ట్రెండీ టాక్: ఇక నటరంగంలో వార్నర్ హిట్టింగ్
సినిమా రంగంతో క్రీడాకారుల అనుబంధం ఎల్లపుడూ చర్చనీయాంశమే. గ్లామర్‌తో క్రీడలు సులువుగా మమేకం అవుతాయి. అలాంటి అనుబంధం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి ఉంది.
By: Tupaki Desk | 4 March 2025 11:45 AM ISTసినిమా రంగంతో క్రీడాకారుల అనుబంధం ఎల్లపుడూ చర్చనీయాంశమే. గ్లామర్‌తో క్రీడలు సులువుగా మమేకం అవుతాయి. అలాంటి అనుబంధం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి ఉంది. అతడికి తెలుగు సినిమాలు అంటే పిచ్చి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఇమ్మిటేట్ చేస్తూ హృదయాలను గెలుచుకున్నాడు. బన్ని నటించిన అల వైకుంఠపురములో మొదలు `పుష్ప` వరకూ అతడు అనుకరించని ఫీట్స్ లేవు. అయితే ఇదంతా అతడు చాలా ఫన్ కోసం.. మంచి సత్సంబంధాలను కొనసాగించడం కోసం చేసినవి.
వార్నర్ తన డ్యాన్సులతో, ఆహార్యంతో చాలా అలరించాడు. ఇండియాలో ఏ ఇతర క్రికెటర్ కి లేనంతగా, భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు అదే గొప్ప క్వాలిటీ అతడిని నటుడిని చేస్తోంది. అంతేకాదు.. అతడు గ్లోబల్ ప్రపంచంలో హవా సాగిస్తున్న టాలీవుడ్ లో స్టార్ అవుతున్నాడు. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న `రాబిన్‌హుడ్` చిత్రంలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించనున్నాడు. ఆ మేరకు నిర్మాత రవిశంకర్ ఇటీవల ప్రీరిలీజ్ వేడుకలో అధికారికంగా కన్ఫామ్ చేసారు.
ఈ చిత్రంలో నితిన్- శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. రాబిన్ హుడ్ కథ మలుపులు ట్విస్టులతో కూడిన యాక్షన్-కామెడీ చిత్రం. మార్చి 28న అత్యంత భారీగా విడుదల కానుంది. ఇలాంటి క్రేజీ చిత్రంతో అతడు తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నాడు కాబట్టి, దేశవ్యాప్తంగా తనపై అటెన్షన్ పెరుగుతుంది. అతడు క్రికెట్ నుంచి విరమించాడు గనుక ఇప్పుడు వినోదపరిశ్రమలో చాలా చేయొచ్చు. అసవరమైన బ్యాకప్ అంతా వినోద పరిశ్రమలో సాధించుకునేంత సమయం అతడికి ఉంది. అతడు సినీపరిశ్రమల్లో స్టార్ అవ్వొచ్చు.. నిర్మాతగా ఎదగొచ్చు.. సొంత కంపెనీలు, బ్యానర్లను స్థాపించి పెద్ద ప్రొఫైల్ ని సృష్టించవచ్చు.
ముఖ్యంగా వార్నర్ నటిస్తున్న మొదటి సినిమాలో పాత్ర క్లిక్ అయితే చాలు, అతడికి వెంట వెంటనే సౌత్ లో ఆఫర్లు వెల్లువెత్తుతాయి. నటనను సీరియస్ గా తీసుకుంటే, అతడు మరో బాబి డియోల్ కూడా కాగలడు! 38 ఏళ్లకే వార్నర్ సినీరంగంలో అడుగుపెడితే, అతడు సెంచరీ కొట్టేవరకూ నటించవచ్చు. వార్నర్ నటనలోకి వస్తున్నాడు! అంటూ చాలా కాలంగా ఉన్న పుకార్లు ఇప్పటికి నిజం అవుతున్నాయి. ఇక డేవిడ్ వార్నర్ చూడటానికి భీకరమైన విలన్‌లా కనిపిస్తాడు. కానీ అలాంటి ధృఢమైన ఉన్నా కానీ చాలా సరదాగా, కామెడీని అద్భుతంగా పండించగలడు.
ఇండియాలో అతడికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అతడు పెద్ద స్టార్ అవ్వొచ్చు. ఇక అతడి మొదటి సినిమా పాత్ర ఏమిటన్నది తెలియాల్సి ఉంది. వార్నర్ ఉల్లాసకరమైన వ్యక్తిత్వాన్ని సరదాగా ఉండే తత్వాన్ని..తెరపై పాత్రలోను చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతకాలంగా సోషల్ మీడియాలకే పరిమితమైన వార్నర్ తదుపరి పెద్ద తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో ఉత్కంఠ పెంచుతోంది. చార్ట్ బస్టర్ పాటలకు స్టెప్పులేయడం, పంచ్ డైలాగులను ఇమ్మిటేట్ చేయడం వేరు. ఒక పూర్తి నిడివి ఉన్న పాత్రలో నటించడం వేరు. ప్రస్తుతానికి అతిథిగా నటిస్తున్నాడు. ఆ తర్వాత అతడి ఆలోచనలు ఏమిటన్నది వేచి చూడాలి.
రాబిన్‌హుడ్ యాక్షన్-కామెడీ చిత్రం. నితిన్ టైటిల్ రోల్ పోషించగా, శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ప్రధాన అసెట్స్ కానున్నాయి.