టాలీవుడ్ ఎంట్రీ.. లుక్కుతోనే కిక్కిచిన డేవిడ్ వార్నర్!
క్రికెట్ మైదానంలో ఓపెనింగ్ బ్యాటర్‌గా రికార్డులు సృష్టించిన ఈ హీరో, ఇప్పుడు హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
By: Tupaki Desk | 15 March 2025 3:02 PM ISTటాలీవుడ్‌కు కొత్త క్రేజ్ తీసుకురావడానికి మరో ఇంటర్నేషనల్ స్టార్ రంగంలోకి దిగిపోయాడు. అయితే, ఈసారి హాలీవుడ్ స్టార్ కాదు, క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నాడు. క్రికెట్ మైదానంలో ఓపెనింగ్ బ్యాటర్‌గా రికార్డులు సృష్టించిన ఈ హీరో, ఇప్పుడు హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, డేవిడ్ వార్నర్ ఇందులో ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. "ఫ్రమ్ బౌండరీ టు బాక్సాఫీస్" అంటూ రాబిన్ హుడ్ మూవీ టీం స్టైలిష్‌గా అతన్ని ఇండియన్ సినిమాలోకి పరిచయం చేసింది. టాలీవుడ్ అభిమానులకు, క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
పోస్టర్‌లో డేవిడ్ వార్నర్ కొత్త లుక్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. స్టైలిష్ ఆరెంజ్ జంప్‌సూట్ ధరించి కిందికి చూస్తూ, ఫోకస్‌లో కనిపిస్తున్న వార్నర్ స్టన్ అయ్యేలా చేశాడు. ఈ లుక్ సినిమాలో అతని క్యారెక్టర్ మీద ఆసక్తిని రెట్టింపు చేసింది. ఓ క్రికెట్ లెజెండ్‌ను వెండితెరపై చూడటం చాలా స్పెషల్ అనిపిస్తుంది. అయితే, అతని రోల్ చిన్నదా, లేక ప్రాధాన్యత ఉన్న క్యారెక్టరా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
వార్నర్‌కు తెలుగువారితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా సేవలందిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. అంతే కాకుండా, తెలుగులో పలు పాపులర్ సినిమాల డైలాగ్స్, స్టెప్పులతో రీల్స్ చేస్తూ వార్నర్ తనని తాను తెలుగువారికి దగ్గరగా మార్చుకున్నాడు.
ఇప్పుడీ క్రికెట్ స్టార్ నిజంగానే టాలీవుడ్ తెరపై కనిపించబోతుండటం విశేషం. రాబిన్ హుడ్ లో అతని పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని ఊహించవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ‘వార్నర్ మామా’ వెండితెరపై కూడా సిక్సర్లు కొడతాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు.