'దేవర' టీం తేలిగ్గా తీసుకుందా?
మొత్తం వ్యవహారం చూస్తుంటే.. దేవర టీం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ ఈవెంట్‌ను తేలిగ్గా తీసుకున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 23 Sep 2024 3:36 PM GMTదేవర సినిమా విడుదలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉంది. ఈ చిత్రాన్ని హిందీలో, తమిళంలో కొంచెం గట్టిగానే ప్రమోట్ చేశారు. తెలుగులో పబ్లిసిటీ ఇంకా ఎక్కువే చేస్తారని అనుకున్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ఉంటుందని అనుకున్నారు. కానీ మాంచి హైప్ ఉన్న ఈ భారీ చిత్రానికి ఓపెన్ ఏరియాలో కాకుండా నోవాటెల్ లాంటి వేదికను ఎంచుకోవడమే అభిమానులను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ వెన్యూ గురించి తెలిసేసరికే టీంకు ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేసే ఉద్దేశం లేదా అన్న అనుమానాలు కలిగాయి. తారక్ నుంచి ఆరేళ్ల తర్వాత వస్తున్న సోలో సినిమా.
దీని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తారక్ స్పీచ్ కోసం వాళ్లు అమితాసక్తితో ఉన్నారు. ఇది వారికి చాలా ఎమోషనల్ మూమెంట్. అలాంటి ఈవెంట్‌కు నోవాటెల్‌ను వేదికగా చేసుకోవడమే అభిమానులకు రుచించలేదు.
తారక్ అభిమానులు ఉత్సాహానికి, ఉద్వేగానికి సరిపోయే వేదిక కాదు నోవాటెల్. అక్కడ ఈవెంట్ అన్నపుడే ఇది సజావుగా జరుగుతుందా అన్న సందేహాలు కలిగాయి. పరిమితికి మించి అభిమానులు వస్తారన్నది అంచనా వేయలేని విషయం కాదు. అక్కడ వారిని నియంత్రించడం కష్టమనీ తెలుసు. అయినా పరిస్థితులు హద్దులు దాటుతాయని అంచనా వేయలేకపోయారా అని సందేహం కలుగుతోంది. మొత్తం వ్యవహారం చూస్తుంటే.. దేవర టీం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ ఈవెంట్‌ను తేలిగ్గా తీసుకున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రి రిలీజ్ ఈవెంట్ విషయంలో వారిలో అంత ఆసక్తి లేదా.. సరైన వేదిక ఎంచుకోవడం, పకడ్బందీ ఏర్పాట్లు చేయడం లాంటి వాటి మీద ఉద్దేశపూర్వకంగానే దృష్టిపెట్టలేదా అన్న చర్చ జరుగుతోంది. ఓపెన్ ఏరియాలో ఈవెంట్ చేయాలంటే ఎంతో శ్రమ, ఖర్చు అవుతుంది. ‘దేవర’ టీం దగ్గర ప్రధానంగా అంత టైం లేదని తెలుస్తోంది. అందరూ రిలీజ్ హడావుడిలో ఉన్నారు.
తారక్ యుఎస్ వెళ్లాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు కావాల్సినంత హైప్ ఉంది కాబట్టి.. ఇక్కడ ప్రత్యేకంగా ప్రమోషన్లు అవసరం లేదనుకున్నట్లున్నారు. అందుకే నోవాటెల్‌లో మమ అనిపించాలనుకున్నారు. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం, అభిమానుల అత్యుత్సాహం వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రమోషనల్ ఈవెంట్ లేకుండానే సినిమా రిలీజ్‌కు వెళ్లిపోతోంది.