Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్‌లో ఫెయిల్.. ప్ర‌భుత్వంపై ద‌ళ‌ప‌తి ఎటాక్

తమిళనాడులో యువతలో డ్రగ్స్ వాడకంపై తన ఆందోళనను వ్యక్తం చేసిన విజయ్.. ఇటీవలి కాలంలో డ్రగ్స్ యువతకు బాగా ద‌గ్గ‌రైపోయింద‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   1 July 2024 12:38 PM GMT
డ్ర‌గ్స్‌లో ఫెయిల్.. ప్ర‌భుత్వంపై ద‌ళ‌ప‌తి ఎటాక్
X

తమిళనాడులో డ్రగ్స్ సమస్యలను పరిష్కరించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) అధ్యక్షుడు, ద‌ళ‌ప‌తి విజయ్ విమర్శించారు. అన్ని రంగాలలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించే విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఆయన నొక్కి చెప్పారు. మీడియా, సామాజిక ఛానెల్‌ల నుండి సమాచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించాలని విజయ్ విద్యార్థులకు సూచించారు. సామాజిక సమస్యలపై పోరాడటానికి సమర్థులైన నాయకులను ఎన్నుకోవటానికి సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

చెన్నైలో 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన ముగ్గురు విద్యార్థులను సత్కరించిన నటుడు విజయ్, రాష్ట్రం డ్రగ్స్ నియంత్రణలో విఫలమైందని, మంచి విద్యార్హత ఉన్న నేతలు రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది నిర్ణ‌యించాల‌ని, సూటిగా డీఎంకే (త‌మిళ‌నాడు) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంచి నాయకులు కావాలంటే.. నాయకత్వ లక్షణాలు ఉండాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. విద్యార్థులను సత్కరించిన అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. మాకు మంచి నాయకులు కావాలి. నాయకులు అంటే రాజకీయంగా నేను అనడం లేదు. మీరు ఏం చేసినా మీకు నాయకత్వ గుణం కావాలని నేను చెబుతున్నాను! అని అన్నారు.

భవిష్యత్తులో రాజకీయాలు కూడా కెరీర్ ఆప్షన్‌గా ఉండాలి. అదే నా కోరిక. మంచి విద్యార్హత ఉన్న నాయకులు రాజకీయాల్లోకి రావాలని మీరు అనుకుంటున్నారా? అని కూడా విద్యార్థుల‌ను ప్ర‌శ్నించారు. విద్యార్థులు తమకు వచ్చే ప్రతి సమాచారాన్ని క్రాస్ చెక్ చేయమని విజయ్ కోరారు. సోషల్ మీడియా ఛానెల్‌లు, ప్రధాన స్రవంతి మీడియా మనకు చాలా విషయాలు చూపుతాయి. అన్నీ చూడండి కానీ ఏది తప్పో ఏది ఒప్పో విశ్లేషించండి! అని ప‌రోక్షంగా మీడియా త‌ప్పిదాల‌ను కూడా ప్ర‌శ్నించారు విజ‌య్. వార్త‌ల్ని విశ్లేషిస్తేనే మన దేశం, ప్రజల నిజమైన సమస్యలను అర్థం చేసుకోగలం. సామాజిక దురాచారాలను అర్థం చేసుకోగలం. కొన్ని రాజకీయ పార్టీలను, బూటకపు ప్రచారాలను విశ్వసించకుండా, మంచి నాయకులను ఎన్నుకునేందుకు మీ అందరికీ ప్రపంచ స్థాయి విస్తృత ఆలోచనలు వస్తాయి! అని విద్యార్థులకు చెప్పారు.

తమిళనాడులో యువతలో డ్రగ్స్ వాడకంపై తన ఆందోళనను వ్యక్తం చేసిన విజయ్.. ఇటీవలి కాలంలో డ్రగ్స్ యువతకు బాగా ద‌గ్గ‌రైపోయింద‌ని అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా, తల్లిదండ్రులుగా నేను కూడా భయపడుతున్నాను. డ్రగ్స్‌ను నియంత్రించడం గురించి మనం చెప్పగలం. ఇది ప్రభుత్వ బాధ్యత, యువకులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత, ప్రస్తుత పాలక ప్రభుత్వం ఆ పని చేయడంలో విఫలమైంది.. అని తీవ్రంగా విమ‌ర్శించారు. దీని గురించి మాత్ర‌మే మాట్లాడటానికి నేను ఇక్కడ లేను. ఇది దానికి వేదిక కాదు. ప్రభుత్వం కంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దయచేసి అందరూ దీనిని ఆలోచించండి. డ్రగ్స్‌కు నో చెప్పండి. తాత్కాలిక ఆనందానికి నో చెప్పండి. దీన్ని సీరియ‌స్ గా తీసుకోండి! అని విజయ్ చెప్పాడు.