మూవీ రివ్యూ : డార్లింగ్
కామెడీ-క్యారెక్టర్ రోల్స్ తో ఆకట్టుకున్న ప్రియదర్శి.. 'మల్లేశం'.. 'బలగం' లాంటి చిత్రాల్లో లీడ్ రోల్స్ లోనూ మెప్పించాడు. ఇప్పుడు అతను హీరోగా నటించిన కొత్త చిత్రం.. డార్లింగ్.
By: Tupaki Desk | 19 July 2024 9:34 AM GMT'డార్లింగ్' మూవీ రివ్యూ
నటీనటులు: ప్రియదర్శి-నభా నటేష్- అనన్య నాగళ్ళ-మురళీధర్ గౌడ్-విష్ణు ఓయ్-బ్రహ్మానందం-రఘుబాబు తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నరేష్ రామదురై
మాటలు: సాయి హేమంత్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి-చైతన్య
కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం: అశ్విన్ రామ్
కామెడీ-క్యారెక్టర్ రోల్స్ తో ఆకట్టుకున్న ప్రియదర్శి.. 'మల్లేశం'.. 'బలగం' లాంటి చిత్రాల్లో లీడ్ రోల్స్ లోనూ మెప్పించాడు. ఇప్పుడు అతను హీరోగా నటించిన కొత్త చిత్రం.. డార్లింగ్. నభా నటేష్ దర్శికి జోడీగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రాఘవ్ (ప్రియదర్శి) మేక్ మై ట్రిప్ సంస్థలో ఉద్యోగి. త్వరగా పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని.. భార్యతో కలిసి పారిస్ ట్రిప్ వెళ్లాలని ఆశ పడుతున్న అతడికి నిరాశ తప్పదు. తన పెళ్లి ప్రయత్నాలు అంతగా ఫలించవు. చివరికి ఓ అమ్మాయితో పెళ్లి ఖాయమైనా.. కొన్ని నిమిషాల్లో తాళి కట్టబోతుండగా ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో లేచిపోతుంది. ఇక జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాఘవ్ కు.. అనుకోకుండా ఆనంది (నభా నటేష్) పరిచయం అవుతుంది. ఆమెను ఇష్టపడ్డ రాఘవ్.. తనతో పెళ్లికి రెడీ అయిపోతాడు. ఆనంది కూడా తనతో పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. హఠాత్తుగా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లయిన తొలి రోజు రాత్రే రాఘవ్ కు ఆనంది చుక్కలు చూపించేస్తుంది. ఆమె స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధ పడుతున్నట్లు తెలిసి బెంబేలెత్తిపోతాడు రాఘవ్. మరి ఆమెతో రాఘవ్ పడ్డ పాట్లు ఏంటి.. ఈ సమస్య నుంచి అతనెలా బయట పడ్డాడు.. ఈ విషయాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
'అపరిచితుడు' సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులకు పరిచయం చేసి పెద్ద షాకే ఇచ్చాడు శంకర్. విక్రమ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను అసామాన్య రీతిలో పండించి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. థియేటర్ల నుంచి బయటికి వచ్చాక కూడా ప్రేక్షకులను వెంటాడే స్థాయిలో ఆ పెర్ఫామెన్స్ థ్రిల్ అందించింది. ఆ తర్వాత 'ఛత్రపతి' సినిమాలో వేణు మాధవ్ 'అపరిచితుడు' పాత్రను అనుకరిస్తూ స్ప్లిట్ పర్సనాలిటీ మీద కామెడీ చేస్తే పగలబడి నవ్వుకున్నాం. ఇప్పుడు 'డార్లింగ్' సినిమా కూడా ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న ఓ పాత్ర చుట్టూ తిరిగే కథే. కానీ ఈ సినిమాలో ఆ పాత్రను.. దాన్ని పోషించిన నటి పెర్ఫామెన్స్ చూస్తే 'అపరిచితుడు'లో మాదిరి థ్రిల్ ఫీలవ్వాలో.. 'ఛత్రపతి' తరహాలో నవ్వుకోవాలో అర్థం కాదు. 'అపరిచితుడు' నుంచి అరువు తెచ్చుకున్న కాన్సెప్ట్ తో అసలు 'డార్లింగ్'ను థ్రిల్లర్ గా మలచాలో.. కామెడీ సినిమాగా తీర్చిదిద్దాలో తెలియని అయోమయంలోనే దర్శకుడు అశ్విన్ రామ్ మొత్తం సినిమాను లాగించేసినట్లున్నాడు. చివరికి ఈ కాన్సెప్ట్ రెంటికీ చెడి నవ్వుల పాలైన పరిస్థితి.
ఒక రేంజిలో పెర్ఫామ్ చేయాల్సిన పాత్ర ఏదైనా డిజైన్ చేసుకున్నపుడు అందుకు తగ్గ పెర్ఫామర్ ను ఎంచుకోవడం చాలా కీలకమైన విషయం. 'అపరిచితుడు'లో విక్రమ్ కాకుండా పెద్దగా నటన రాని ఇంకెవరైనా సగటు హీరోను ఊహించుకుంటే ఆ ఊహే భయంకరంగా ఉంటుంది. పాత్రలో ఎంత విషయం ఉన్నా.. అందుకు తగ్గ ఆర్టిస్ట్ లేకపోతే అది పండక మొత్తం సినిమానే చెడిపోతుంది. 'డార్లింగ్' సినిమాలో సరిగ్గా ఇదే జరిగింది. 'నన్ను దోచుకుందువటే' లాంటి చిత్రాల్లో చలాకీ అమ్మాయి పాత్రల్లో నభా నటేష్ బాగానే చేసింది కానీ.. 'డార్లింగ్'లో ఏకపాత్రాభినయం చేయాల్సిన టిపికల్ క్యారెక్టర్లో నభా తేలిపోయింది. ఒక మనిషిలో ఐదుగురు వేరే వ్యక్తులు ఉండి.. అందుకు తగ్గట్లుగా హావభావాలు పలికించాల్సిన పాత్రలో నభా మినిమం అంటే మినిమం ఎఫర్ట్ కూడా పెట్టలేకపోయింది. దర్శకుడు కూడా ఏమాత్రం కసరత్తు చేయకుండా.. ఎలా తోచితే అలా నటించేయమని చెప్పాడో ఏమో కానీ.. సెన్సేషనల్ పెర్ఫామెన్స్ అవసరమైన పాత్రను నభా చాలా తేలిగ్గా చేసి పడేయడంతో ఆ పాత్ర చిరాకు పెట్టించేలా తయారైంది. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వాల్సిన క్యామెడీగా నవ్వుకుని.. నవ్వాల్సిన చోట విసుగెత్తిపోయి.. మొత్తంగా 'డార్లింగ్' సినిమానే కంగాళీగా తయారైంది.
'డార్లింగ్' సినిమాలో కథ మలుపు తిరిగే తీరే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. పెళ్లి కోసం తహతహలాడిపోయే అబ్బాయి పాత్రలో ప్రియదర్శి అరంగేట్రం.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కొంత ఫన్నీగా అనిపిస్తాయి. పెళ్లి మండపం నుంచి వధువు లేచిపోవడం.. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు సిద్ధపడిపోవడం.. చావు ముంగిట ఓ అమ్మాయి మాటలకు ప్రభావితమై ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం.. తనలో ప్రేరణ కలిగించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోవడం.. ఇంత వరకు బాగానే అనిపిస్తుంది. కానీ ఓ అమ్మాయి నిమిషాల్లో ఓకే చెప్పేసి తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడమేంటో మింగుడు పడదు. కానీ తనకున్న సమస్యను బయటపెట్టి దాని మీద కొంతసేపు క్యూరియస్ గా డ్రామాను నడిపిన దర్శకుడు సినిమా మీద కొంత ఆసక్తి రేకెత్తించగలిగాడు. కానీ మొదట్లో హీరోయిన్ స్ప్లిట్ పర్సనాలిటీ సమస్య మీద కొన్ని సీన్లు ఫన్నీగా అనిపించినా.. ఆ తర్వాత మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అంటూ సమస్యను పెద్దది చేశాక తెర మీద హీరోకే కాదు.. చూసే ప్రేక్షకులకు కూడా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఒక లాజిక్ లేకుండా దర్శకుడు ఈ పాయింట్ ను ఎలా పడితే అలా వంకర్లు తిప్పేశాడు. వేర్వేరు వ్యక్తుల తరహాలో నభా ఏకపాత్రాభినయం చూశాక ఈ సినిమా మీద పూర్తిగా ఆశలు కోల్పోతాం. ఆ సన్నివేశంతోనే సినిమా నవ్వులు పాలైపోయింది. ఏమాత్రం లాజికల్ గా అనిపించని సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ఇక ఈ కథ ఎలా ముగుస్తుందా అని చివరి వరకు కూర్చోవడమే మిగులుతుంది. ముగింపులో ప్రియదర్శి పెర్ఫామెన్స్ మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ వ్యవహారమంతా అనాసక్తికరంగా ఉండి ప్రేక్షకుల్లో కాస్తయినా ఎగ్జైట్మెంట్ కలిగించదు. మొత్తంగా చూస్తే 'డార్లింగ్' సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు. దీన్నొక వ్యర్థ ప్రయత్నంగా చెప్పొచ్చు.
నటీనటులు:
ఏ పాత్ర చేసినా సిన్సియర్ గా పెర్ఫామ్ చేయడానికి చూస్తాడు ప్రియదర్శి. 'డార్లింగ్' సినిమా ఎలా ఉన్నా.. తన పెర్ఫామెన్స్ బాగుంది. కామెడీ సీన్లలోనే కాక.. ఎమోషనల్ సీన్లలోనూ అతను మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్సులో ఒక సగటు మధ్య తరగతి కుర్రాడిగా తన నిస్సహాయతను చెప్పే సన్నివేశంలో తన నటన చాలా బాగుంది. హీరోయిన్ నభా నటేష్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. మధ్యలో గ్యాప్ తర్వాత ఆమె లుక్స్ మారిపోయాయి. తన మేకప్ కూడా సరిగా కుదరలేదు. ఒకప్పట్లా గ్లామర్ పరంగా ఆకట్టుకోని ఆమె.. పెర్ఫామెన్స్ విషయంలో మరింత నిరాశపరిచింది. నటించడానికి మంచి స్కోప్ ఉన్న పాత్రలో నభా మినిమం ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయింది. సినిమాకు అతి పెద్ద మైనస్ నభానే. మురళీధర్ గౌడ్ తనకు అలవాటైన తండ్రి పాత్రలో ఓకే అనిపించాడు. రఘుబాబు ఒక సీన్లో తన అనుభవాన్ని చూపించాడు. హీరో స్నేహితుల పాత్రల్లో విష్ణు ఓయ్.. మరో నటుడు ఓకే. బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే ఉన్నాడు. ఆయనది మరీ నామమాత్రమైన పాత్ర.
సాంకేతిక వర్గం:
సినిమాలో విషయాన్ని బట్టే టెక్నీషియన్ల పని తీరు కూడా ఉంటుంది. మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడిగా పేరున్న వివేక్ సాగర్.. పాటల విషయంలో నిరాశ పరిచాడు. ఏ సాంగ్ కూడా ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టర్ కాదు. ఏదో అలా అలా సాగిపోతాయంతే. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. నరేష్ రామదురై ఛాయాగ్రహణం మమామూలుగా నడిచిపోయింది. నిర్మాణ విలువలు ఓకే. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్.. 'అపరిచితుడు' కాన్సెప్ట్ తీసుకుని కామెడీగా కథను నడిపించాలని అనుకున్నాడు. కానీ కాన్సెప్ట్ వరకు ఓకే అయినా.. దాన్ని రెండు గంటల నిడివితో ఆసక్తికర సినిమాగా మలచడంలో అతను విఫలమయ్యాడు. రైటింగ్ లో మినిమం ఎఫర్ట్ కనిపించకపోవడంతో సన్నివేశాలు తేలిపోయాయి. కథకు గుండెకాయ లాంటి పాత్రను తీర్చిదిద్దిన విధానంలో.. దాన్ని చేసిన నటి నుంచి సరైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో కానీ.. దర్శకుడి ప్రతిభ ఏమీ కనిపించలేదు.
చివరగా: డార్లింగ్.. మిస్ ఫైర్!
రేటింగ్- 2/5