Begin typing your search above and press return to search.

రివ్యూ : దయా (వెబ్ సీరీస్)

By:  Tupaki Desk   |   5 Aug 2023 7:12 AM GMT
రివ్యూ : దయా (వెబ్ సీరీస్)
X

రివ్యూ : దయా (వెబ్ సీరీస్)

నటీనటులు: జేడీ చక్రవర్తి, రమ్య నంబేసన్, ఈషా రెబ్బా, జోష్ రవి, బబ్లూ పృథ్వీరాజ్, కమల్ కామరాజు, నంద గోపాల్, విష్ణు ప్రియ, గాయత్రి

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు

ఎడిటర్: విప్లవ్ నిషాదం

దర్శకుడు : పవన్ సాదినేని

నిర్మాతలు: శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని


జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో పవన్ సాధినేని డైరెక్షన్ లో వచ్చిన వెబ్ సీరీస్ దయా. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సీరీస్ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైంది. జేడీ దయా ఎలా ఉంది ఓటీటీ ఆడియన్స్ ని మెప్పించిందా లేదా అన్నది ఈ సమీక్షలో చూద్దాం.


కథ :


దయాకర్ అలియాస్ దయా (జేడి చక్రవర్తి) కాకినాడలో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. దయా భార్య అలివేలు (ఈషా రెబ్బ) గర్భిణిగా ఉంటుంది. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాలని హడావిడిగా తన లోడ్ దించి వెళ్తున్న దయాకి తన ఫ్రెండ్ ప్రభ (జోష్ రవి) మరో లోడ్ ఉందని అని ఫోన్ చేస్తాడు. అలివేలు కోసం ఇంటికి వెళ్లే దయా డబ్బు కోసం వెనక్కి వస్తాడు. దయా లోడ్ వేసుకుని డెలివరీకి వెళ్లగానే అక్కడ అతని ఫ్రీజర్ లో జర్నలిస్ట్ కవిత డెడ్ బాడీ ఉంటుంది. జర్నలిస్ట్ కవితని హత్య చేసింది ఎవరు..? దయా వ్యాన్ లోకి దాన్ని చేర్చింది ఎవరు..? ఎమ్మెల్యే పరశురామ రాజు (పృధ్వి రాజ్) కు జర్నలిస్ట్ కవిత హత్యకు సంబంధం ఏంటి..? కవిత భర్త కౌశిక్ (కమల్ కామరాజు) ఆమె నుంచి డైవర్స్ ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నాడు..? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే దయా వెబ్ సీరీస్ చూడాల్సిందే.


కథనం - విశ్లేషణ :


దయా వెబ్ సీరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ తో ఒక సరికొత్త క్రైం వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. నిజాయితీగా న్యాయంగా పోరాడే ఒక సిన్సియర్ జర్నలిస్ట్ హత్య నేపథ్యంతో ఈ సీరీస్ కథ నడుస్తుంది. సీరీస్ మొదట్లోనే దయా పాత్ర పరిచయం.. అతని చెవిటి తనాన్ని అమాయకత్వాన్ని చూపించిన డైరెక్టర్ ఆ తర్వాత అతని అసలు రూపాన్ని చూపించాడు. దయా వెబ్ సీరీస్ లో సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద చాలా లేయర్స్ చూపించాడు దర్శకుడు పవన్ సాధినేని.

సీరీస్ మొదట్లోనే ఒక అమ్మాయి తనకు తానుగా చెప్పుకునే మనోవేదనతో మొదలు పెట్టిన డైరెక్టర్ సినిమా అంతా కూడా అదే పంథాలో కొనసాగించాడు. సీరీస్ లో మొదటి ట్విస్ట్ కవిత మృతి చెందడం. ప్రముఖ జర్నలిస్ట్ మృతితో ఆమె హత్యకు ఎవరు కారణం అన్న యాంగిల్ లో చూపించాడు. ఈ క్రమంలో దయా వ్యాన్ లో ఆమె డెడ్ బాడీ ఉండటం పోలీసులకు దొరకకుండా అతను ఆ డెడ్ బాడీని వ్యాన్ లోనే ఉంచి తిరగడం జరుగుతుంది.

ఇక కవిత హత్య వెనుక స్వేచ్చ అనే అమ్మాయికి సపోర్ట్ చేయడమే అన్న రీజన్ ఆ తర్వాత రివీల్ అవుతుంది. ఎప్పుడైతే కవిత ఎమ్మెల్యే పరశురామ రాజు తో మీటింగ్ జరుగుతుందో అప్పుడే వీటన్నిటికి కారణం అతనే అన్న క్లూ దొరుకుతుంది. అయితే మరో పక్క స్వేచ్చ, కవితలకు సపోర్ట్ చేసిన వారందరినీ చంపుతూ విలన్ హడావిడి చేస్తుంటాడు. మూగ సైగలతో అతను చేసే మర్డర్లు కథకు సపోర్ట్ చేసినా ఎందుకో అంత మంచిగా అనిపించలేదు.

ఇక దయాలోని మరో కోణం చూపించే ఎపిసోడ్.. అతను నేపథ్యం ఏంటన్నది ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచారు. కానీ దయా ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఈ సీజన్ లో చూపించలేదు. తన మదర్ ని ఊరి నుంచి వెలివేయడం.. ఆమె సమాధి దగ్గర అతను బాధపడటం తప్ప.. కవిత డెడ్ బాడీ ఒక గోడౌన్ లో ఉన్న టైం లో దయా విలన్లను కొడుతున్న సీన్ లో అతనికి ఒక బలమైన నేపథ్యం ఉంది అని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఈషా రెబ్బ గురించి కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొన్ని చూపిస్తారు.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పట్టుకోవాల్సింది దయాని కాదు అలివేలుని అంటుంది అసలు అలివేలు ఎవరు ఆమె నేపథ్యం ఏంటన్న్నది కూడా సీజన్ 2 కోసం దాచినట్టు ఉన్నారు దర్శకుడు

వెబ్ సీరీస్ క్రైం థ్రిల్లర్ గా ఎంగేజ్ అయినట్టుగా అనిపించినా కొన్ని చోట్ల మాత్రం ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇక సీజన్ ని ముగిస్తూ సెకండ్ సీజన్ కు కవిత భర్తకు దయా ఇచ్చిన లెటర్ ఆధారంగా సీజన్ 2 మీద ఆడియన్స్ ఆసక్తి కలిగించేలా చేశాడు. దయా సీరీస్ సీజన్ 1 ఆడియన్స్ మెప్పించడంలో పాస్ అయిందని చెప్పొచ్చు.


నటీనటులు :


దయా పాత్రలో జేడీ చక్రవర్తి తన నేచురల్ యాక్టింగ్ తో మెప్పించారు. చాలా రోజుల తర్వాత జేడీని ఇలాంటి సెటిల్డ్ రోల్ లో చూపించారు. తన పాత్రకు జేడీ పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఇక అలివేలుగా ఈషా రెబ్బ తన వరకు బాగానే చేసింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చేసిన నటుడు కూడా బాగా చేశాడు. పృధ్వి రాజ్, జోష్ రవి, రమ్య ఇలా వారికి ఇచ్చిన పాత్రలన్ని పర్ఫెక్ట్ గా చేశారు.


సాంకేతిక వర్గం :


ఈ వెబ్ సీరీస్ కు కెమెరా వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బిజిఎం కూడా సందర్భానికి తగినట్టుగానే ఉంటుంది. సస్పెన్స్, క్రైం సీన్స్ లో కెమెరా వర్క్ కి మ్యూజిక్ కూడా బలమైంది. పవన్ సాధినేని ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి సినిమాలు చేశారు. సేనాపతి వెబ్ సీరీస్ కూడా అలరించింది. దయా సీరీస్ కూడా తన మార్క్ చూపించడానికి ప్రయత్నించాడు కానీ పూర్తి స్థాయిలో మెప్పించేలా చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.


చివరిగా : దయా.. థ్రిల్ చేస్తుంది కానీ..!