Begin typing your search above and press return to search.

'దేవర' మూవీ రివ్యూ

అదే.. దేవర. 'జనతా గ్యారేజ్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కిన క్రేజీ మూవీ ఇది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 5:01 AM GMT
దేవర మూవీ రివ్యూ
X

'దేవర' మూవీ రివ్యూ

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్-జాన్వి కపూర్-సైఫ్ అలీఖాన్-ప్రకాష్ రాజ్-అజయ్-శ్రీకాంత్-:శ్రుతి మరాఠె-కలైయరసన్-గెటప్ శీను-సుదేవ్ నాయర్-నరేన్ తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: రత్నవేలు

నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్-హరికృష్ణ

రచన-దర్శకత్వం: కొరటాల శివ

కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ పెద్ద సినిమా వచ్చింది. అదే.. దేవర. 'జనతా గ్యారేజ్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కిన క్రేజీ మూవీ ఇది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏ మేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:


బయటి ప్రపంచానికి దూరంగా.. సముద్రం ఒడ్డున ఉండే నాలుగు ఊర్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుచుకుంటారు అక్కడి జనం. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వాళ్లు మన దేశం నుంచి కొల్లగొట్టి సముద్ర మార్గంలో తరలిస్తున్న దేశ సంపదను వారి నుంచి దోచుకుని సామాన్య జనానికి పంచడం ద్వారా ఇక్కడి వాళ్లు మంచి ప్రాచుర్యం పొందుతారు. కానీ కాల క్రమంలో సముద్రం మీద అక్రమంగా రవాణా అయ్యే వస్తువులను పట్టుకొచ్చి వాటి యజమానులకు అందించడం ఈ ఎర్రసముద్రంలో కొందరి జీవనాధారంగా మారుతుంది. ఐతే తాము చేస్తున్నది ఎంత పెద్ద తప్పిదమో కొంత ఆలస్యంగా గ్రహించిన ఈ బృంద నాయకుడు దేవర (జూనియర్ ఎన్టీఆర్).. ఇకపై ఈ పని ఆపేయాలని ఎర్రసముద్రంలో అల్టిమేటం జారీ చేస్తాడు. కానీ ఆ బృందంలోని భైరా (సైఫ్ అలీఖాన్)తో పాటు మరి కొందరికి దేవర ఆలోచన నచ్చదు. దీంతో వాళ్లు దేవరకు ఎదురెళ్తారు. ఈ క్రమంలో దేవర హఠాత్తుగా అదృశ్యమవుతాడు. దేవర ఆచూకీ కోసం భైరా.. తన మనుషులు వెతుకుతూనే ఉంటారు. మరోవైపు దేవరకు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న అతడి కొడుకు వర (ఎన్టీఆర్) ద్వారానే దేవర ఆచూకీ కనుగొనాలని ఎత్తుగడ వేస్తాడు భైరా. ఆ ఎత్తుగడ ఏంటి.. ఇంతకీ దేవర ఏమయ్యాడు.. భైరా పన్నాగం పారిందా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

మనం ఎప్పుడూ చూసే మనుషులను.. పరిస్థితులను.. సంఘటలను.. తెర మీద చూపిస్తే ప్రేక్షకులు ఈజీగా రిలేట్ చేసుకుని ఆ సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేయడం ఒక ఎత్తు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న సాధారణ క్రతువే. ఐతే దీనికి భిన్నంగా ఒక ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించి.. అందులోని మనుషులను.. పరిస్థితులను.. సంఘటనలను గమ్మత్తుగా చూపించడం ద్వారా ప్రేక్షకులకు ఒక భిన్నమైన అనుభూతిని కలిగించడం మరో ఎత్తు. ఇప్పుడు చాలా మంది ఫిలిం మేకర్స్ రెండో మార్గాన్ని సక్సెస్ మంత్రగా ఎంచుకుంటున్నారు. 'బాహుబలి', 'కేజీఎఫ్' లాంటి చిత్రాలు ఇందుకు స్ఫూర్తిగా నిలిచాయి. ఐతే నేపథ్యం ఎంత కొత్గగా అనిపించినా.. సాంకేతికంగా ఎంత మాయాజాలం చేసినా.. ఆ ప్రపంచంతో ప్రేక్షకులు ఏదో ఒక రకంగా రిలేటవడం.. అక్కడ చూపించే పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడడం చాలా కీలకం. అది జరిగినపుడు ఈ కొత్త ప్రపంచం తాలూకు హంగులు ఆకర్షణగా మారి సినిమాకు మంచి ఫలితం దక్కుతుంది. కానీ ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడనపుడు.. ఆ ప్రపంచం కృత్రిమంగా తయారై మొత్తం వ్యవహారమే చెడిపోతుందనడానికి 'ఆచార్య' సినిమా ఓ ఉదాహరణగా నిలిచింది. ఒకసారి ప్రయత్నించి ఫెయిలైన కొరటాల శివ.. పంతం పట్టి మళ్లీ అలాంటి ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించి ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని పంచాలని 'దేవర'తో ట్రై చేశాడు. ఈసారి ఆయన ప్రయత్నం కొంచెం మెరుగైన ఫలితాన్నందించింది. 'దేవర'లో చూపించే మరో ప్రపంచం ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేయదు. అలా అని నిరాశపరచదు. మూడు గంటల పాటు ఓ మోస్తరు వినోదంతో టైంపాస్ అయితే చేయిస్తుంది.

బయటి ప్రపంచానికి దూరంగా అనగగనా ఓ ఎర్ర సముద్రం.. బ్రిటిష్ వాళ్లు కొల్లగొట్టి సముద్ర మార్గాన తరలించే దేశ సంపదను దోచుకునిపేద ప్రజలకు పంచే అక్కడి యోధులు.. కానీ కాల క్రమంలో ఓడల్లో సరకును దోచుకోవడాన్ని వృత్తిగా మార్చుకుని దొంగలుగా పేరు పడ్డ ఈ యోధుల వారసులు.. వారి మధ్య ఓ సంఘర్షణ.. అందులోంచి పుట్టుకొచ్చిన ఒక హీరో.. ఓ విలన్.. ఇలా సినిమా మొదలైన తీరు చూస్తే కొరటాల శివ కొంచెం భిన్నంగా.. భారీగా అనిపించే సెటప్ తో కథ పరంగా కసరత్తు గట్టిగానే చేసినట్లు అనిపిస్తుంది. ఈసారి కూడా 'ఆచార్య' తరహా కృత్రిమత్వపు ఛాయలు కొంత కనిపించినా.. అది శ్రుతి మించకుండా చూసుకున్నాడు కొరటాల. సముద్రం నేపథ్యంలో విజువల్స్ కొత్తగా అనిపించడం.. కథలో తరచుగా ఓ మలుపు రావడం.. ఓ పెద్ద యాక్షన్ ఘట్టం పడడం.. అనిరుధ్ ఎనర్జిటిక్ బీజీఎం సినిమాలో ప్రేక్షకుల దృష్టిమరలకుండా.. ఊపు తగ్గకుండా చూశాయి. ఐతే నేపథ్యం భిన్నంగా అనిపించినా.. కథ పరంగా వైవిధ్యం లేకపోవడం.. కథనం కూడా మామూలుగా సాగిపోవడం నిరాశ కలిగిస్తుంది. మూడు గంటల సుదీర్ఘ నిడివితో సాగిన సినిమాలో సన్నివేశాలు ఏదో అలా సాగిపోతుంటాయి తప్ప.. వారెవా అనిపించే ఎపిసోడ్లు లేకపోవడంతో 'దేవర' గ్రాఫ్ ను తగ్గిస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన 'దేవర' సినిమాలో పెద్ద ఎన్టీఆర్ పాత్రే కథకు అత్యంత కీలకం. ఆ పాత్ర సినిమాలో కనిపించేది తక్కువ సమయమే అయినా.. దాని తాలూకు ప్రభావం సినిమా అంతా కొనసాగుతుంది. ఐతే ఆ పాత్రను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకులకు బలంగా రిజిస్టర్ చేయాల్సింది. కథ.. పాత్రలు.. మలుపుల పరంగా 'బాహుబలి' స్ఫూర్తి కనిపిస్తుంది కానీ.. ఆ సినిమాలో మాదిరి ప్రధాన పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచలేకపోయాడు కొరటాల శివ. యాక్షన్ ఘట్టాలను చాలా బాగా డిజైన్ చేశారు.. చిత్రీకరణ కూడా అత్యున్నత స్థాయిలో సాగింది కానీ.. ఆ యాక్షన్ ఘట్టాలకు ముందు అవసరమైన బిల్డప్ మాత్రం సరిగా జరగలేదు. ప్రేక్షకుల్లో భావోద్వేగాలు పెరిగి.. ఇప్పుడు హీరో విజృంభించాలి అనిపించేలా సన్నివేశాలను బిల్డ్ చేసి ఉంటే.. అత్యున్నత స్థాయిలో తెరకెక్కిన యాక్షన్ ఘట్టాలు మరింత కిక్కు ఇచ్చేవి. అందరిలో ఒకడిలా ఉన్న హీరోలో ఒక పరివర్తన రావడానికి బలమైన కారణం కనిపించదు. ఆ మార్పు తర్వాత అతను ఒక నాయకుడిగా.. ప్రత్యేకమైన వ్యక్తిగా మారే క్రమాన్ని ఇంకా బలంగా చూపించాల్సింది. దేవర పాత్రకు అవసరమైన వెయిట్ ఎన్టీఆర్ తన పెర్ఫామెన్స్ తో తీసుకొచ్చినా కొరటాల తన వైపు నుంచి ఇంకా ఆ పాత్రను పుష్ చేయాల్సిందనిపిస్తుంది. దేవర గురించి అందరూ ఆహా ఓహో అని చెప్పడం.. విపరీతమైన బిల్డప్ ఇవ్వడమే తప్ప.. దృశ్యరూపంలో దాన్ని ఫీల్ కాలేం. హీరోతో స్నేహంగానే ఉంటూ తనను వెన్ను పోటు పొడిచే విలన్ వ్యవహారం ఎన్నో సినిమాల్లో చూసిందే కాబట్టి సైఫ్ అలీఖాన్ పాత్ర సాధారణంగానే అనిపిస్తుంది.

కథ.. సెటప్ పరంగా 'ఆచార్య'తో పోలికలు కనిపించినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిపోవడం.. ఏ సన్నివేశం భరించలేని విధంగా లేకపోవడంతో ప్రేక్షకులకు టైం పాస్ అయిపోతుంది. ఎర్రసముద్రం నేపథ్యంలో కథ మొదట్లోనే ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్ చేయిస్తుంది. విజువల్స్ ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. యాక్షన్ ఘట్టాలు.. పాటలు.. నేపథ్య సంగీతం ప్రేక్షకులను డ్రైవ్ చేస్తాయి. ప్రథమార్ధం వరకు 'దేవర' ఏదో అలా టైంపాస్ చేయించేస్తుంది. కానీ కథ పరంగా ఏదో ఒక దశలో ఆశ్చర్యపరిచే విషయం ఉంటుందని.. వర పాత్ర రంగప్రవేశంతో కొత్త ఉత్సాహం వస్తుందని.. జాన్వి కపూర్ పాత్రలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తే.. ఇవన్నీ కాస్త నిరాశ కలిగిస్తాయి. తారక్-జాన్వి ట్రాక్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. 'చుట్టమల్లే..' పాటలో జాన్వి అందంగా కనిపించి ఆకట్టుకుంటుంది కానీ.. అంతకుమించి ఏ ప్రత్యేకతా లేదు. ద్వితీయార్ధంలో ఎర్ర సముద్రం వ్యవహారం రొటీన్ గా.. సాగతీతగా అనిపిస్తుంది. 'దేవర' కథ.. వర పాత్రకు సంబంధించిన ట్విస్టు గురించి ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రచారం నడిచింది. సినిమాలో దీనికి భిన్నంగా.. ఆశ్చర్యపరిచేలా ఏమీ లేకపోవడమే ట్విస్ట్. పతాక ఘట్టంలో నీటిలో సాగే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. ఊహించదగ్గదే అయినా ట్విస్ట్ బాగానే పేలింది. 'దేవర' కోసం కొరటాల ఎంచుకున్న నేపథ్యం ఈ సినిమాకు పెద్ద ఎసెట్. దీని వల్ల సినిమాకు ఒక కొత్త లుక్ వచ్చింది. కథ పరంగా రొటీన్ అనిపించినా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కమర్షియల్ అంశాలకు లోటు లేదు. తారక్ కోసం.. యాక్షన్ ఘట్టాల కోసం.. సాంకేతిక హంగుల కోసం 'దేవర'పై ఓ లుక్కేయొచ్చు. పార్ట్-2 కోసం ఇచ్చిన లీడ్ చూస్తే 'బాహుబలి' ఛాయలు కనిపిస్తాయి. అయినా సరే రెండో భాగం మీద ఆసక్తి రేకెత్తించగలిగాడు కొరటాల.

నటీనటులు:

దేవరగా.. వరగా.. రెండు ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ బాగుంది. ఈ రెండు క్యారెక్టర్లలో వైవిధ్యం చూపించాడు. ఆయా పాత్రలకు తగ్గట్లుగా తన గెటప్స్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. కథలో కీలక సన్నివేశాల్లో తారక్ ఎమోషన్లను బాగా పలికించాడు. దేవర పాత్రలో రౌద్రాన్ని బాగా చూపించాడు. అక్కడక్కడా సాధారణంగా నడిచే సన్నివేశాలను కూడా తారక్ నిలబెట్టాడు. ఐతే ఆరంభంలో ఎగ్జైటింగ్ గా అనిపించే దేవర క్యారెక్టర్.. తర్వాత పట్టు తప్పడం నిరాశ కలిగిస్తుంది . జాన్వి కపూర్ 'చుట్టమల్లే' పాట కోసమే సినిమాలో ఉందా అనిపిస్తుంది. ఆ పాటలో తన అందచందాలు కుర్రకారును బాగా ఆకట్టుకుంటాయి. తన పాత్ర మాత్రం నామమాత్రంగా అనిపిస్తుంది. నటన పరంగా ప్రత్యేకంగా చాటుకోవడానికి సరైన సీన్లే పడలేదు. విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఓకే అనిపించాడు. భైరగా మొదట్లో తన గెటప్ సరిగా కుదరలేదు. వయసు మళ్లాక ఆ పాత్రకు సూటయ్యాడు అనిపిస్తుంది. సింగప్పగా కథను నరేట్ చేసే పాత్రలో ప్రకాష్ రాజ్ బాగానే చేశాడు. శ్రీకాంత్ మామూలు పాత్రలోనే కనిపించాడు. దేవర భార్య పాత్రలో శ్రుతి మరాఠె తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె చూడ్డానికి బాగుంది. నటన కూడా ఆకట్టుకుంటుంది. సుదేవ్ నాయర్ నెగెటివ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం:


అనిరుధ్ రవిచందర్ పాటలు.. నేపథ్య సంగీతం మంచి ఊపుతో సాగాయి. కానీ.. కొంచెం ఓల్డ్-ట్రెడిషనల్ సెటప్ లో సాగే సినిమాలో తన మ్యూజిక్ మరీ ఆధునికంగా అనిపించి సింక్ కాలేదనిపిస్తుంది. హీరో ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాల్లో అనిరుధ్ బీజీఎం అదిరిపోయింది రత్నవేలు ఛాయాగ్రహణం సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. ప్రతి సన్నివేశంలోనూ విజువల్స్ కంటికింపుగా ఉండి ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఓకే. ఆర్ట్ వర్క్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా మెరుగ్గా ఉండాాల్సిందనిపిస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ ఒకప్పటి సినిమాల స్థాయిలో వావ్ అనిపించలేదు. అదే సమయంలో 'ఆచార్య' తరహాలో నిరాశపరచనూ లేదు. ఆయన ఎంచుకున్న కథ.. దాని నేపథ్యం బాగున్నాయి. కథనం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. సినిమాను రెండు భాగాలుగా చేయడం వల్ల పార్ట్-1ను కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. పార్ట్-2 లీడ్ చూస్తే.. ఆయన 'బాహుబలి'ని ఫార్ములాను అనుసరించాడా.. ఆ సినిమా ప్రభావం తన మీద పడిందా అనిపిస్తుంది.

చివరగా: దేవర.. 'కొత్త' ప్రపంచంలో 'పాత' వినోదం

రేటింగ్- 2.5/5