫార్మాట్లోనే ఒక సగటు మసాలా కథను అల్లేసింది బాబీ అండ్ టీం. అందులో ఎలివేషన్లు.. యాక్షన్ సీక్వెన్సులు.. మాస్ డైలాగులు.. మామూలే. బాలయ్య అభిమానులు.. మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలకు ఢోకా లేని ఈ సినిమాలో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
బాబీ నుంచి కొత్త కథలు ఆశించలేమని మొదట్నుంచి అతను తీస్తున్న సినిమాలను చూస్తేనే అర్థమైపోతుంది. ఈసారి కూడా అతనేమీ భిన్నంగా ప్రయత్నించలేదు. కాకపోతే మామూలుగా మాస్ డైరెక్టర్ల టేకింగ్.. విజువల్స్ అన్నీ కూడా ఒక రొడ్డ కొట్టుడు స్టైల్లో సాగిపోతాయి. 'డాకు మహారాజ్'లో మాత్రం మాస్ కథకు స్టైలిష్ టేకింగ్ తోడయ్యేలా చూసుకున్నాడు బాబీ. 'డాకు మహారాజ్' ప్రోమోలు చూస్తేనే అందులో విజువల్స్ డిఫరెంటుగా అనిపిస్తాయి. సినిమా పేరుకు తగ్గట్లే ఉత్తరాది నేపథ్యం తీసుకున్న బాబీ.. మాస్ సినిమాల్లో ఎప్పుడూ చూసే వాటికి భిన్నమైన విజువల్స్ అందించాడు. రొటీన్ యాక్షన్ ఘట్టాలనే స్టైలిష్ గా.. ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేశాడు. సినిమాటోగ్రఫీ వల్ల సినిమాకు ఒక కొత్త కలర్ వచ్చింది. శ్రద్ధ శ్రీనాథ్.. ప్రగ్యా జైశ్వాల్ చేసిన హీరోయిన్ల పాత్రలను సగటు కమర్షియల్ సినిమాల స్టయిల్లో ప్రెజెంట్ చేయకపోవడం.. ఆ పాత్రలకు పాటలు- రొటీన్ డైలాగులు పెట్టి గ్లామర్ గర్ల్స్ గా చూపించకపోవడం ఇందులో కనిపించే మరో విశేషం. ఇవి పక్కన పెడితే సినిమా రొటీన్ టెంప్లేట్లోనే సాగిపోతుంది.
మాస్ హీరోల సినిమాలంటే అభిమానులు ప్రధానంగా ఆశించేది ఎలివేషన్ సీన్లు. 'డాకు మహారాజ్'లో వాటికి ఢోకా లేదు. ముందుగా ఐదారు ఎలివేషన్ సీన్లు రాసుకుని.. వాటి చుట్టూ సగటు కథను అల్లినట్లు అనిపిస్తుంది 'డాకు మహారాజ్' చూస్తుంటే. ముఖ్యంగా విలన్ చేసిన అరాచకాన్ని చూసి రగిలిపోయిన హీరో.. తన ఇంటికే వెళ్లి విధ్వంసం సృష్టించే ఎపిసోడ్ 'డాకు..'లో హైలైట్ గా నిలుస్తుంది. ఇసుక తుఫాను నేపథ్యంలో వచ్చే మరో ఎపిసోడ్ సైతం బాలయ్య అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుంది. బాలయ్య ఇలాంటి సీన్లు చేయడం కొత్త కాదు. కానీ ఎన్నిసార్లు చూసినా సరే సన్నివేశంలో తగిన ఎమోషన్ ఉంటే.. ఇలాంటివి మళ్లీ మళ్లీ వర్కవుట్ అవుతాయి. 'డాకు..'లో కూడా అదే జరిగింది. సినిమాలో ప్రతి యాక్షన్ బ్లాక్ కూడా బాగా తీశారు. కథలో కీలకమైన పాప పాత్రతో ఎమోషన్ బాగానే వర్కవుట్ చేయగలిగారు.
'డాకు మహారాజ్' ఆరంభంలో కొంచెం నెమ్మదిగా అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. హీరో-పాప మధ్య ఎమోషన్ నేపథ్యంలో కథను ముందుకు నడిపించాడు దర్శకుడు. మరీ రొటీన్ అనిపించినా సరే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే సినిమాకు ఆయువుపట్టుగా మారింది. సీతారం పాత్ర డాకుగా మారే క్రమంలో వచ్చే సీన్లు బాగా పేలాయి. ఐతే ఫ్లాష్ బ్యాక్ ఒక దశ వరకు బాగానే ఉన్నా.. తర్వాత మరీ సాగతీతగా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ముగుస్తుందా అనిపించేలా.. చాలా దూరం లాక్కెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ అయితే మరీ రొటీన్ అనిపిస్తుంది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ చేశాడంటే విలన్ పాత్రలో ఏదైనా విశేషం ఉంటుందేమో అని చూస్తాం. కానీ అది సగటు ప్రతినాయకుడి పాత్రలాగే సాగుతుంది. తన వల్ల సినిమాకు కొత్తగా యాడ్ అయిందేమీ లేదు. హీరోకు ఎదురే లేదన్నట్లు చూపించడంతో కథ పరంగా క్యూరియాసిటీ ఏమీ అనిపించదు. ఇక మాస్ సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే గ్లామర్ డోస్ ఇందులో సరిపడా లేదు. ప్రగ్యా.. శ్రద్ధ ఇద్దరూ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేయడం మంచి విషయమే అయినా.. వాళ్ల నుంచి గ్లామర్ ట్రీట్ ఆశించిన వాళ్లకు నిరాశ తప్పదు. ఊర్వశి రౌటెలా పాత్రతో కొంతమేర శృంగార రసాన్ని పండించాలని చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. దబిడి దిబిడి పాట వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే.. బాలయ్య నుంచి ఒక మాస్ సినిమాలో ఏం కోరుకుంటారో అవి ఈ చిత్రంలో ఉన్నాయి. ఎలివేషన్ సీన్లు.. భారీ యాక్షన్ ఘట్టాలను ఇష్టపడేవారికి 'డాకు మహారాజ్' సంతృప్తినిస్తుంది. కొత్తదనం కోరుకుంటే మాత్రం కష్టమే.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ తన అభిమానులు.. మాస్ ప్రేక్షకులు ఎలా కోరుకుంటారో అలా కనిపించాడు 'డాకు మహారాజ్'లో. గడ్డంతో 'నిప్పురవ్వ' సినిమాను గుర్తు చేసేలా ఉన్న ఆయన ఫ్లాష్ బ్యాక్ లుక్ బాగుంది. మిగతా లుక్స్ లో మామూలుగా అనిపిస్తారు. ఎప్పట్లాగే ఆవేశం ప్రదర్శించాల్సిన సన్నివేశాల్లో బాలయ్య అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్లలో కూడా బాగా చేశాడు. యాక్షన్ ఘట్టాల్లో ఓకే. మిగతా సన్నివేశాల్లో మామూలుగా సాగిపోయింది ఆయన నటన. బాలయ్య నుంచి పంచ్ డైలాగులైతే ఆశించిన స్థాయిలో లేవు. ప్రగ్యా జైశ్వాల్ కు కొంత మేర నటించే అవకాశం దక్కింది ఈ చిత్రంలో. ఆ అవకాశాన్ని ఆమె బాగానే ఉపయోగించుకుంది. శ్రద్ధా శ్రీనాథ్ ను మరో హీరోయిన్ అనుకుంటాం కానీ.. ఆమె పాత్రలో ట్విస్ట్ ఉంది. అదేంటో తెరపైనే చూడాలి. ఆమె పెర్ఫామెన్స్ కూడా బాగుంది. బల్వంత్ సింగ్ పాత్రలో బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా.. క్యారెక్టర్లో కొత్తదనం లేకపోవడంతో ఆయన మార్కు చూపించడానికి అవకాశం లేకపోయింది. కథలో కీలకమైన పాత్రలో చిన్న పాప బాగా చేసింది. సహాయ పాత్రలలో సచిన్ ఖేద్కర్.. మకరంద్ దేశ్ పాండే.. రవి కాలే.. వీళ్లంతా బాగానే చేశారు. ఊర్వశి రౌటెలా గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు.
సాంకేతిక వర్గం:
బాలయ్య అనగానే పూనకాలు తెచ్చేసుకునే తమన్.. మరోసారి తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపాడు. ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాల్లో ఆర్ఆర్ మంచి ఊపుతో సాగింది. కానీ కొన్నిచోట్ల స్కోర్ మరీ లౌడ్ అనిపిస్తుంది. వాయిద్యాల హోరు మరీ ఎక్కువ అయిపోయింది. తన పాటలు సోసోగా అనిపిస్తాయి. విజయ్ కార్తీక్ ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. సగటు మాస్ సినిమాలకు భిన్నమైన కలర్ గ్రేడింగ్ తో అతను సినిమాకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడు. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీక్వెన్సుల్లో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చాలా రిచ్ గా తీశారు సినిమాను. భాను-నందు మాటలు కొన్ని చోట్ల పేలాయి. బాబీ ఎంచుకున్న కథ రొటీన్. దానికి అతను.. చక్రవర్తి కలిసి చేసుకున్న స్క్రీన్ ప్లే పర్వాలేదనిపిస్తుంది. బాబీ కథ కంటే టేకింగ్ మీద దృష్టిపెట్టాడు. సినిమాలో కీలకమైన ఎపిసోడ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. హీరో ఎలివేషన్లకు ఢోకా లేకుండా చూసుకున్నాడు. అతను ప్రధానంగా బాలయ్య అభిమానులను దృష్టిలో ఉంచుకునే సినిమా తీసినట్లు అనిపిస్తుంది. వారినైతే సంతృప్తిపరిచాడు కానీ.. కొత్తగా ఏమీ చేయలేకపోయాడు.
చివరగా: డాకు మహారాజ్.. బాలయ్య మార్కు మాస్
రేటింగ్- 2.5 /5