శేఖర్ మాస్టర్ పై ట్రోల్స్.. రెస్పాండ్ అవుతారా?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.
By: Tupaki Desk | 5 Sep 2024 10:36 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చ తెలుగమ్మాయి పాత్రలో సందడి చేయనుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దేవర పార్ట్ -1 గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్, చుట్టమల్లె పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో అదే జోష్ తో మేకర్స్ మూడో సాంగ్ దావూదీని రీసెంట్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. కొరమీనా నిన్ను కోసుకుంటా ఈయాలా.. అంటూ సాగుతున్న దేవర థర్డ్ సింగిల్ ఫుల్ ఫాస్ట్ బీట్ లో ఉంది. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ కు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ వేసిన స్టెప్పులు వేరే లెవెల్ లో ఉన్నాయనే చెప్పాలి.
అయితే దావూదీ సాంగ్ ఓవైపు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ టాప్ ట్రెండింగ్ లో నిలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతోంది. నెట్టింట మీమ్స్, ట్రోల్స్ తెగ కనిపిస్తున్నాయి. సాంగ్ చాలా బాగుందని తారక్ ఫ్యాన్స్ చెబుతుండగా.. ట్యూన్, బీట్, స్టెప్స్ కాపీ పేస్ట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శేఖర్ మాస్టర్ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు.
శేఖర్ మాస్టర్ క్రియేటివిటీ అయిపోయిందని, అదే స్టెప్స్ రిపీట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దళపతి విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు హల్మితి హబీబో పాటతో దావూదీని పోల్చుతున్నారు. దావూదీ సాంగ్ స్టెప్పులు.. ఆల్ మోస్ట్ అరబిక్ కుతు స్టెప్పులు లాగే ఉన్నాయని చెబుతున్నారు. రెండు సాంగ్స్ ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ అసలు.. ఎందుకిలా చేశారని నెట్టింట ప్రశ్నిస్తున్నారు.
అయితే అరబిక్ కుతు సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో వైరల్ అయింది. భారీ సంఖ్యలో నెటిజన్లు రీల్స్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఆ సాంగ్ స్టెప్పులు ఫుల్ ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు వాటిని శేఖర్ మాస్టర్ కాపీ కొట్టారని నెటిజన్లు అంటున్నారు. దారుణంగా ఆయన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. మరి వీటిపై శేఖర్ మాస్టర్ స్పందిస్తారేమో వేచి చూడాలి