'దేవకీ నందన వాసుదేవ' మూవీ రివ్యూ
'హీరో' సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఆ చిత్రం నిరాశ పరిచింది. అతను కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'దేవకీ నందన వాసుదేవ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
By: Tupaki Desk | 22 Nov 2024 12:08 PM GMT'దేవకీ నందన వాసుదేవ' మూవీ రివ్యూ
నటీనటులు: అశోక్ గల్లా-మానస వారణాసి-దేవ్ దత్త నాగె-దేవయాని-శత్రు-శ్రవణ్-ఝాన్సీ-గెటప్ శీను-సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్- ప్రసాద్ మూరెళ్ళ
కథ: ప్రశాంత్ వర్మ
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: బాలకృష్ణ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
'హీరో' సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఆ చిత్రం నిరాశ పరిచింది. అతను కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'దేవకీ నందన వాసుదేవ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కంసరాజు (దేవ్ దత్త నాగె) పరమ దుర్మార్గుడు. తన ఊరిలో తన కళ్లు పడ్డ భూములను సొంతం చేసుకుంటూ.. ఎదురు వచ్చిన వాళ్లందరినీ అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగుతుంటాడు. అతడికి తన చెల్లి చెల్లికి పుట్టే మూడో సంతానం ద్వారా ప్రాణ గండం ఉందని కాశీలో ఒక అఘోరా చెప్పిన మాటతో ఆమెను ఒక సంతానానికి పరిమితం చేసి తన భర్తను చంపేస్తాడు. ఐతే అంతలో ఓ హత్య కేసులో చిక్కుకుని అతను జైలు పాలవుతాడు. తిరిగి వచ్చేసరికి కంసరాజు మేనకోడలు సత్య (మానస వారణాసి) పెరిగి పెద్దవుతుంది. ఆ అమ్మాయిని కృష్ణ (అశోక్ గల్లా) ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది కానీ.. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ అతణ్ని అయోమయంలోకి నెడుతుంది. అప్పుడే సత్య పుట్టుకకు సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి.. ఇంతకీ కంసరాజు ప్రాణ గండం సంగతి ఏమైంది.. ఈ విషయాలు తెర మీదే తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
కార్తికేయ-2.. కాంతార.. హనుమాన్ లాంటి సినిమాలు విజయవంతం అయ్యాక.. వాటిని అనుకరించే సినిమాలు ఎక్కువైపోయాయి. చారిత్రక నేపథ్యం తీసుకోవడం.. దేవుడి ఎలిమెంట్ పెట్టడం.. రొటీన్ గా కథను నడిపించేసి మమ అనిపించడం.. ఇదీ వరస. 'దేవకీ నందన వాసుదేవ' అచ్చంగా అలాంటి ప్రయత్నమే. భాగవతం రెఫరెన్స్ తీసుకుని 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ పరంగా ఏదో ట్రై చేశాడు కానీ.. దానికి పేలవమైన స్క్రీన్ ప్లే తోడవడం.. నరేషన్ మరీ ఓల్డ్ స్టయిల్లో ఉండడంతో 'దేవకీ నందన వాసుదేవ' ఏమాత్రం వర్కవుట్ కాలేదు. రెండు గంటల తక్కువ నిడివి సినిమా అయినా.. ఎప్పుడు ముగుస్తుందా అని ప్రేక్షకులు నిరీక్షించేలా చేసే నీరసమైన నరేషన్ ఈ చిత్రానికి పెద్ద మైనస్. కథానాయిక పాత్రకు సంబంధించి ఇందులో చూపించిన ఓ ఎలిమెంట్ ఎగ్జైటింగ్ గా అనిపించినా.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన తీరు నిట్టూర్పులనే మిగులుస్తుంది.
పైన చెప్పుకున్న కార్తికేయ-2.. కాంతార.. హనుమాన్ లాంటి చిత్రాల్లో కేవలం దేవుడి ఎలిమెంట్ ఉండడం వల్ల అవి ఆడేయలేదు. ఆ ఎలిమెంట్ ను ఎంత ఆసక్తికరంగా చూపించారన్నదే వాటి ఫలితాలను నిర్దేశించింది. కేవలం పదే పదే దేవుడిని చూపించి.. బ్యాగ్రౌండ్లో మంత్రాలు పఠించేసి.. దేవుడు-విధి-జననం-మరణం-మృత్యువు అంటూ భారమైన డైలాగులు పెట్టేసినంత మాత్రాన ప్రేక్షకులు ఉద్వేగంతో ఊగిపోరనడానికి 'దేవకీ నందన వాసుదేవ' రుజువు. సినిమా ఆరంభమైన తీరే ఇదొక రొటీన్ సినిమా అనే సంకేతాలను ఇస్తుంది. విలన్ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం.. అతడి బ్యాక్ స్టోరీ సినిమా మీద ఆసక్తిని చంపేస్తుంది. ఆ తర్వాత రొటీన్ ఎలివేషన్.. పరిచయ సన్నివేశంతో మొదలయ్యే హీరో పాత్ర కూడా ఆసక్తిని పెంచదు. హీరోయిన్ పాత్ర చాలాసేపు సాధారణంగా అనిపిస్తుంది. తర్వాత ఆ పాత్రకు సంబంధించి ట్విస్ట్ ఇచ్చి కొంత ఆసక్తి రేకెత్తించినా.. తర్వాత షరా మామూలే.
హీరో హీరోయిన్ల ప్రేమకథ కానీ.. విలన్ పున:ప్రవేశంతో మొదలయ్యే డ్రామా కానీ ప్రేక్షకుల్లో మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయవు. హీరోయిన్.. ఆమె తల్లి పడ్డ కష్టాలను చూపించి కొంచెం ఎమోషన్ పిండడానికి ప్రయత్నించగా.. అదీ వర్కవుట్ కాలేదు. ఆ సన్నివేశాల్లో మెలోడ్రామా బాగా ఎక్కువైపోయింది. అక్కడక్కడా సాయిమాధవ్ డైలాగుల్లో కొన్ని మెరుపులు కనిపిస్తాయి తప్ప.. ఆ సంభాషణల్లో ఉన్న లోతుకు తగ్గట్లు సన్నివేశాలు ఉండవు. పదే పదే కాశీలో అఘోరాను చూపించి విపరీతమైన ఆవేశంతో ఏవో డైలాగులు చెప్పించారు కానీ.. అదంతా అతిగా అనిపిస్తుంది. అంతకంతకూ ఆసక్తి సన్నగిల్లిపోయేలా సాగే కథ.. ఏ దశలోనూ ఊపందుకోని కథనం.. చాలా బోరింగ్ గా నడిచే సన్నివేశాలు.. 'దేవకీ నందన వాసుదేవ'ను సహనానికి పరీక్షలా మారుస్తాయి. కొంచెం తక్కువ నిడివితో తెరకెక్కడం మినహాయిస్తే ఇందులో చెప్పుకోదగ్గ సానుకూలతలు ఏమీ లేవు.
నటీనటులు:
అశోక్ గల్లా 'హీరో' తర్వాత చాలా టైం తీసుకుని ఈ సినిమా చేశాడు. కానీ తన తొలి సినిమానే దీని కంటే అన్ని రకాలుగా బెటర్ అనిపిస్తుంది. కొంచెం చలాకీగా నటించే ప్రయత్నం చేశాడు కానీ.. బేసిగ్గా తన పాత్రలో హుషారు పుట్టించేలా లేదు. ఆరంభంలో ఆ పాత్రకు ఇచ్చిన బిల్డప్ కి.. తర్వాత అది నడిచే తీరుకు పొంతన లేదు. కథ హీరో చుట్టూ తిరిగేది కూడా కాకపోవడంతో ఆ పాత్ర అనుకున్నంతగా హైలైట్ కాలేదు. అశోక్ నటన పర్వాలేదు. కథానాయిక మానస వారణాసికి కీలకమైన పాత్రే దక్కింది కానీ.. ఆమె అంతగా ఆకట్టుకోలేకపోయింది. తన అప్పీయరెన్స్.. నటన మామూలుగా అనిపిస్తాయి. విలన్ పాత్రలో దేవ్ దత్త నాగె పర్వాలేదు. దేవయాని.. ఝాన్సీ బాగానే చేశారు. శత్రును కామెడీ కోసం వాడుకున్నారు కానీ.. అతను నవ్వించలేకపోయాడు. గెటప్ శీనుది నామమాత్రమైన పాత్ర. సంజయ్ స్వరూప్ కూడా అంతే.
సాంకేతిక వర్గం:
పిండి కొద్దీ రొట్టె అన్నట్లు 'దేవకీ నందన వాసుదేవ' టెక్నికల్ గా కూడా ఏమంత గొప్పగా లేదు. భీమ్స్ సిసిరోలియో పాటలు.. నేపథ్య సంగీతం.. మామూలుగా సాగిపోయాయి. రసూల్ ఎల్లోర్-ప్రసాద్ మూరెళ్ళ లాంటి అనుభవజ్ఞులైన ఛాయాగ్రాహకులు పని చేశారు కానీ.. విజువల్స్ లో మెరుపులేమీ లేవు. నిర్మాణ విలువలు ఓకే. హనుమాన్ దర్వకుడు ప్రశాంత్ వర్మ కథ అంటే చాలా ఊహించుకుంటాం కానీ.. ఇందులో అంత విశేషమేమీ లేదు. ఈ కథకు సరైన కథనం జోడించి ఉంటే మెరుగుపడేదేమో కానీ.. అలాంటి ప్రయత్నమేమీ జరగలేదు. దర్శకుడిగా అర్జున్ జంధ్యాల పూర్తిగా నిరాశపరిచాడు.
చివరగా: దేవకీ నందన వాసుదేవా.. పేరు మాత్రమే గొప్ప
రేటింగ్-1.75/5