Begin typing your search above and press return to search.

సైఫ్‌పై దాడి కేసులో ద‌యా నాయ‌క్ ఎంట్రీ దేనికి?

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (54)పై గురువారం తెల్లవారుజామున ముంబైలో ఎటాక్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:46 PM GMT
సైఫ్‌పై దాడి కేసులో ద‌యా నాయ‌క్ ఎంట్రీ దేనికి?
X

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (54)పై గురువారం తెల్లవారుజామున ముంబైలో ఎటాక్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తన ఇంట్లో దుండ‌గుడి చేతిలో పదేపదే కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘ‌ట‌న‌ బాలీవుడ్ స‌హా అత‌డి అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స తర్వాత సైఫ్‌ ఖాన్ ప్రమాదం నుండి బయటపడ్డారని అతడి బృందం తెలిపింది.

దాడి ఘ‌ట‌న‌ తర్వాత సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఇంట్లో విచారణలో ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి దయా నాయక్ క‌నిపించ‌డం బిగ్గెస్ట్ స‌ర్ ప్రైజ్ గా మారింది. బాంద్రా వెస్ట్ లోని సైఫ్ అలీ ఖాన్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ముంబై పోలీసు అధికారులు పరిశోధ‌న కొన‌సాగించారు. సత్గురు శరణ్ అపార్ట్ మెంట్ లను సందర్శించిన అధికారులలో ప్రసిద్ధ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ కూడా ఉన్నారు.

అస‌లు ఈ ద‌యానాయ‌క్ ఎవ‌రు?

సినిమాలు చూసే వారికి ద‌యానాయ‌క్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత‌డు సీనియ‌ర్ ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్. ఎంద‌రో గ్యాంగ్ స్ట‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన డేరింగ్ ఆఫీస‌ర్. కర్ణాటకలోని ఉడిపిలో కొంకణి మాట్లాడే కుటుంబంలో జన్మించిన దయా నాయక్ బద్దా -రాధా నాయక్ దంపతుల చిన్న కుమారుడు. తన గ్రామంలోని కన్నడ మీడియం పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసిన తర్వాత, నాయక్ తన కుటుంబానికి సహాయం చేయడానికి ఉద్యోగం కోసం 1979లో ముంబై (అప్పటి బొంబాయి)కి ప్రయాణించాడు.

భారతదేశ ఆర్థిక రాజధానిలో అతడి మొదటి ఉద్యోగం ఒక హోటల్‌లో వెయిట‌ర్.. అతడు తాను పనిచేసిన హోటల్ పోర్టికోలో ఉండి చదువును కొన‌సాగించాడు. అలా క‌ష్టించి చ‌దువుకుంటూనే ముంబైలోని గోరేగావ్‌లోని మునిసిపల్ పాఠశాలలో త‌న 12వ తరగతి పూర్తి చేయగలిగాడు. ఇంట‌ర్ తరువాత అంధేరిలోని సిఇఎస్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

కాలేజ్ స్ట‌డీస్ త‌ర్వాత తాను పోలీసు అధికారిని కావాలని బ‌లంగా కోరుకున్నారు. అతడు ప్లంబింగ్ లో అప్రెంటిస్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో నార్కోటిక్స్ విభాగానికి చెందిన కొంతమంది పోలీసు అధికారులను కలిసినప్పుడు అతడి ప్ర‌తిభ‌కు మంత్ర‌ముగ్ధుల‌య్యారు. చివరికి 1995లో అతడు పోలీస్ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యాడు. ముంబైకి ఇంటి నుండి బయలుదేరిన 15 సంవత్సరాల తర్వాత జుహు పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ద‌యా నాయాక్ నియమితుడయ్యాడు. ముంబై అండర్ వరల్డ్ అరాచ‌కాలు పీక్స్ లో ఉన్న సమయం ఇది.

డిసెంబర్ 1996లో ముంబై జుహులోని ఇద్దరు చోటా రాజన్ గ్యాంగ్‌స్టర్లు అతడిపై కాల్పులు జరిపారని ఆరోప‌ణ‌లు రాగా, ఆ తర్వాత అతడు వారిని చంపాడు. దీంతో పోలీసు వర్గాలలో నాయక్ ఇమేజ్ అంత‌కంత‌కు పెరిగింది.

ఉన్నత స్థాయి పోలీసు అధికారుల‌కు వివాదాలు కొత్తేమీ కాదు. తన ఆదాయానికి మించి సంపదను కూడబెట్టారనే ఆరోపణలు రాగా, ఆయనపై విచారణ జరిగింది.

2004లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (MCOCA) కోర్టు ద‌యా నాయక్ అసమాన సంపదపై దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక బ్యూరో (ACB)ని ఆదేశించింది. ACB నాయక్‌పై కేసు నమోదు చేసి, బెంగళూరులోని రెండు ప్రదేశాలు సహా ఆరు ఇత‌ర‌ ప్రదేశాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో నాయక్ రెండు లగ్జరీ బస్సులను కలిగి ఉన్నట్లు తేలింది. ఒకటి ముంబైలో, అంధేరిలోని విశాల్ ట్రావెల్స్ అనే ట్రావెల్ ఏజెన్సీ కింద, మరొకటి కర్ణాటకలోని కార్కల పట్టణంలో ఉన్నాయి. నాయక్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. 2012లో ఆయనను అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) కంట్రోల్ రూమ్ అధికారిగా తిరిగి నియమించారు.