'రిపబ్లిక్' క్లైమాక్స్‌పై తేజ్ పట్టుదల..!
తాజాగా ఈ విషయాన్ని స్వయంగా దేవకట్టా చెప్పుకొచ్చారు. సాయి దుర్గ తేజ్ కొత్త సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో పలువురు దర్శకులు పాల్గొన్నారు.
By: Tupaki Desk | 13 Dec 2024 3:30 PM GMTమెగా హీరో సాయి దుర్గ తేజ్, దేవ కట్టా కాంబోలో వచ్చిన 'రిపబ్లిక్' సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, రివ్యూవర్స్ నుంచి పాజిటివ్ రేటింగ్ వచ్చినా వసూళ్లు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకు కారణం సినిమా క్లైమాక్స్ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. దర్శకుడు తీసుకున్న పాయింట్ చాలా బాగుంది, సాయి దుర్గ తేజ్ నటన అంతకు మించి ఉంది. కానీ క్లైమాక్స్‌లో హీరో చనిపోవడం అనేది చాలా మందికి నచ్చలేదు. అందుకే సినిమాకు కమర్షియల్‌గా నష్టం మిగిలింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా మాస్ ఆడియన్స్ హీరో పాత్ర చనిపోవడంను ఒప్పుకోరు. విచారకరమైన ఎండింగ్‌ను అస్సలు సహించని తెలుగు ప్రేక్షకులు ఏకంగా హీరో చనిపోతే ఎలా ఒప్పుకుంటారని దేవ కట్టాను చాలా మంది ఆ సమయంలోనే ప్రశ్నించారు. కథ రాసుకున్న సమయంలో హీరో పాత్ర చనిపోయినట్లుగా రాసుకున్నా, ఆ తర్వాత మార్చాలని దర్శకుడు దేవ కట్టా అనుకున్నారట. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. సినిమా కథను ముందుగా అనుకున్న ప్రకారం ముందుకు తీసుకు వెళ్దామని అన్నారట.
తాజాగా ఈ విషయాన్ని స్వయంగా దేవకట్టా చెప్పుకొచ్చారు. సాయి దుర్గ తేజ్ కొత్త సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో పలువురు దర్శకులు పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌లోనే దేవా కట్టా పాల్గొన్నారు. ఆ సమయంలో తేజ్ గురించి దేవా కట్టా మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు అడిగినది ఇచ్చేందుకు తేజ్ ఎంత కష్టమైన పడుతాడని, సినిమా కోసం ఏం చేసేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా ఉంటాడు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. రిపబ్లిక్ సినిమా సమయంలో క్లైమాక్స్ గురించి మాతో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు.
రిలీజ్ రోజు సినిమా బాగుంది కానీ చివర్లో హీరో చనిపోవడం నచ్చలేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అందుకే సినిమా ఆఖరి సీన్ తీసేద్దామా అని తేజ్ తో అన్నాను. కానీ క్లైమాక్స్ మారిస్తే ఈ సినిమా నాది కాదు అంటూ తేల్చి చెప్పారు. క్లైమాక్స్ విషయంలో ఆయన చాలా పట్టుదలతో వ్యవహరించారు. అందుకే క్లైమాక్స్‌ను మార్చకుండానే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని దేవా కట్టా పేర్కొన్నారు. క్లైమాక్స్ మార్చినంత మాత్రాన హిట్ అయితే అది తేజ్ పూర్తి స్థాయి విజయంగా భావించలేదు. అందుకే క్లైమాక్స్ మార్పుకు నో చెప్పారు అని దేవ కట్టా అన్నాడు.