దావూదీ పాట.. ఎందుకలా చేశారు?
పాటలో మేజర్ హైలైట్స్ అనిపించే వాటిని దాచి ఉంచుతారు. కానీ ‘దావూది’ పాట విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది.
By: Tupaki Desk | 8 Sep 2024 4:40 AM GMTజూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ‘దేవర’ నుంచి ఇటీవలే ‘దావూదీ’ పాట రిలీజైన సంగతి తెలిసిందే. మామూలుగా క్రేజీ మూవీస్ నుంచి కొత్త పాటలేవైనా రిలీజ్ చేస్తే.. అవి లిరికల్ వీడియోలుగానే ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న స్టెప్స్ చూపించి.. మిగతా ఫొటోలు, లిరిక్స్‌తో మేనేజ్ చేస్తారు. పాటలో మేజర్ హైలైట్స్ అనిపించే వాటిని దాచి ఉంచుతారు. కానీ ‘దావూది’ పాట విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది.
దాదాపు మూడు నిమిషాల నిడివితో వీడియో సాంగ్ రిలీజ్ చేసేశారు. ఇంత పెద్ద సినిమా నుంచి ముందే ఇలా వీడియో సాంగ్ రిలీజ్ చేసేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. థియేటర్లో సర్ప్రైజ్ చేయకుండా ముందే ఇలా మొత్తం ఎందుకు చూపించేశారన్నది అర్థం కాలేదు. ఐతే దీని వెనుక వేరే కారణం ఉందని వెల్లడైంది.
దావూదీ పాట సినిమాలో ఉండదట. ఈ పాటను ప్లేస్ చేయడానికి సరైన సందర్భం కుదరలేదట. దీంతో సినిమా ముగిశాక ఈ సాంగ్‌ను రోలింగ్ టైటిల్స్‌లో వేస్తారట. సినిమాలో లేని పాట, పైగా రోలింగ్ టైటిల్స్ అందరూ చూడరు కాబట్టి.. ముందే ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసేశారట.
‘దేవర-2’కు హింట్ ఇచ్చిన తర్వాత రోలింగ్ టైటిల్స్‌తో పాటుగా ఈ పాట ప్లే అవుతుంది. ఐతే యూట్యూబ్‌లో ప్రస్తుతం ఒక ఊపు ఊపుతున్న ఈ పాట బిగ్ స్క్రీన్ మీద కూడా మంచి ఉత్సాహాన్నే ఇచ్చేలా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ పాట కోసమైనా రోలింగ్ టైటిల్స్ పూర్తిగా చూసే ఎన్టీఆర్ ఫ్యాన్స్ బయటికి అడుగు పెడతారు. ‘దేవర-1’లో ఇది కాకుండా మూడు పాటలు ఉంటాయని సమాచారం. చివరి పాట లిరికల్ వీడియోను త్వరలోనే రిలీజ్ చేస్తారు.