దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో నిశ్చితార్థం
నాని 'దసరా'లో నటించాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. అతడు ఓ ఇంటివాడవుతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు తనుజతో నిశ్చితార్థం చేసుకున్నారు.
By: Tupaki Desk | 3 Jan 2024 3:53 AM GMTనాని 'దసరా'లో నటించాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. అతడు ఓ ఇంటివాడవుతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు తనుజతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ వేడుక నుండి అద్భుత క్షణాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసాడు. షైన్ టామ్ చాకో ఈ సందర్భంగా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. చాకో -తనూజ జంట ఎంతో అందంగా ఉన్నారు.
షైన్ టామ్ చాకో కాబోయే భార్య తనుజ మోడల్. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఫోటోషూట్ వైరల్‌గా మారింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. పింక్ షర్ట్ - తెలుపు ప్యాంటులో టామ్ చాకో మెరుస్తూ కనిపించాడు. తనూజ అదే రంగులో లెహంగా ధరించింది. షైన్‌కి మునుపటి వివాహం నుండి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. మొదట షైన్ టామ్ చాకో 7 నవంబర్ 2023న తన ఫేస్‌బుక్ పేజీలో తనుజతో ఆకర్షణీయమైన ఫోటోగ్రాఫ్‌ను షేర్ చేయడం ద్వారా అభిమానులను టీజ్ చేసాడు. జీవితభాగస్వామి విషయంలో అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. షైన్ టామ్ చాకో చివరిసారిగా నాని దసరాలో కనిపించాడు.తదుపరి ఎన్టీఆర్ దేవరలో కనిపించనున్నాడు.
దళపతితో వివాదం:
కొన్ని నెలల క్రితం షైన్ టామ్ చాకో దళపతి విజయ్ నటనా నైపుణ్యాలను విమర్శించిన తర్వాత భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. మమ్ముట్టి లేదా మోహన్‌లాల్ అంత గొప్ప నటుడా? అని దళపతి విజయ్ ని ప్రశ్నించడంతో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఒక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నటుడు షైన్ టామ్ చాకో పరిశ్రమలో లింగభేధంతో వేతన వ్యత్యాసాన్ని ప్రస్థావిస్తూ మరోసారి వివాదాన్ని రేకెత్తించారు. ఇది అత్యంత చర్చనీయాంశమైన అంశం అని చాకో అన్నాడు.
పారితోషికం కేవలం లింగం లేదా నటనా నైపుణ్యాల ద్వారా నిర్దేశించరు. కానీ ఒక నటుడి స్టార్ పవర్ - ప్రేక్షకులను ఆకర్షించే వారి సామర్థ్యం ద్వారా కూడా నిర్దేశితమవుతుందని అతను చెప్పాడు. లేడీ సూపర్‌స్టార్ నయనతార పారితోషికంతో పోలిస్తే దళపతి అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు కదా? అని ప్రశ్నించగా.. సూపర్ స్టార్ అనే బిరుదు ఉన్న ప్రతి నటుడూ దళపతి విజయ్ కి సమానమైన పారితోషికం పొందాల్సిన అవసరం లేదని సూచించారు.
గతంలో షైన్ టామ్ చాకో బీస్ట్‌లో తన సహనటుడు దళపతి విజయ్ నటన గురించి ఒక ప్రకటన చేసాడు. ఇది విజయ్ అభిమానులకు కోపం తెప్పించింది. దళపతిని ఎత్తుకోవాల్సిన సన్నివేశం గురించి ఎత్తి చూపుతూ ''సాధారణంగా ఎవరైనా బరువును ఎత్తినప్పుడు ముఖంలో కష్టాన్ని చూడవచ్చు. కానీ విజయ్ మాత్రం తన ముఖంలో అలాంటివేమీ చూపించలేదు. అందుకు విజయ్ సర్ ని తప్పు పట్టలేం. చిత్రబృందమే కారణం'' అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు దళపతి అభిమానులు వీరంగం సృష్టించారు. సోషల్ మీడియాలో చాకోపై చాలా వ్యతిరేకత ఎదురైంది.