మళ్ళీ వచ్చిన 'దమ్ముంటే పట్టుకోరా' సాంగ్.. ఈసారి స్పెషల్ ఏంటంటే?
ఈ నేపథ్యంలో సినిమాలోని వీడియో సాంగ్స్ ను ఒక్కటొక్కటిగా సోషల్ మీడియాలో వదులుతూ వస్తున్నారు.
By: Tupaki Desk | 28 Dec 2024 3:49 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ''పుష్ప 2: ది రూల్'' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, సక్సెస్ ఫుల్ గా నాలుగో వారంలో అడుగుపెట్టింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా 'బాహుబలి 2' రికార్డును అందుకునే దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని వీడియో సాంగ్స్ ను ఒక్కటొక్కటిగా సోషల్ మీడియాలో వదులుతూ వస్తున్నారు. మధ్యలో 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' అనే బిట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. కాకపోతే పాటని విడుదల చేసిన టైమింగే సరికొత్త చర్చకు దారితీసింది.
'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా నడిచాయి. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు బన్నీ కేసు అనే విధంగా చర్చలు నడిచాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పై విమర్శలు చేయడం, దానికి కౌంటర్ గా బన్నీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. పేర్లు ప్రస్తావించకుండానే ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ వెంటనే పోలీసులు ప్రెస్ మీటి పెట్టి సంధ్య థియేటర్ వీడియోలను రిలీజ్ చేసారు. అలాంటి టైంలోనే 'పుష్ప 2' సినిమాలోని 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్' అనే పాటని యూట్యూబ్ లో వదిలారు.
'పుష్ప 2' సినిమాలో ప్రీ-ఇంటర్వెల్ లో పోలీసాఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ ను రెచ్చగొడుతూ పుష్పరాజ్ ఛాలెంజ్ చేసే సందర్భంలో వచ్చే డైలాగ్ అది. దాన్నే పాట రూపంలో విడుదల చేసారు. తెలంగాణ పోలీసులతో వివాదం నడుస్తున్న సమయంలో 'దమ్ముంటే పట్టుకోరా..' అంటూ సాంగ్ రిలీజ్ చేయడం ప్రభుత్వాన్ని కావాలని రెచ్చగొడుతున్నట్లుగా ఉందని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల తర్వాత ఆ పాట యూట్యూబ్ లో కనిపించలేదు. అయితే తాజాగా నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆడియో సాంగ్ తో పాటుగా వీడియో సాంగ్ యూట్యూబ్ లో ప్రత్యక్షమయ్యాయి. దీన్ని బట్టి సాంగ్ ని డిలీట్ చేయకుండా ప్రైవేట్ లో పెట్టినట్లు అర్థమవుతోంది.
ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తర్వాత పరిస్థితులు సర్దుమణిగాయని అనుకుంటున్న సమయంలో 'దమ్ముంటే పట్టుకోరా' పాట బయటకు రావడం గమనార్హం. 'పుష్ప-2' సినిమాలోని సన్నివేశాలకు లిరిక్స్ ని మిక్స్ చేసి ఈ వీడియో సాంగ్ ని కట్ చేసారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ తో పాటుగా ఇంట్రడక్షన్ ఫైట్, జాతర సీన్, క్లైమాక్స్ ఎపిసోడ్ లకు సంబంధించిన షాట్స్ తో ఈ సాంగ్ రూపొందించబడింది. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇకపోతే 'దమ్ముంటే పట్టుకోరా' డైలాగ్ తో సాంగ్ రికార్డ్ చేస్తున్నట్లు అల్లు అర్జున్‌కు తెలియదని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ''బన్నీపై సాంగ్ రికార్డింగ్ చేయాలని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైతే సుకుమార్ వచ్చి నాకు షెకావత్ కు వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని వివరించాడో.. అప్పుడు అది నాకు ఓ సాంగ్ లా అనిపించింది. ఎలాగైనా ఆ పాట రికార్డింగ్ చేయాలనుకున్నాను. నేను చెప్పినట్టు బన్నీని సుకుమార్ స్టుడియోకు తీసుకొచ్చాడు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే లైన్స్ ను చెప్పింది, దానికి ఢోలక్ తో పాటు మరికొన్ని ఇన్స్ట్రమెంట్స్ యాడ్ చేసి ఆ సాంగ్ చేశాం'' అని డీఎస్పీ చెప్పారు.