పోలీసులు వర్సెస్ రీల్ హీరో ...నెగ్గేదెవరు?
ఈ నేపథ్యంలో దర్శన్ నుంచి పోలీసులు సీజ్ చేసిన 37 లక్షలు తనకు తిరిగి ఇవ్వాలని కోర్టులో మరో పిటీషన్ వేసినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 21 Jan 2025 10:30 AM GMTఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రా గౌడ్ లకు రెగ్యులర్ బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. తొలుత దర్శన్ కు అనారోగ్యం కారణంగా కోర్టు మధ్యంత బెయిల్ మంజూర్ చేయగా అటుపై హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చింది. దీంతో దర్శన్ ఉపశమనం లభించింది. బెయిల్ రాగానే గుడులు గోపురాలు తిరిగాడు. తాజాగా మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు.
పూర్తి చేయాల్సిన పెండింగ్ ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో దర్శన్ నుంచి పోలీసులు సీజ్ చేసిన 37 లక్షలు తనకు తిరిగి ఇవ్వాలని కోర్టులో మరో పిటీషన్ వేసినట్లు తెలుస్తోంది. అలాగే తుపాకీ లైసెన్స్ కూడా రద్దు చేయోద్దని పోలీసు అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఈ లైసెన్స్ కు సంబంధించి పోలీస్ శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లైసెన్స్ రద్దవుతుందనే కారణంతో ముందుగానే పోలీసు శాఖను రద్దు వద్దు అంటూ కోరినట్లు తెలుస్తోంది.
సెలబ్రిటీ కావడంతో తాను ఎక్కడికి వెళ్లినా జనాలు గుమిగూడుతన్నారని..ఇది తనకి ఇబ్బందిగా మారుతుందని, ఈ క్రమంలో తనకు రక్షణ కావాలని కోరాడు. అలాగే వ్యక్తిగత కారణాలతో గన్ లైసెన్స్ రద్దు చేయోద్దని కోరాడు. ఈ కేసులో సాక్ష్యులను ఎవర్నీ తాను బెదిరించలేదని, అలా జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోండని లేఖలో పేర్కొన్నాడు. అయితే దర్శన్ కు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు అర్జీ దాఖలు చేసారు.
దర్శన్ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని ఫాం హౌస్ లో విశ్రాంతి తీసుకుంటోన్న దర్శన్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడని పోలీసులు అర్జీలో పేర్కొన్నారు. ఈ అర్జీపై త్వరలో విచారణ జరగనుంది. మరి దర్శన్ బెయిల్ రద్దవుతుందా? కొనసాగుతుందా? అన్నది చూడాలి. వాస్తవానికి రెగ్యులర్ బెయిల్ మంజూరైన వెంటనే పోలీసులు రద్దు పిటీషన్ వేసారు. కానీ దానిపై విచారణ జరిగినట్లు లేదు. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.