Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలోనూ 'దేవర' అదే జోరు..!

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న దేవర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 7:11 AM GMT
ఆస్ట్రేలియాలోనూ దేవర అదే జోరు..!
X

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న దేవర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరికొన్ని గంటల్లో యూఎస్ తో పాటు కొన్ని దేశాల్లో ప్రీమియర్ షో లు పడబోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యుయెల్‌ రోల్‌ చేసిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దేవర సినిమా ఉంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగే విధంగా ప్రమోషన్స్ చేశారు. అంతే కాకుండా రెండు ట్రైలర్‌ లూ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఈ సినిమా ను యూఎస్ తో పాటు ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్న విషయం తెల్సిందే.


యూఎస్ లో విడుదలకు ముందే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను ప్రీ సేల్‌ ద్వారా రాబట్టిన దేవర సినిమా ఆస్ట్రేలియాలోనూ మంచి వసూళ్లను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఎస్ తో పోల్చితే ఆస్ట్రేలియాలో ఇండియన్‌ సినిమాల మార్కెట్‌ తక్కువగా ఉంటుంది. అయినా దేవర సినిమా 13 స్క్రీన్స్ లో విడుదల అవ్వబోతుంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే ప్రారంభం అయిన ప్రీ సేల్‌ లో 3 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలకు ముందు మరింతగా ప్రీ సేల్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా 5 లక్షల డాలర్లు నమోదు కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆస్ట్రేలియాలో దేవర సినిమా లాంగ్‌ రన్‌ పూర్తి అయ్యే వరకు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. ఆస్ట్రేలియా లో మిలియన్ డాలర్ల వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలు అక్కడ మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేశాయి. దేవర ఆ రేర్‌ నెంబర్‌ ను అందుకుంటే కచ్చితంగా బిగ్గెస్ట్‌ సక్సెస్ గా చెప్పుకోవచ్చు. యూఎస్ లో 5 మిలియన్ డాలర్ల టార్గెట్‌ తో విడుదల కాబోతుంది. ఇప్పటికే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు పూర్తి చేసింది. మరో మూడు మిలియన్ డాలర్లను రాబట్టాల్సి ఉంది. లాంగ్‌ రన్‌ లో అది అసాధ్యం కాకపోవచ్చు.

ఎన్టీఆర్ డ్యుయెల్‌ రోల్‌ లో నటించిన దేవర సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించింది. బాలీవుడ్ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్‌ కాంబోలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తాయంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల రీ రికార్డింగ్‌ పూర్తి చేసిన సంగీత దర్శకుడు అనిరుధ్‌ మాట్లాడుతూ దేవర సినిమా లోని కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్ చూస్తుంటే హాలీవుడ్‌ సినిమా లను చూస్తున్న ఫీల్‌ కలిగిందని అన్నారు. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొదటి రోజు రూ.100 కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి అది సాధ్యమేనా చూడాలి.