Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : డిమాంటి కాలనీ-2

2015లో వచ్చిన హార్రర్ థ్రిల్లర్ 'డిమాంటి కాలనీ' తమిళంలో మంచి విజయం సాధించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రూపొందించాడు దర్శకుడు అజయ్ ఆర్.జ్ఞానముత్తు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 3:03 PM GMT
మూవీ రివ్యూ : డిమాంటి కాలనీ-2
X

'డిమాంటి కాలనీ-2' మూవీ రివ్యూ

నటీనటులు: అరుల్ నిధి-ప్రియ భవానీ శంకర్-అరుణ్ పాండ్యన్-ఆంటి జాస్కెలైన్-తెర్సింగ్ దోర్జీ-ముత్తుకుమార్-మీనాక్షి గోవిందరాజన్-సర్జానో ఖలీద్ తదితరులు

సంగీతం: సామ్ సీఎస్

ఛాయాగ్రహణం: హరీష్ కన్నన్

నిర్మాతలు: విజయ సుబ్రహ్మణియన్-రాజ్ కుమార్

రచన-దర్శకత్వం: అజయ్ ఆర్.జ్ఞానముత్తు

2015లో వచ్చిన హార్రర్ థ్రిల్లర్ 'డిమాంటి కాలనీ' తమిళంలో మంచి విజయం సాధించింది.ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రూపొందించాడు దర్శకుడు అజయ్ ఆర్.జ్ఞానముత్తు. తెలుగు ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తన బాయ్ ఫ్రెండ్ సామ్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో తన మరణం వెనుక రహస్యమేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది డెబ్బీ (ప్రియ భవానీ శంకర్). అందుకోసం దావోషి అనే బౌద్ధ స్వామీజీ సాయంతో సామ్ ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. తన ఆత్మకు.. శ్రీనివాస్-రఘునందన్ అనే కవల సోదరులకు సంబంధం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక మిస్టీరియస్ బుక్ చదివిన వాళ్లు ఆరేళ్లకోసారి చనిపోయి వారి ఆత్మలన్నీ ఒక చోట ఇరుక్కుపోతున్న విషయం కూడా వెల్లడవుతుంది. మళ్లీ ఆరేళ్లకు ఆ సైకిల్ పునరావృతం అయి.. పెద్ద ప్రమాదం చోటు చేసుకోబోతోందని ప్రియకు తెలియడంతో ఈ ప్రమాదాన్ని తప్పించడానికి ఆమె ఏం చేసింది.. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలేంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఓ ద‌ర్శ‌కుడు ఎంత గొప్ప క‌థైనా రాసుకోనీ.. అందులో ఎన్ని ట్విస్టులైనా ఉండ‌నీ.. ఎంత కొత్త‌ద‌న‌మైనా జోడించ‌నీ.. ప్రేక్ష‌కుల‌కు అది అర్థ‌మైతేనే ఆ సినిమాను ఆస్వాదించే అవ‌కాశ‌ముంది. కొంచెం న‌ర్మ‌గ‌ర్భంగా క‌థ‌ను.. స‌న్నివేశాల‌ను న‌రేట్ చేయ‌డం వ‌ర‌కు ఓకే. కానీ తెర మీద అస‌లేం జ‌రుగుతోందో అర్థం కాని అయోమ‌యం నెల‌కొంటే.. ప్ర‌తి స‌న్నివేశం గంద‌ర‌గోళంతో ప్రేక్ష‌కుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. స‌మాధానాలు దొర‌క‌ని ప్ర‌శ్న‌లు పేరుకు పోతుంటే.. చికాకు పుడుతుందే త‌ప్ప మంచి అనుభూతి క‌ల‌గ‌దు. డిమాంటి కాల‌నీ-2 సినిమా ప్రేక్ష‌కుల‌కు ఇలాంటి అనుభ‌వాన్నే మిగులుస్తుంది. ద‌ర్శ‌కుడు ఎంతో క‌స‌ర‌త్తు చేసి చాలా వైవిధ్యంగా అనిపించే క‌థేదో రాశాడు. కానీ ఏమాత్రం అర్థం కాని క‌థ‌న శైలి ప్రేక్ష‌కుల‌కు మిశ్ర‌మానుభూతినే మిగులుస్తుంది. ఏదో కొత్త‌గా చూస్తున్నాం అనిపిస్తూనే.. అస‌లు మ‌నం చూస్తున్న‌దేంటో అర్థం కాని క‌న్ఫ్యూజ‌న్ డిమాంటి కాల‌నీ-2ను యావ‌రేజ్ మూవీగా మార్చింది.

హార్ర‌ర్ సినిమాలంటేనే లాజిక్ తీసి అట‌క మీద పెట్టేయాలి. ఆత్మ అనే కాన్సెప్ట్ రాగానే క‌థ లాజిక్ కు దూరంగా న‌డుస్తుంది కాబ‌ట్టి ర‌చ‌యిత‌లు-ద‌ర్శ‌కుల ఊహ‌ల‌కు రెక్క‌లు వ‌చ్చేస్తుంటాయి. తెర మీద ఊహ‌కు అంద‌ని విధంగా ఎలాంటి ఫాంట‌సీని చూపించినా చెల్లిపోతుంది. కానీ ఆ చూపించేది క‌న్విన్సింగ్ గా.. అర్థ‌మ‌య్యేలా ఉండ‌డ‌మే కీల‌కం. డిమాంటి కాల‌నీలో క‌థ-స‌న్నివేశాలు చాలా కొత్త‌గా క్రేజీగా అనిపిస్తూనే.. క‌న్విన్స్ చేస్తాయి కూడా. క‌థ ప‌రంగా చూసుకుంటే డిమాంటి కాల‌నీ కంటే డిమాంటి కాల‌నీ-2లో ఇంకా కొత్త‌గా.. పెద్ద‌గా అనిపిస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ క‌థ‌ను మొద‌లుపెట్టిన విధానం.. ఒక ద‌శ వ‌ర‌కు ముందు తీసుకెళ్లిన తీరు.. ప్ర‌ధాన పాత్ర‌లు.. పార్ట్-1తో ముడిపెడుతూ క‌థ‌లో ఇచ్చిన ట్విస్టులు అన్నీ కూడా క్రేజీగా అనిపిస్తాయి. హీరోయిన్ ఆత్మ‌ల ప్ర‌పంచంలోకి వెళ్లి.. త‌న బాయ్ ఫ్రెండ్ ఆత్మ‌తో మాట్లాడే స‌న్నివేశం అయితే వారెవా అనిపిస్తుంది. డిమాంటి కాల‌నీ-1లో చ‌నిపోయిన హీరో పాత్ర‌కు.. పార్ట్-2లో క‌థ‌కు ముడిపెట్టిన విధానం కూడా చాలా కొత్త‌గా అనిపిస్తుంది. ఉత్కంఠ రేకెత్తించే మ‌లుపులు.. ర‌స‌వ‌త్త‌ర‌మైన సీన్ల‌తో ఒక ద‌శ వ‌ర‌కు డిమాంటి కాల‌నీ క్రేజీ రైడ్ లాగా అనిపిస్తుంది.

ఐతే ప్ర‌థ‌మార్ధంలోనే క‌థ.. పాత్ర‌ల ప‌రంగా క‌న్ఫ్యూజ‌న్ ప్రేక్ష‌కుల‌ను వెంటాడుతుంది. ఈ క‌న్ఫ్యూజ‌న్ అంతా త‌ర్వాత పోతుంద‌ని.. ద్వితీయార్ధంలో అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భిస్తాయని అనుకుంటాం. కానీ ద‌ర్శ‌కుడు సెకండాఫ్ లో ఈ క‌న్ఫ్యూజ‌న్ ను ప‌తాక స్థాయికి తీసుకెళ్లాడు. అస‌లు తెర‌పై ఏం జ‌రుగుతోందో అర్థం కాన‌ట్లుగా అంతులేని అయోమ‌యంతో సాగే స‌న్నివేశాలు చికాకు పెట్టిస్తాయి. ద్వితీయార్ధంలో హీరో హీరోయిన్లు.. బౌద్ధు గురు ఒక రెస్టారెంట్లో ఇరుక్కుపోయాక అక్క‌డ వారికి ఎదుర‌య్యే అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య గంట‌కు పైగా క‌థ న‌డుస్తుంది. ఐతే ఇక్క‌డ‌ ఒక మాయా ప్ర‌పంచాన్ని సృష్టించే క్ర‌మంలో విప‌రీతంగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ మీద ఆధార‌ప‌డ్డారు. అవి ప్రేక్ష‌కుల‌కు త‌లపోటు తెప్పిస్తాయి. ఏ పాత్ర ఏంటో.. ఏది ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో అర్థం కాక‌.. ఒక్క స‌న్నివేశంలోనూ లాజిక్ క‌నిపించ‌క బుర్ర వేడెక్కిపోతుంది. సినిమా ముగిశాక‌ కూడా చాలా ప్ర‌శ్న‌లు స‌మాధానాలు లేకుండా అలాగే మిగిలిపోతాయి. పాత్ర‌ల మీద ఒక స్ప‌ష్ట‌త రాదు. సినిమా అంతా అయ్యాక ఈ క‌థ ఏంటని అడిగితే స‌మాధానం చెప్ప‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అంత గంద‌ర‌గోళంగా క‌థ‌ను న‌రేట్ చేశాడు ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు. ఐతే పార్ట్-3కి లీడ్ ఇస్తూ సాగే ప‌తాక స‌న్నివేశాలు మాత్రం వావ్ అనిపించేలా ఉన్నాయి. ఎప్పుడూ చూసే హార్ర‌ర్ సినిమాల‌కు భిన్నంగా క‌థ‌ త్త‌గా అనిపించ‌డం.. సినిమా విజువ‌ల్ గా బాగుండ‌డం.. కొన్ని మ‌లుపులు సినిమాను వాచ‌బుల్ గా మార్చాయి. కానీ క‌న్ఫ్యూజ‌న్ న‌రేష‌న్ మాత్రం సినిమాకు పెద్ద మైన‌స్.

నటీనటులు:

మూడీగా క‌నిపించే అరుల్ నిధి నుంచి గొప్ప న‌ట‌న‌నేమీ ఆశించ‌లేం. డిమాంటి కాల‌నీ-1లో కూడా అత‌డి ప్ర‌త్యేక‌తేమీ క‌నిపించ‌దు. క‌థ‌లో ఒక పాత్ర‌లాగా క‌నిపిస్తాడు త‌ప్ప హీరో అనిపించ‌డు. పార్ట్-2లో అత‌ను ప్ర‌త్యేకంగా చేసిందేమీ లేదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌కు సూట‌య్యాడు కానీ.. పెర్ఫామెన్స్ ప‌రంగా సాధార‌ణంగా అనిపిస్తాడు అరుల్ నిధి. ఐతే క‌థ‌లో అత్యంత కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించిన ప్రియ భ‌వానీ శంక‌ర్ మాత్రం అద‌ర‌గొట్టింది. భ‌యాన్ని, ఉత్కంఠ‌ను ప‌లికించ‌డంలో ఆమె ప్ర‌త్యేక‌త క‌నిపిస్తుంది. త‌న అప్పీయ‌రెన్స్ కూడా ఈ పాత్ర‌కు బాగానే సూట‌యింది. సినిమాలో బెస్ట్ పెర్ఫామ‌ర్ ప్రియ‌నే. ఇండియ‌న్-2లో మామూలుగా అనిపించిన ప్రియ‌.. ఈ సినిమాలో త‌న న‌ట కౌశ‌లాన్ని చూపించింది. బౌద్ధ గురు పాత్ర‌లో చేసిన న‌టుడు ఓకే. ముత్తుకుమార్ బాగా చేశాడు. మిగ‌తా ఆర్టిస్టులంతా పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతిక వర్గం:

టెక్న‌క‌ల్ గా డిమాంటి కాల‌నీ-2 ఉన్న‌త ప్ర‌మాణాల‌తోనే సాగింది. సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు పేరుప‌డ్డ అత‌ను.. రేసీ బీజీఎంతో ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ‌ను పెంచాడు. హరీష్ కన్నన్ ఛాయాగ్ర‌హ‌ణం కూడా బాగుంది. విజువ‌ల్స్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌ల‌కు ఢోకా లేదు. సినిమా రిచ్ గానే క‌నిపిస్తుంది. కానీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాత్రం అంత గొప్ప‌గా లేవు. అజయ్ జ్ఞాన‌ముత్తు తానొక భిన్న‌మైన ర‌చ‌యిత‌-ద‌ర్శ‌కుడు అని మ‌రోసారి చాటాడు. అత‌ను రాసుకున్న క‌థ కొత్త‌గా.. క్రేజీగా అనిపిస్తుంది. డిమాంటి కాల‌నీకి.. పార్ట్-2కు స‌రిగ్గా లింక్ చేసి ప్రాప‌ర్ సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కానీ కాన్సెప్ట్ చాలా బాగున్నా.. అత‌డి స్క్రీన్ ప్లే మాత్రం చాలా గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. న‌రేష‌న్లో క్లారిటీ ఉండుంటే డిమాంటి కాల‌నీ-2 రీచ్ పెరిగేది. ఒక స్పెష‌ల్ ఫిలింగా నిలిచేది.

చివరగా: డిమాంటి కాల‌నీ-2.. క్రేజీగా.. గ‌జిబిజిగా

రేటింగ్- 2.5/5