ఇండియన్ సినిమాలకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు
సినీ ఇండస్ట్రీలోనే అన్నిటికంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు అంటే ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతీ ఒక్క టెక్నీషియన్ కలలు కంటూ ఉంటారు
By: Tupaki Desk | 24 March 2025 12:21 PM ISTసినీ ఇండస్ట్రీలోనే అన్నిటికంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు అంటే ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతీ ఒక్క టెక్నీషియన్ కలలు కంటూ ఉంటారు. నటీనటుల దగ్గర్నుంచి సాంకేతిక నిపుణుల వరకు అందరూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం కష్టపడుతూ ఉంటారు. తాజాగా ఈ ఆస్కార్ అవార్డ్స్ గురించి హీరోయిన్ దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులున్నారని దీపికా ఈ సందర్భంగా తెలిపారు. రీసెంట్ గా దీపిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేస్తూ అందులో ఆస్కార్ అవార్డుల గురించి తన పర్సనల్ ఒపీనియన్ ను షేర్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎన్నో గొప్ప గొప్ప కథలు తెరకెక్కాయని దీపికా ఈ సందర్భంగా తెలిపారు.
ఎన్నో గొప్ప కథలు ఇండియన్ సినిమా అందించినప్పటికీ ఆ కథలకు, సినిమాలకు, నటీనటులకు రావాల్సిన గుర్తింపు రాలేదని, ఎన్నో సందర్భాల్లో భారతీయులు అందుకోవాల్సిన ఆస్కార్ ను మన నుంచి దూరం చేశారని దీపిక అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అనౌన్స్ చేసినప్పుడు తాను అక్కడే ఆడియన్స్ లో కూర్చున్నానని, ఆ టైమ్ లో తానెంతో ఎమోషనల్ అయినట్టు దీపిక చెప్పుకొచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకూ, తనకూ ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఓ ఇండియన్ గా మాత్రమే తనకు ఆ క్షణంలో గర్వంగా, ఆనందంగా అనిపించిందని, ఆ గొప్ప క్షణాలను తానెప్పటికీ మర్చిపోలేనని దీపిక తెలిపారు. ఈ ఇయర్ ది బ్రూటలిస్ట్ సినిమాకు గానూ ప్రముఖ యాక్టర్ అడ్రియన్ బ్రాడీకి బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ రావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందిందని దీపిక షేర్ చేసింది.
ఇక ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఆర్ఆర్ఆర్ కు ఎం.ఎం కీరవాణి సంగీతం అందించగా, ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వరించిందనే విషయం తెలిసిందే.