Begin typing your search above and press return to search.

గ్రేట్ : చనిపోయినా బతికిన స్టార్ నటుడు

డేనియల్‌ బాలాజీ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలే చేయడం ద్వారా విలన్ గానే అయన్ను అంతా చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2024 8:26 AM GMT
గ్రేట్ : చనిపోయినా బతికిన స్టార్ నటుడు
X

తమిళ మరియు తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచిత నటుడు అయిన డేనియల్‌ బాలాజీ శుక్రవారం గుండె పోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మరణ వార్త తమిళ మరియు తెలుగు సినీ ఇండస్ట్రీ వర్గాల వారిని మరియు ప్రేక్షకులను తీవ్రంగా కలచి వేసింది.


డేనియల్‌ బాలాజీ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలే చేయడం ద్వారా విలన్ గానే అయన్ను అంతా చూస్తున్నారు. కానీ చనిపోక ముందు ఆయన చేసిన పని తో చనిపోయిన తర్వాత అంతా కూడా డేనియల్‌ బాలాజీని హీరోగా కీర్తిస్తున్నారు. చనిపోయినా కూడా బతికిన స్టార్‌ అంటూ ప్రశంసిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డేనియల్‌ బాలాజీ తాను చనిపోయిన తర్వాత తన రెండు కళ్లను దానం ఇచ్చేందుకు ఒప్పుకుంటూ బతికి ఉండగానే నిర్ణయం తీసుకున్నాడు. డేనియల్ కళ్లు దానం చేయడంతో ఆయన మృతదేహం నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు కళ్లను సేకరించారు.

డేనియల్ కు చెందిన ఆ రెండు కళ్లను ఇద్దరు అంధులకు అమర్చబోతున్నట్లు వైద్యులు తెలియజేశారు. చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూస్తూ బతికేయవచ్చు అని డేనియల్‌ కళ్లను దానం చేయడం ద్వారా గొప్ప విషయాన్ని తెలియజేశారు అని ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సినిమాల్లో నటించిన డేనియల్ బాలాజీ 48 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో మృతి చెందడం ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. తెలుగు లో చేసిన సినిమాలు కొన్ని అయినా కూడా చూడగానే గుర్తించే స్థాయిలో ఆయా సినిమాల్లో తన నటనతో మెప్పించాడు.