నటి హత్య కేసులో సవతి తండ్రికి మరణశిక్ష
నరమేధానికి కారకుడైన అతడికి మరణశిక్షను విధించింది.
By: Tupaki Desk | 25 May 2024 12:30 AM GMTదాదాపు 14 ఏళ్ల నాటి కేసు ఇది. ప్రముఖ నటిని, తనతో పాటు ఉన్న మరో ఐదుగురిని తుపాకీతో కాల్చి చంపిన నిందితుడిపై ఎట్టకేలకు కోర్టు తుది తీర్పును వెలువరించింది. నరమేధానికి కారకుడైన అతడికి మరణశిక్షను విధించింది. సంచలనం సృష్టించిన నాటి ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే..
హిందీ నటి లైలాఖాన్ హత్యోదంతంలో నిందితుడైన పర్వేజ్ తక్ కి కోర్టు మరణశిక్ష విధించింది. అతడు ఆమెకు సవతి తండ్రి. లైలా ఖాన్ హత్య జరిగిన పదమూడేళ్ల తర్వాత శుక్రవారం నాడు ముంబై సెషన్స్ కోర్టు లైలా (30), ఆమె అక్క అజ్మీనా (32), కవల తోబుట్టువులు జారా , ఇమ్రాన్ (25), కజిన్ రేష్మా , షెలీనా (51)లను హత్య చేసినందుకు పర్వేజ్ తక్‌కు మరణశిక్ష విధించింది.
అప్పట్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు తక్‌ను అరెస్టు చేసిన తొమ్మిది నెలల తర్వాత ఈ హత్య వెలుగులోకి వచ్చింది. జూలై 2012లో బాధితుల అస్థిపంజర అవశేషాలను ఫామ్‌హౌస్‌లోని తోటలో లభ్యమవ్వడంతో ఈ కేసులో నిజాలు బయటపడ్డాయి. తక్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ 40 మంది సాక్షులను విచారించింది. లైలా ఆమె కుటుంబం అదృశ్యమైన తర్వాత లైలా తండ్రి నాదిర్ పటేల్ దీనిపై విచారణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఇది నెలల తరబడి కొనసాగింది. చివరకు పరారీలో ఉన్న లైలా సవతి తండ్రి తక్ వారందరినీ చంపినట్టు వెలుగులోకి వచ్చింది.
ఒక రకంగా ఇది కుటుంబ వివాదం. షెలీనా లైలాఖాన్ తల్లి. తక్ షెలీనాకు రెండో భర్త. కానీ వారి మధ్య వివాదాలున్నాయి. ఆసిఫ్ షేక్‌తో షెలీనా సన్నిహిత సంబంధం విషయంలో అతడు అసహనంగా ఉన్నాడు. నటి లైలా తన బాయ్‌ఫ్రెండ్ అయిన వాఫీ ఖాన్‌ను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆ సమయంలో తన పాస్ పోర్ట్ తనతో లేనందున తక్ చాలా ఆవేదన చెందాడు. వారి కుటుంబ స్థావరాన్ని దుబాయ్‌కి తరలించాలనే కుటుంబం ప్రణాళికల గురించి అతను కలత చెందాడు. అతడు కేవలం ఆ ఇంట్లో సేవికుడిగా మాత్రమే ఉన్నానని బాధపడ్డాడు. ఆ తర్వాత రకరకాల పరిణామాలు హత్యోదంతానికి దారి తీసాయని కథనాలొచ్చాయి.
లైలా ఖాన్ ఎవరు?
2008లో విడుదలైన రాకేష్ సావంత్ దర్శకత్వం వహించిన `వాఫా: ఎ డెడ్లీ లవ్ స్టోరీ`లో రాజేష్ ఖన్నా సరసన నటించిన లైలా ఖాన్ బాగా పేరు తెచ్చుకుంది. లైలా ఖాన్ 2002 కన్నడ చిత్రం మేకప్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది.